Ponnam Prabhakar | తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ వెళతారా..?

రాష్ట్ర సచివాలయంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

Update: 2024-12-07 10:30 GMT

రాష్ట్ర సచివాలయంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేరస్తోంది. ఈ క్రమంలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేయాలంటూ ప్రముఖులకు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) స్వయంగా వెళ్లి ఆహ్వానం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేటీఆర్‌(KCR)కు కూడా పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందించారు. సిద్ధిపేట జిల్లా ఎర్లవల్లిలోని ఫామ్ హౌస్‌కు వెళ్లిన పొన్నం ప్రభాకర్.. డిసెంబర్ 9న జరిగే విగ్రహావిష్కరణకు తప్పకుండా రావాలని కేసీఆర్‌ను కోరారట. దీంతో ఇప్పుడు రేవంత్ సర్కార్ స్థాపిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ వస్తారా? రారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రాష్ట్రమంతా ఇదే హాట్ టాపిక్‌గా చర్చ జరుగుతోంది. దాదాపు మూడు నాలుగు రోజుల నుంచి కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తుండగా.. ఈరోజు కలవడానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే పొన్నం ప్రభాకర్.. కేసీఆర్‌ను ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కలిశారు.

కేసీఆర్‌ను కలవడంపై పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ‘‘తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్‌ని ఆహ్వానించడం కోసం తెలంగాణ ప్రభుత్వం తరపున నేను, ప్రోటోకాల్ అధికారులు వచ్చాము. తెలంగాణలో అందరిని గౌరవించాలి అనేది మా పార్టీ తీసుకున్న నిర్ణయం. లంచ్ టైంలో వచ్చాము కాబట్టి కేసీఆర్ లంచ్ చేయమంటే చేశాం. మా భేటీలో ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదు. మేము అందరిని ఆహ్వానిస్తున్నాం కేసీఆర్ వస్తారా..? రారా..? అన్న నిర్ణయం పార్టీలో చర్చించి తీసుకుంటారు’’ అని పొన్నం తెలిపారు.

అయితే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోకి ఎంటర్ కావాలంటే కేసీఆర్ ఆమోదం ఉండాల్సిందేనన్నది వాస్తవం. గతంలో బీఆర్ఎస్ హయాంలో సొంత పార్టీ మంత్రులు కూడా ఎన్నో సార్లు ఎర్రవల్లి ఫామ్ హౌస్ గేటు దగ్గర నుంచే వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయని, కేటీఆర్, కవితైనా కేసీఆర్ ఓకే అంటేనే లోపలికి ఎంట్రీ అవ్వగలరని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. అటువంటి ఫామ్ హౌస్‌లోని పొన్నం వెళ్లారంటే.. బాగానే ప్రయత్నాలు చేశారని, మరి ఈ విగ్రహావిష్కరణకు కేసీఆర్ వస్తారా? రారా? అనేది వేచి చూడాలని అంటున్నారు. మరికొందరైతే గెలిపించిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి అసెంబ్లీకే రాని నేత.. ప్రత్యర్థి పార్టీ స్థాపిస్తున్న విగ్రహావిష్కరణ వస్తారా? అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

ఇదిలా ఉంటే కేసీఆర్‌తో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కూడా పొన్నం ప్రభాకర్ ఆహ్వానం అందించారు. రాష్ట్ర గవర్నర్‌తో పాటు ప్రతిపక్ష నేతలను కూడా తమ ప్రభుత్వం ఆహ్వానిస్తోందని ఆయన పేర్కొన్నారు. మరి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎంత మంది వెళతారో చూడాలి. కాగా విగ్రహ ఆవిష్కరణను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జూలూరు గౌరీశంకర్.. పిటిషన్ దాఖలు చేశారు. విగ్రహం రూపం మార్చడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం రిజిస్ట్రీ పిరశీలనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న విగ్రహావిష్కరణ జరుగుతుందో లేదో కూడా తెలియదన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Tags:    

Similar News