గ్రూప్ వన్ కొట్టాలని 15 ఉద్యోగాలొస్తే వద్దన్న కుర్రాడు...

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గగనమైపోతోంది. ముందుముందు ప్రభుత్వరంగంలో అసలు ఉద్యోగాల భర్తీ ఉంటుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

By :  Admin
Update: 2024-04-11 04:23 GMT

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గగనమైపోతోంది. ముందుముందు ప్రభుత్వరంగంలో అసలు ఉద్యోగాల భర్తీ ఉంటుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగమంటే ఒక భరోసా. అందుకనే ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చినపుడల్లా అటెండర్ పోస్టు కావచ్చు ఆఫీసర్ పోస్టూ కావచ్చు లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇచ్చిన నోటిఫికేషన్లకు సక్రమంగా పరీక్షలు నిర్వహించలేక, పరీక్షలు నిర్వహించినా ఇంటర్వ్యూల్లో అవకతవకలని నానా గోల జరుగుతోంది. దాంతో ఎవరో కోర్టులో కేసు వేస్తారు వెంటనే కోర్టు మొత్తం ప్రక్రియ పైన స్టే ఇచ్చేస్తుంది. దాంతో ఉద్యోగాల భర్తీ ఆగిపోతుంది, నిరుద్యోగులు ఉసూరుమంటారు.


మొన్నటివరకు తెలంగాణాలో నోటిఫికేషన్లంటే ఏమి జరిగిందో అందరు చూసిందే. ఈ నేపధ్యంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటే ఎంతకష్టమో అందరికీ తెలిసిందే. అయితే ఒక కుర్రాడికి మాత్రం ప్రభుత్వఉద్యోగాలు, ప్రభుత్వరంగాల్లో ఉద్యోగాలొచ్చి ఒళ్ళో వాలిపోతున్నాయి. అయస్కాంతానికి ఇనుము వచ్చి అతుక్కున్నట్లుగా ఈ కుర్రాడికి ఉద్యోగాలొచ్చి ఒళ్ళో పడిపోతున్నాయి. ఇతనికి వచ్చిన ఉద్యోగాలు చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ కుర్రడంటే ఎంత లవ్వో అనిపించకమానదు. విషయం ఏమిటంటే సూర్యాపేట జిల్లాలో నేరేడుచెర్ల మండలం ఉంది. అక్కడే రమావత్ మధుసూదన్ అనే బీటెక్ గ్రాడ్యుయేట్ ఉన్నాడు.


ఉద్యోగాల మీద ఉద్యోగాలు


రెండురోజుల క్రితమే వచ్చిన ఇండియన్ బ్యాక్స్ అండ్ పర్సనల్ సర్వీసు(ఐబీపీఎస్) ఫలితాల్లో కెనరా బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. బీటెక్ చదివిన కుర్రాడు రమావత్ కు కెనరా బ్యాంకులో పీవో ఉద్యోగం రావటం ఏమంత గొప్పనుకుంటున్నారా ? ఉంది నిజంగా రమావత్ గొప్పోడనే చెప్పాలి. ఎందుకంటే మూడేళ్ళల్లో ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్ధల్లో 15 ఉద్యోగాలు సంపాదించాడు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కర్నాటకలో పీవోగా చేరి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇది తప్పించి ఇంకెందులోను చేరలేదు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగం సాధించటమే తన లక్ష్యంగా చెబుతున్నాడు.


కర్నాటక ఎస్బీఐలో ప్రొఫెషనరీ ఆఫీసరుగా ఉద్యోగంలో చేరగానే తెలంగాణాలో గ్రూప్ 1 పరీక్షలకు నోటిఫికేషన్ వచ్చిందట. అందుకనే గ్రూప్ 1 పరీక్షలకు అవసరమైన ప్రిపరేషన్ కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి సూర్యాపేటకు వచ్చేశాడు. అంతకుముందు రమావత్ ఆర్బీఐ, ఐబీపీవో ద్వారా రెండు బ్యాంకులకు పీవో గా ఎంపికయ్యాడు. ఎల్ఐసీలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆపీసర్, ఎస్ఐఏసీఎల్లో పీవోగా, జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ గా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ గ్రేడ్-3 అధికారిగా ఎంపకయ్యాడు. ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కూడా ఎంపికయ్యాడు.


ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ క్లరికల్ ఉద్యోగానికి, టీఎస్ క్యాబ్ లో మేనేజర్ గా కూడా సెలక్టయ్యాడు. ఒకరికి ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటేనే నానా అవస్తలు పడతారు. కోచింగ్ తీసుకుని జీవితంలో ఎంతోముఖ్యమైన ఆరు మాసాలో లేకపోతే ఏడాది కాలాన్నో తపస్సులగా ప్రిపరేషన్ కు అంకితంచేస్తే తప్ప ఉద్యోగం వచ్చేది అనుమానమే. అలాంటిది మూడేళ్ళల్లో 15 ఉద్యోగాలు రావటం అందులో దేనిలోను రమావత్ చేరకపోవటం ఆశ్చర్యమే. వచ్చిన ఉద్యోగాల్లో ఎందుకు చేరలేదంటే పోస్టింగ్ ఇచ్చిన ప్రాంతం, ఆ ప్రాంతంలో వాతావరణం నచ్చకపోవటం లాంటి అనేక కారణాల వల్ల ఏ ఉద్యోగంలోను చేరలేదన్నాడు. గ్రూప్-1 లేదా స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ద్వారా మంచి ఉద్యోగం సంపాదించటమే టార్గెట్ గా చెప్పాడు. గ్రూప్-1. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ లో ఏదోక ఉద్యోగం సంపాదించగలననే నమ్మకం ఉందని రమావత్ చెప్పాడు. ప్రభుత్వంలో మంచిఉద్యోగం సంపాదించటమే లక్ష్యంగా తాను కష్టపడుతున్నట్లు రమావత్ చెప్పాడు. మరి నెక్స్ట్ టార్గెట్ లో సక్సెస్ కావాలని రమావత్ కు ఆల్ ది బెస్ట్ చెబుదామా.


ఈ ఇద్దరు కూడా భేష్


రమావతే కాదు నల్గొండజిల్లా చింతపల్లికి చెందిన శ్రీకాంత్, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన ఉదయ్ హసన్ కు కూడా ప్రభుత్వ ఉద్యోగాలొచ్చి ఒళ్ళో వాలుతున్నాయి. అంటే ఉద్యోగాలు ఊరికే ఏమీ రావటంలేదు. కాలం విలువ తెలుసుకుని, కాలంతో పోటీపడి తపనతో ప్రిపేర్ అవటం వల్లే ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలొస్తున్నాయి. శ్రీకాంత్ కు గడచిన మూడేళ్ళల్లో బ్యాంకులు, ఇన్స్వూరెన్సు కంపెనీల్లో తొమ్మిది ఉద్యోగాలొచ్చాయి. అలాగే ఉదయ్ కు ఏడాదిలోనే బ్యాంకులు, ఇన్స్వూరెన్స్, ఆర్బీఐలో ఏకంగా ఎనిమిది ఉద్యోగాలొచ్చాయి.


Tags:    

Similar News