జోరుమీదున్న పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యుటి చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కల్యాణ్ కొండగట్టు దేవాలయానికి చేరుకున్నారు.

Update: 2024-06-29 06:22 GMT

జనసేన అధినేత, ఏపీ డిప్యుటి చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కల్యాణ్ కొండగట్టు దేవాలయానికి చేరుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు దేవాలయంలో ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. మొదటినుండి పవన్ ఆంజనేయస్వామి భక్తుడన్న విషయం అందరికీ తెలిసిందే.

ఎన్నికల ముందు కూడా చాలాసార్లు పవన్ కొండగట్టుకు వెళ్ళి పూజలు చేసిన పవన్ డిప్యుటి సీఎం హోదాలో మొదటిసారి ఆలయానికి వెళ్ళారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతు తెలంగాణాలో కూడా బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తుందని ప్రకటించారు. ఏపీలో హిట్ అయిన బీజేపీ, జనసేన కాంబినేషన్ తెలంగాణాలో కూడా అవుతుందని పవన్ ఆలోచనలాగుంది. బీజేపీ, జనసేన పార్టీలు టీడీపీతో పొత్తుపెట్టుకుని మొన్నటి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణాలో టీడీపీతో కలిసి పనిచేసే విషయాన్ని పవన్ ప్రస్తావించలేదుకాని బీజేపీతో కలిసి పనిచేస్తామని ప్రత్యేకంగా చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఏపీలోని ఎన్నికల్లో పోటీచేసిన అసెంబ్లీ సీట్లలో 21కి 21 గెలిచి నూరుశాతం స్ట్రైకు రేటు సాధించిన జనసేన నేతలు మంచి ఊపుమీదున్నారు.

ఆ ఊపుతోనే పవన్ తాజా ప్రకటన చేశారని అనుకోవాలి. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీచేసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా బీజేపీతో పొత్తులోనే జనసేన ఎనిమిది సీట్లలో పోటీచేసింది. అయితే ఒక్కటంటే ఒక్కసీటులో కూడా జనసేన అభ్యర్ధులకు డిపాజిట్ కూడా దక్కలేదు. అందుకనే పార్లమెంటు ఎన్నికల్లో కనీసం పోటీకి కూడా సాహసించలేదు. ఏపీ ఎన్నికల్లో పార్టీ గెలిచిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు సీట్లు అనూహ్యమనే అనుకోవాలి. ఫలితాలు వచ్చేంతవరకు నూరుశాతం సీట్లు గెలుస్తామని బహుశా పవన్ కూడా అనుకునుండరు. ఫలితాలు వచ్చిన తర్వాత డిప్యుటి సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్ మొదటిసారి తెలంగాణాలో దేవాలయానికి వచ్చారు.

పవన్ తొందరలోనే తెలంగాణా పార్టీ నేతలతో సమావేశం అవబోతున్నారు. తొందరలోనే తెలంగాణా నేతలతో పవన్ సమీక్షలు జరపాలని డిసైడ్ అయినట్లు పార్టీ ఇన్చార్జి శంకర్ గౌడ్ మీడియాతో చెప్పారు. అయితే ఎప్పుడు సమీక్షించబోతున్నారనే విషయాన్ని మాత్రం గౌడ్ చెప్పలేదు. తొందరలోనే జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో జనసేన కూడా పోటీచేయాలని స్ధానిక నేతలు పవన్ కు సూచించినట్లు పార్టీవర్గాల సమాచారం. ఇందుకు పవన్ అంగీకరిస్తే అదే విషయాన్ని బీజేపీతో కూడా చర్చించి ఫైనల్ నిర్ణయానికి రావాలని పవన్ ఆలోచిస్తున్నారు. జనసేనను తెలంగాణాలో కూడా బలోపేతం చేయటానికి అవసరమైన అన్నీ చర్యలను తీసుకోవాలని పవన్ ఇప్పటికి గట్టిగా నిర్ణయించినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. మరి ఇందుకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ రెడీచేయబోతున్నారో చూడాల్సిందే.

Tags:    

Similar News