రేవంత్ డబుల్ యాక్షన్ వర్కవుటవుతుందా ?

మామూలుగా అయితే ఈ డబుల్ యాక్షన్ చేయటం పెద్ద సమస్యకాదు. కాని ఇపుడు ఈ డబుల్ యాక్షనే రేవంత్ ను ఇబ్బందుల్లో పడేస్తోంది.

Update: 2024-08-22 09:24 GMT

రేవంత్ రెడ్డికి చాలా పెద్ద సమస్య వచ్చిపడింది. ముఖ్యమంత్రిగాను పీసీసీ అధ్యక్షుడిగాను రేవంత్ డబుల్ యాక్షన్ చేస్తున్న విషయం తెలిసిందే. మామూలుగా అయితే ఈ డబుల్ యాక్షన్ చేయటం పెద్ద సమస్యకాదు. కాని ఇపుడు ఈ డబుల్ యాక్షనే రేవంత్ ను ఇబ్బందుల్లో పడేస్తోంది. ఎలాగంటే పారిశ్రామికవేత్త అదాని గ్రూపు వ్యాపారాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటి (జేపీసీ)తో విచారణ చేయించాలనే డిమాండుతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈడీ ఆఫీసు ముందు పెద్దఎత్తున ధర్నా జరిగింది. అదాని వ్యవహారంపై జేపీసీ విచారణకు కేంద్రప్రభుత్వం అంగీకరించాలనే డిమాండుతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేయాలని అగ్రనేత రాహుల్ గాంధి పిలుపిచ్చారు. రాహుల్ పిలుపుమేరకు మిగితా రాష్ట్రాల్లోలాగే తెలంగాణాలో కూడా భారీ ధర్నా జరిగింది. ఇందులో రేవంత్ కూడా పాల్గొన్నారు.

నిరసన కార్యక్రమంలో రేవంత్ పాల్గొనటం అంటే ఊరికే కాసేపు కూర్చుని వచ్చేయటం కాదుకదా. అందుకనే రేవంత్ మాట్లాడుతు దేశసంపదను అదాని, అంబానీలు దోచుకుతింటున్నారంటు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అతి తక్కువ సమయంలోనే అత్యంత ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన విధానంపైన రేవంత్ తీవ్రంగా మండిపోయారు. ఇది రేవంత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా నేతలు, కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు చేసిన ఆరోపణలు, ప్రసంగాలు. పీసీసీ అధ్యక్షుడిగా అదానిపైన రేవంత్ ఆరోపణలు చేయటంలో తప్పేమీలేదు.

సీన్ కట్ చేస్తే కొద్దిరోజులకు ముందే అదానితో రేవంత్ చాలాసేపు భేటీ అయ్యారు. తెలంగాణాలో పరిశ్రమలు ఏర్పాటుచేయమని, పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆహ్వానించటమే కాకుండా ఓల్డ్ సిటిలో పేరుకుపోతున్న వందల కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల బకాయిలు వసూలు చేసే కాంట్రాక్టును అదాని గ్రూపుకు ఇవ్వటానికి రేవంత్ డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీలో అదానితో భేటీ తర్వాత రేవంత్ స్వయంగా ప్రకటించారు. తెలంగాణాలో పెట్టుబడులు పెట్టడానికి అదాని గ్రూపుకు అవసరమైన అన్నీ సౌకర్యాలను ఏర్పాటుచేస్తామని రేవంత్ హామీ కూడా ఇచ్చారు.

అంటే ఒకవైపు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణాలో పెట్టుబడులు పెట్టమని, పరిశ్రమలు ఏర్పాటుచేయమని అదానీని ఆహ్వానిస్తున్న రేవంత్, పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఇదే అదాని దేశాన్ని దోచేస్తున్నారంటు తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. పార్టీ అధ్యక్షుడిగా అదానిని తిడుతున్న రేవంత్ ముఖ్యమంత్రిగా మాత్రం అదానిని తెలంగాణాలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా రేవంత్ డబుల్ యాక్షన్ చేస్తున్న విషయం అర్ధమైపోతోంది. పరిశ్రమలు రాకపోయినా, పెట్టుబడులు సాధించలేకపోయినా రేవంత్ ఫెయిల్డ్ సీఎం అని ముద్ర వేయించుకోవటం ఖాయం.

ఇదే సమయంలో అగ్రనేత రాహుల్ పిలుపుమేరకు అదానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించి, పాల్గొనకపోతే అధిష్టానం నిర్ణయాన్ని థిక్కరించినట్లవుతుంది. దాంతో ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రోజులు లెక్కపెట్టుకోవాల్సుంటుంది. ఈ డబుల్ యాక్షన్ తో రేవంత్ కు మా చెడ్డ చిక్కొచ్చిపడింది. పీసీసీ అధ్యక్షుడు కాకపోయినా రేవంత్ కు ఈ సమస్య తప్పదు. రేవంత్ డబుల్ యాక్షన్ చేస్తారు సరే మరి పారిశ్రామికవేత్తగా అదాని దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ? ఇలాంటి గోలంతా మామూలే చాలా రాష్ట్రాల్లో ఉండేదే అని అదాని సరిపెట్టుకుంటారా ? లేకపోతే తనను బజారు కీడుస్తున్నారన్న కారణంతో రేవంత్ పై అదాని మండిపోతారా ? ఏదేమైనా డబుల్ యాక్షన్ చేయాల్సిరావటం రేవంత్ కు పెద్ద చిక్కొచ్చినపడిందనే చెప్పాలి. మరి ఈ డబుల్ యాక్షన్ రేవంత్ కు ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.

Tags:    

Similar News