'ఓట్ చోరీ' ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు
భారత కూటమి అధికారంలోకి వస్తే బీహార్ ప్రజలకు రూ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామన్న వయనాడ్ ఎంపీ ప్రియాంక ..
కాంగ్రెస్(Congress) నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) బుధవారం (నవంబర్ 5) బీహార్(Bihar)లో పర్యటించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ చంపారన్ జిల్లా వాల్మీకి నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగించారు. ఎన్డీఏ కూటమిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ ఓట్ల దొంగతనానికి పాల్పడి అధికారంలోకి రావాలని చూస్తోందని ఆరోపించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(S.I.R) ద్వారా మహిళలు సహా 65 లక్షల మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని విమర్శించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితి బ్రిటిష్ పాలనను తలపిస్తోందన్నారు.
‘ఓటుతో బుద్ధి చెప్పండి’
"నా సోదరుడు రాహుల్ ఈ రోజు హర్యానాలో 'ఓట్ల దొంగతనం' గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. అక్రమాలకు పాల్పడుతోన్న ఎన్డీఏను మీరు ఎందుకు భరించాలి. మీ ఓటులో అధికారం నుంచి వారిని దూరం పెట్టండి" అని ఓటర్లను కోరారు.
ప్రధాని మోదీపై విమర్శలు..
ప్రధాని మోదీపై ప్రియాంక విరుచుకుపడ్డారు. నేరాలు, అవినీతిని నియంత్రించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కంటే కాంగ్రెస్ పోస్టర్‌లో ఆర్జేడీ నాయకుడు, భారత కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఫొటో లేకపోవడం గురించే ఆయన ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తుందని విమర్శించారు.
‘ఆరోగ్య బీమా కల్పిస్తాం’
భారత కూటమి అధికారంలోకి వస్తే బీహార్ ప్రజలకు రూ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. ఇంకా "ప్రతి పేద కుటుంబంలో ఒకరిని ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు మేం మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తాం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే అన్ని పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. బీజేపీ నేతల ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ’’ అని కోరారు.