Tiger Attack | పులి దాడిలో యువతి మృతి, మృతదేహంతో బంధువుల ధర్నా
పులి దాడిలో ఓ యువతి మరణించిన విషాద ఘటన కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగింది. మృతురాలి బంధువులు మృతదేహంతో అటవీశాఖ కార్యాలయం ముందు భైఠాయించారు.
By : Shaik Saleem
Update: 2024-11-29 07:46 GMT
మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి శుక్రవారం ఉదయం ఓ యువతిని పొట్టన బెట్టుకున్న దారుణ ఘటన శుక్రవారం ఉదయం కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ లో జరిగింది. గన్నారం గ్రామానికి చెందిన మోర్తె లక్ష్మీ (21) శుక్రవారం ఉదయం పత్తి తీసేందుకు పొలానికి వచ్చింది. పొలం పత్తి తీస్తుండగా వెనుక నుంచి ఒక్కసారిగా పులి దాడి చేసింది.(Tiger Attack ఈ దాడిలో యువతి లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడి రక్తస్రావం అవుతుండగా లక్ష్మీని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లక్ష్మీ మరణించిందని వైద్యులు ప్రకటించారు. (Young woman dies)
అటవీశాఖ కార్యాలయం ముందు బైఠాయించిన బంధువులు
పులి దాడిలో లక్ష్మీ మరణించిన ఘటనతో ఆమె కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో బంధువులు కాగజ్‌నగర్ అటవీశాఖ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ విషయమై కాగజ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరుసగా పులుల దాడులు
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గత కొన్ని వారాలుగా పులులు సంచరిస్తున్నాయి. గురువారం ఉదయం వాంకిడి మండలం సోనాపూర్ అటవీ ప్రాంతంలో పశువుల మందపై కూడా పులి దాడి చేసింది. గత ఆదివారం ఇదే మండలంలోని బండకస గ్రామం కోర్ దొబ్రలొద్ది ప్రాంతంలో మరో ఆవుల మందపై పులి దాడి చేసింది. ఈ దాడిలో ఒక ఆవు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల పశువులపై జరుగుతున్న దాడులు సమీప గ్రామాల గిరిజన రైతులను భయాందోళనకు గురవుతున్నారు. అటవీగ్రామాల్లో పులుల సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరామని డీఎఫ్ఓ శివసింగ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
రైతుల భయాందోళనలు
పులి దాడిలో మహిళ మృతి చెందడంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రైతలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.పులుల సంచారంతో అటవీ గ్రామాల్లో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పులి కదలికలను పర్యవేక్షించేందుకు అటవీశాఖ అధికారులు కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేసి ట్రాకర్లను ఏర్పాటు చేశారు. పులితో ఆకస్మిక ఘర్షణలను నివారించాలని, అడవుల్లోకి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు సూచించారు. వన్యప్రాణుల నుంచి పంటలను రక్షించడానికి విద్యుత్ కంచెలను ఏర్పాటు చేయడం ద్వారా పులికి హాని కలిగించవద్దని అధికారులు రైతులను కోరారు.మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా అడవుల్లో నివసించే పులి గత వారం తెలంగాణ అడవుల్లోకి వచ్చిందని అటవీశాఖ అధికారులు చెప్పారు.