మూసీ నదికి సీఎం మరణశాసనం రాస్తూ సుందరీకరణ ప్రాజెక్టా? : కేటీఆర్

దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ అంతర్థానం అవుతుందని కేటీఆర్ చెప్పారు.మూసీకి సీఎం మరణశాసనం రాస్తూ సుందరీకరణ చేపడుతున్నారని కేటీఆర్ విమర్శించారు..

Update: 2024-10-14 13:57 GMT

వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నేవీకి సంబంధించిన వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణం ఏర్పాటును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఓ వైపు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పేరుతో లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెబుతూనే మరోవైపు మూసీ నదిని పూర్తిగా ప్రమాదంలో పడేసే రాడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపడమేమిటని కేటీఆర్ ప్రశ్నించారు.


నేవీ రాడార్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాం...
తాము నేవీ రాడార్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఇదెక్కడి ద్వంద్వ వైఖరంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు.ఏం ప్రయోజనాలు ఆశించి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.మంగళవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి నేవీ రాడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తుండటాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందదని కేటీఆర్ చెప్పారు.

పర్యావరణానికి తీవ్ర నష్టం
దామగుండంలో రాడార్ ఏర్పాటు కారణంగా పర్యావరణానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని కేటీఆర్ చెప్పారు. దాదాపు 2900 ఎకరాల అటవీ భూభాగంతో పాటు 12 లక్షల చెట్లను నరికి వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టనున్నారని ఆయన పేర్కొన్నారు. జనవాసాలే లేని చోట ఏర్పాటు చేయాల్సిన రాడార్ కేంద్రాన్ని ఎందుకు తెలంగాణలో నిర్మిస్తున్నారో చెప్పాలన్నారు. మాట్లాడితే మూసీ పరిరక్షణ అని చెబుతున్న ముఖ్యమంత్రి మూసీనే ప్రమాదంలో పెట్టే ఈ ప్రాజెక్ట్ కు ఎందుకు అంగీకారం తెలిపారో చెప్పాలన్నారు.

నేవీ ప్రాజెక్టుకు మేం ఆమోదం తెలుపలేదు...
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల సమయంలో ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కు అంగీకారం తెలపలేదని కేటీఆర్ గుర్తు చేశారు. దేశంలోనే అటవీ సామర్థ్యాన్ని పెంచేందుకు హరిత హారం చేపట్టి అటవీ విస్తీర్ణాన్ని బీఆర్ఎస్ సర్కార్ పెంచిందన్నారు. అలాంటిది రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 2900 ఎకరాల అటవీ భూభాగాన్ని నాశనం చేసేలా చర్యలు చేపట్టడమేమిటని కేటీఆర్ ప్రశ్నించారు.

గంగోత్రికి ఒక న్యాయం, మా మూసీకి ఒక న్యాయమా?
గంగానది జన్మస్థానం గంగోత్రి వద్ద 150 కిలోమీటర్ల పరిధిని కేంద్రం ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రకటించిన విషయాన్నికేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గంగోత్రికి ఒక న్యాయం, మా మూసీ నదికి మరో న్యాయమా అంటూ నిలదీశారు. దామగుండంలో ఏర్పాటు చేస్తున్న రాడార్ కేంద్రం వికారాబాద్ అడవుల్లోనే మూసీ జన్మస్థానం లోనే ఉందన్నారు. మూసీ నది పుట్టిన ప్రాంతాన్ని “ఎకో సెన్సిటివ్ జోన్” గా ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

నేవీ రాడార్ ప్రాజెక్టును విరమించుకోండి
నేవీ రాడార్ ఏర్పాటుతో మూసీ నది అంతర్థానం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. “సోర్స్ అఫ్ ద రివర్”పై ఇది గొడ్డలి పెట్టని ఆయన చెప్పారు. మూసీ నది పురుడు పోసుకున్న చోట 12 లక్షల చెట్ల నరికివేతతో కోలుకోలేని అనర్థం జరుగుతుందన్నారు. పర్యావరణ సమతుల్యతకు పెనుప్రమాదాన్ని సృష్టించే ఈ ప్రాజెక్ట్ ను విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

పర్యావరణ వేత్తలతో కలిసి బీఆర్ఎస్ పోరాటం
మూసీ నదిని ఫణంగా పెట్టేందుకు సహకరిస్తూ మరో వైపు మూసీ పరిరక్షణ అంటూ ముఖ్యమంత్రి డ్రామాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మూసీ పరిరక్షణపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే రాడార్ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం తెలిపేది కాదన్నారు. మూసీ పేరుతో వేల కోట్ల దోపిడీ చేయాలన్న ఆలోచనే తప్ప నిజంగా నది పరిరక్షణపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ది లేదన్నారు. దేశ రక్షణ విషయంలో తెలంగాణ ముందుంటుంది కానీ జనావాసాల లేని చోట్ల ఏర్పాటు చేయాల్సిన రాడార్ కేంద్రాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి నష్టం చేస్తామంటే అంగీకరించమని చెప్పారు. రాడార్ కేంద్రానికి వ్యతిరేకంగా పర్యావరణ వేత్తలతో కలిసి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.


Tags:    

Similar News