తెలుగురాష్ట్రాలకు మంచిరోజులొచ్చాయా ? ఇలాంటి రోజులొస్తాయని ఎవరైనా అనుకున్నారా ?

ఏపీ-తెలంగాణా విభజన సమస్యల పరిష్కారానికి చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి చొరవ చూపించారు. ఈ నెల 6వ తేదీన ఇద్దరు ముఖ్యమంత్రులు హైదరాబాద్ లో భేటీ అవబోతున్నారు.

Update: 2024-07-02 08:30 GMT

ఒక చిన్న ఆశారేఖ తళుక్కున మెరిసింది. జీవితమంతా సమస్యలతోనే గడిపేయాలని ఎవరైనా అనుకుంటారా ? సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటేనే కదా ఎవరైనా ఆనందంగా ఉండగలరు ? సమస్యల పరిష్కారం వ్యక్తులకైనా రాష్ట్రాలకైనా ఒకటేకదా. ఎప్పటి సమస్యలను అప్పుడే పరిష్కరించుకుని ముందుకెళ్ళకపోతే అందరికీ నష్టమే. ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపించటం చాలా సంతోషంగా ఉంది. ఇపుడిదంతా ఎందుకంటే ఏపీ-తెలంగాణా విభజన సమస్యల పరిష్కారానికి చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి చొరవ చూపించారు. ఈ నెల 6వ తేదీన ఇద్దరు ముఖ్యమంత్రులు హైదరాబాద్ లో భేటీ అవబోతున్నారు.

విభజన సమస్యలు రావణకాష్టంలాగ పదేళ్ళుగా అలా కాలుతునే ఉంది రెండు రాష్ట్రాల మధ్య. హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణా ఏర్పడిన తర్వాత విభజన సమస్యల పరిష్కారంపై మొట్టమొదటి సీఎం కేసీయార్ ఆసక్తిచూపలేదు. సమస్యల పరిష్కారానికి చంద్రబాబు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవటంతో సమస్యలు కాస్త వివాదాలుగా మారిపోయాయి. హైదరాబాద్ లోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంటి కొన్నింటిని ఏకపక్షంగా కేసీయార్ సొంతంచేసేసుకున్నారు. అలాగే హైదరాబాద్ లోని కేంద్రప్రభుత్వ రంగ సంస్ధల విభజనకు కేసీయార్ సానుకూలంగా స్పందించలేదు. హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధలన్నీ తెలంగాణావే అని గట్టిగా వాదించారు. వాటి మార్కెట్ వాల్యూని ఏపీకి చెల్లించటానికి కేసీయార్ అంగీకరించలేదు. ఇదే సమయంలో విభజన సమస్యల పరిష్కారంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన నరేంద్రమోడి ప్రభుత్వం కూడా చోద్యం చూస్తుండిపోయింది.

ఇలాంటి అనేక సమస్యల కారణంగా విభజన సమస్యలు కాస్త వివాదాలుగా పెరిగిపోయాయి. చివరకు విభజన సమస్యల పరిష్కారానికి యూపీఏ ప్రభుత్వం నియమించిన షీలాబిడే కమిటీ నివేదికను కూడా కేసీయార్ పట్టించుకోలేదు. తర్వాత కేసీయార్-జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా వివాదాల పరిష్కారానికి ఎవరూ చొరవచూపలేదు. దాంతో మొత్తం పదేళ్ళు విభజన సమస్యలు(వివాదాలు) అపరిష్కృతంగానే ఉండిపోయాయి. రెండురాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోతాయని అందరు అనుకున్నారు. సరిగ్గా ఈ నేపధ్యంలోనే రెండు రాష్ట్రాల్లోను ప్రభుత్వాలు మారాయి. ముందుగా తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అప్పటికి ఏపీలో జగనే సీఎంగా ఉన్నారు. అందుకనే విభజన సమస్యల పరిష్కారంపై మౌనంగా ఉండిపోయారు. ఎప్పుడైతే ఏపీలో వైసీపీ ఓడిపోయిందో వెంటనే విభజన సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నట్లు రేవంత్ ప్రకటించారు.

అప్పుడు రేవంత్ ప్రకటనకు ఇపుడు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. విభజన సమస్యల పరిష్కారానికి సమావేశమవుదామని రేవంత్ కు చంద్రబాబు లేఖరాయటం శుభ పరిణామమనే అనుకోవాలి. చంద్రబాబు లేఖకు రేవంత్ సానుకూలంగా స్పందించి సమావేశానికి ఆహ్వానించారు. విభజన సమస్యల్లో ముఖ్యమైనవి ఆస్తుల విభజన, తెలంగాణా విద్యుత్ సంస్ధల నుండి ఏపీకి రు. 6 వేల కోట్ల బకాయిల చెల్లింపు, నదీజలాల వినియోగం. కృష్ణా జలాల పంపిణీ, వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు అలాగే ఉండిపోయాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు వీటిపై చర్చించి ఒక పరిష్కారానికి వస్తే సాగునీటితో పాటు తాగునీటి సమస్య కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారీ వర్షాలు, వరదలు వచ్చినపుడు నీరంతా వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. నదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్నాటకతో గొడవలు పడుతున్న విషయం తెలిసిందే.

ఏపీ, తెలంగాణాకు వ్యతిరేకంగా మహారాష్ట్ర, కర్నాటకలు ఏకమైన విషయం గమనించి కూడా తెలుగురాష్ట్రాలు ఏకమవ్వలేకపోవటం నిజంగా దురదృష్టమనే చెప్పాలి. చంద్రబాబు, రేవంత్ బాగా సన్నిహితులు. చంద్రబాబుకు శిష్యుడంటే రేవంత్ అంగీకరించరు కాని అంతకుమించిన సత్సంబంధాలే ఇద్దరి మధ్యా ఉన్నాయి. బాగా సన్నిహితులైన ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే పరిష్కారం కాని సమస్యలుంటాయా ? అని జనాలు అనుకుంటున్నారు. నదీజలాల సమస్య పరిష్కారమైతే ధక్షిణ తెలంగాణాతో పాటు ఏపీలోని రాయలసీమకు మంచిరోజులు వచ్చినట్లే అనుకోవాలి. సాగు, తాగునీటి సమస్య పరిష్కారమవటంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తి సమస్య కూడా పరిష్కారమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కాస్త పట్టువిడుపుతో చంద్రబాబు, రేవంత్ సమస్యల పరిష్కారంకు ప్రయత్నిస్తే చాలా సమస్యలు పరిష్కారమైపోవటం ఖాయమనే అనిపిస్తోంది. వీళ్ళ హయాంలో విభజన సమస్యలు పరిష్కారం కాకపోతే ఇక భవిష్యత్తులో పరిష్కారమవుతాయని అనుకునేందుకు లేదు. వీళ్ళిద్దరు అత్యంత సన్నిహితులవ్వటమే కాకుండా చంద్రబాబు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్నారు. అవసరమైతే విభజన సమస్యల పరిష్కారానికి నోడల్ ఏజెన్సీ అయిన కేంద్ర హోంశాఖ సాయాన్ని కూడా తీసుకోవచ్చు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని, కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందిస్తే ఎంత జటిలమైన సమస్య అయినా చిటికెలో పరిష్కారమైపోతుంది. కాబట్టి నౌ ఆర్ నెవర్ అన్న పద్దతిలో చంద్రబాబు, రేవంత్ హయాంలోనే అన్నీ సమస్యలు పరిష్కారమైపోతే బాగుంటుందని జనాలంతా ఆశతో ఎదురుచూస్తున్నారు. మరి 6వ తేదీ భేటీలో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News