అమిత్‌షాపై చర్యలు తీసుకునే వరకూ పోరాటం :టీపీసీసీ అధినేత మహేష్ కుమార్
అంబేద్కర్ ను అవమానించిన అమిత్‌షాపై చర్యలు తీసుకునేంత వరకూ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని టీపీసీసీ అధినేత మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.;
By : Shaik Saleem
Update: 2024-12-19 11:38 GMT
భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్.అంబేద్కరే తమకు దేవుడుతో సమానమని, ఆయనపై వ్యాఖ్యలు చేసిన అమిత్‌షాపై చర్యలు తీసుకునేంతవరకూ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని టీపీసీసీ అధినేత మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని, దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.అమిత్ షా వ్యాఖ్యలు భారత రాజ్యాంగానికి ఘోర అవమానమని, ఆయన వ్యాఖ్యలతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
మనుస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తోందని,రాజ్యాంగ నిర్మాతను ప్రతి సారి హేళన చేస్తోందని మహేష్ కుమార్ ఆరోపించారు. మన రాజ్యాంగం మీద, మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని మరోసారి నిరూపితం అయ్యిందని, అంబేద్కర్ ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమిత్ షా మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అమిత్ షాను బర్తరఫ్ చేయాలి
అంబేద్కర్ ను అవమాన పరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను వెంటనే భర్తరఫ్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అమిత్ షా మీద ఎస్సి ఎస్టీ కేసులు నమోదు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ బీఆర్ఎస్ విధానమని ఆయన ఆరోపించారు. బీజేపీ ఆదానీకి మధ్య ఉన్న స్నేహం పై జేపీసీ వేయాలని తాము కోరామన్నారు.