విద్యార్థి చీకటి మదిలో వెలుగు నింపు ‘సన్ షైన్’
హైదరాబాద్ ఐఐటిలో ఆత్మహత్యలు నివారించే కృషి ప్రారంభం
By : Shaik Saleem
Update: 2025-10-10 07:42 GMT
కష్టపడి చదివి ప్రతిష్టాత్మక ఐఐటీ, ఇతర విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన విద్యార్థుల్లో కొందరు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యల బాట పడుతున్నారు. దేశంలో 2024,2025 సంవత్సరాల్లో ఐఐటీల్లోనే 115 మంది ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడైంది. ఐఐటీల్లోనే కాదు వైద్య కళాశాలల్లోనూ విద్యార్థులు బలవన్మరణాల ఘటనలు చోటుచేసుకున్నాయి.దేశంలోని ఐఐటీల్లో 2018 నుంచి 2023వ సంవత్సరం వరకు ఐదేళ్ల కాలంలో 39 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది.సెంట్రల్ యూనివర్శిటీల్లో న25 మంది, ఐఐఎంలలో నలుగురు, ఎన్ఐటీల్లో 25 మంది, ఐఐఎస్ ఈఆర్ లో ముగ్గురు, ట్రిపుల్ ఐటీల్లో ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు.
సంచలనం రేపిన రోహిత్ వేముల ఆత్మహత్య
తొమ్మిదేళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వివక్ష వల్ల పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.2019వ సంవత్సరంలో ఎస్టీ వర్గానికి చెందిన పీజీ వైద్యవిద్యార్థిని పాయల్ తాడ్వీ సీనియర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది.ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులుండటం సంచలనం రేపింది. ఉన్నత విద్యాసంస్థల్లో సీనియర్ల వేధింపులు, గ్రేడింగ్ లలో పారదర్శకత లేమి వల్ల బీసీ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. మానసికంగా వేధింపులకు గురైన విద్యార్థులకు వెన్నుతట్టే మెంటార్లు గానీ, మానసికంగా తోడు నిలిచే ఫ్యాకల్టీలు కాని లేనందువల్ల ఈ ఆత్మహత్యలు కొనసాగుతున్నాయంటారు విద్యార్థి సంఘ నాయకులు. బాంబే ఐఐటీలో 2023వ సంవత్సరంలో దర్శన్ సోలంకి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ ఐఐటీలో...
విద్యార్థులు చిన్న సమస్యలకే డిప్రెషన్ లోకి వెళ్లిపోయి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2022-23 ఏడాది కాలంలో నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
- 2023 జులై 17వతేదీ : హైదరాబాద్ ఐఐటీలో మెకానికల్ సెకండియర్ విద్యార్థి అయిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ అనే విద్యార్థి 2023 జులై 17వతేదీన ఆత్మహత్య చేసుకున్నాడు.కార్తీక్ ఐఐటీ క్యాంపస్ నుంచి విశాఖపట్టణానికి వెళ్లి అక్కడ సముద్రంలో దూకి శవమై తేలాడు.
- 2023వ సంవత్సరం ఆగస్టు 8 వతేదీ : ఐఐటీలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల మమైత నాయక్ అనే విద్యార్థి మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. జులై 26వతేదీన ఎంటెక్ ప్రథమ సంవత్సరంలో చేరిన ఈ విద్యార్థి ఆగస్టు 8వతేదీన తన గదిలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. ‘‘నా చావుకు ఎవరూ కారణం కాదు, మానసిక ఒత్తిడికి గురవుతున్నాను’’అని లేఖ రాసి మమైత నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘ప్లీజ్.. నా డెడ్ బాడీని ఎవరికీ చూపించకండి. మీడియాతో పాటు కనీసం నా తల్లిదండ్రులకు కూడా నా మృతదేహాన్ని చూపించొద్దు. ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్. నా చావుకు కారణాలు ఏంటంటూ ఎలాంటి విచారణ చేయాల్సిన పని లేదు. నా చావుకు నేనే కారణం... ఎందుకంటే నేను డిప్రెషన్‌లో ఉన్నాను.’’అని మమైత నాయక్ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.అప్పట్లో కేవలం 20 రోజుల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
- 2022వ సంవత్సరం ఆగస్టు 31వతేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాకు చెందిన రాహుల్ అనే విద్యార్థి ఐఐటీ క్యాంపస్ లో మంచానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
- 2022వ సంవత్సరం సెప్టెంబరు 6వతేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని జోద్ పూర్ కుచెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి మేగ్ కపూర్ సంగారెడ్డిలోని లాడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే...
హైదరాబాద్ ఐఐటీలో ఏడాది కాలంలోనే నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేక తాము ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు సూసైడ్ నోట్స్ రాయడం మరింత ఆందోళన కలిగిస్తుంది.ఎయిమ్స్ లో రిజర్వేషన్ల ద్వారా సీట్లు పొందిన వైద్య విద్యార్థులు వివక్షకు గురవుతున్నారని థోరట్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. వసతి గృహాల్లో ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు వేరుగా ఏర్పాట్లు చేయడాన్ని థోరట్ కమిటీ తప్పు పట్టింది.
ఆత్మహత్యల నిరోధానికి హైదరాబాద్ ఐఐటీలో ‘సన్ షైన్’
హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో వీటి నిరోధానికిగాను 2012 జనవరి నెలలో సన్ షైన్ పేరిట కౌన్సెలింగ్ సెల్ ను ఏర్పాటు చేశారు.ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ నీరజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ బృందంలో ముగ్గురు సైకలాజికల్ కౌన్సెలర్లు, 19 మంది ఫ్యాకల్టీ ప్రతినిధులు, 12 మంది విద్యార్థులు, 33 మంది మేనేజ్ మెంట్ టీమ్ సభ్యులు, 81 మంది మెంటార్లు, 23 మంది విద్యార్థులున్నారు. హైదరాబాద్ ఐఐటీలో నాలుగేళ్ల క్రితం విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో తాము విద్యార్థులకు కౌన్సెలింగ్ చేయడం ద్వారా ఆత్మహత్యలను నివారించ గలిగామని హైదరాబాద్ ఐఐటీ సన్ షైన్ విభాగం ఇన్ చార్జి ఫ్రొఫెసర్ డాక్టర్ నీరజ్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.విద్యార్థులకు కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఒత్తడిని దూరం చేసి, వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నామని ఆయన వివరించారు.
సన్ షైన్ కౌన్సెలింగ్
హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థులకు విద్యా,వ్యక్తిగత, సామాజిక పరమైన అంశాల్లో ఆత్మవిశ్వాసం నింపేలా సన్ షైన్ సైకలాజికల్ కౌన్సెలర్లు తోడ్పాటు అందిస్తున్నారు. విద్యార్థులు ఫెయిల్యూర్స్ ను అధిగమించేలా వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపర్చేలా సలహాలు ఇస్తామని సన్ షైన్ సైకలాజికల్ కౌన్సెలర్ ఫణిభూషణ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తనతోపాటు మహిళా సైకలాజికల్ కౌన్సెలర్లు యూక్తి రస్తోగి, మారియా మోరీస్ లు కౌన్సెలింగ్ లు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు విద్య, వ్యక్తిగత, సామాజిక పరమైన విషయాల్లో వన్ టు వన్ సపోర్ట్ పేరిట రహస్య కౌన్సెలింగ్ చేస్తున్నాం, మెంటార్ షిప్, బడ్డీ కార్యక్రమాల ద్వారా ఒత్తిడిని దూరం చేసి ఆత్మహత్యలు చేసుకోకుండా నిరోధిస్తున్నామని ఫణిభూషణ్ వివరించారు.
ఒత్తిడిని దూరం చేస్తాం...
హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థులకు విద్యాపరమైన ఒత్తిడిని, ఇంటి బాధలను దూరం చేసేలా సైకలాజికల్ కౌన్సెలర్లు కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఒత్తిడికి గురైన విద్యార్థులకు ఐఐటీ క్యాంపస్ లో ఉత్సాహ భరితమైన వాతావరణాన్ని కల్పించి మెంటార్ల సహాయంతో వారిని స్వస్థత పరుస్తున్నారు. ‘‘ మీరు ఎప్పుడైనా అధికంగా ఒత్తిడడికి గురైతే వెంటనే సంకోచించకుండా మాతో ఛాట్ చేయండి, మీ కష్టసమయంలో సన్ షైన్ లో తాము 24 గంటల పాటు అందుబాటులో ఉంటామని సైకలాజికల్ కౌన్సెలర్ ఫణిభూషణ్ చెప్పారు. విద్యాపరమైన, వ్యక్తిగత, సామాజిక మద్ధతు ఇవ్వడంతోపాటు విద్యార్థుల సమస్యలు ఏదైనా వాటిని తెలుసుకొని పరిష్కార మార్గం చూపిస్తామని ఈ కౌన్సెలింగ్ స్నేహ పూర్వక వాతావరణంలో సాగుతుందని ఆయన వివరించారు.
మానసిక ఆరోగ్య చైతన్య శిబిరాలు
తోటి సహ విద్యార్థులతో కలిసి సరదా సమావేశాలు, ఈవెంట్ లు నిర్వహిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తారు. నేపథ్య పార్టీలు, వర్క్ షాప్ లు, బహిరంగ సాహసాలు, సినిమాలు, షికార్ల ద్వారా ఆనందాన్ని పెంపొందిస్తారు. కాఫీ తాగుతూ...పార్కులో నడుస్తూ, ఫోన్ లో స్నేహ పూర్వక ఛాట్ సమావేశాలతో సంబంధాలను మెరుగుపరుస్తున్నారు.‘‘ ఏడాది పొడవునా విద్యార్థులకు మానసిక ఆరోగ్య చైతన్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రతీ ఏటా సెప్టెంబరు నెలలో ఆత్మహత్యల నిరోధక దినోత్సవం, అక్టోబరు నెలలో మెంటల్ హెల్త్ వీక్, మార్చి నెలలో హ్యాపీనెస్ వీక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’’అని చెప్పారు హైదరాబాద్ ఐఐటీ స్టూడెంట్ హెడ్ డేనియల్ లంకపల్లి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
సన్‌షైన్ బడ్డీస్: విభిన్న విద్యా నేపథ్యాల నుంచి ఒకే బ్యాచ్‌కు చెందిన తోటి విద్యార్థులు రోజువారీ సమస్యలపై చర్చించేందుకు వీలుగా సన్ షైన్ బడ్డీస్ పేరిట విభాగాలను ఏర్పాటు చేశారు.
సన్‌షైన్ మెంటార్లు: కళాశాల జీవితంలోకి పరివర్తన చెందడానికి వారికి సహాయపడటానికి ఎంపిక చేసిన సీనియర్ విద్యార్థులను ఫ్రెషర్లకు నియమిస్తారు.జూనియర్ విద్యార్థులకు భావోద్వేగ మద్దతు, ఆచరణాత్మక సలహాలను మెంటార్లు అందిస్తారు.
ప్రొఫెషనల్ కౌన్సెలర్లు: ఒత్తిడి నిర్వహణ, పరీక్ష ఆందోళన, వ్యక్తిగత లేదా కెరీర్ సమస్యలను కవర్ చేసే గోప్యమైన వన్-ఆన్-వన్ లేదా గ్రూప్ సెషన్‌ల కోసం అందుబాటులో ఉన్న శిక్షణ పొందిన నిపుణులు కౌన్సెలింగ్ చేస్తారు.