ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి డుమ్మా.. అరవింద్ పరిస్థితి ఏంటి..?
ఫార్ములా ఈ-కార్ రేసు దర్యాప్తులో ఈడీ వేగం పెంచింది. కేటీఆర్‌పై ఏసీబీ కేసునమోదు చేసిన క్రమంలోనే ఈడీ కూడా రంగంలోకి దిగింది.;
ఫార్ములా ఈ-కార్ రేసు దర్యాప్తులో ఈడీ వేగం పెంచింది. కేటీఆర్‌పై ఏసీబీ కేసునమోదు చేసిన క్రమంలోనే ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ-కార్ రేసు వ్యవహారంపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే 2జనవరి నాడు మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అదే విధంగా జనవరి 3వ తేదీని సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు విచారణకు రావాల్సిందిగా కోరుతూ ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా ఈరోజు గురువారం ఈడీ విచారణకు మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి డుమ్మా కొట్టారు. విచారణకు హాజరవడానికి తనకు మరింత సమయం ఇవ్వాలని ఆయన అధికారులను కోరారు. ఈ మేరకు ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు ఆయన మెయిల్ ద్వారా తెలిపారు. అందుకు అంగీకారం తెలిపిన ఈడీ.. తిరిగి ఎప్పుడు విచారణకు రావాలి అన్నది తెలుపుతామని చెప్పింది. కాగా ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి గైర్మాజరు కావడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. మాజీ చీఫ్ ఇంజనీరే విచారణకు రాని క్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ మాత్రం ఈడీ విచారణకు వస్తారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
విచారణకు అరవింద్ కుమార్ వస్తారా?
ఇదిలా ఉంటే ఫార్ములా ఈ-కార్ రేసు అంశంలో ఈడీ విచారణ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉంది. ఈ విచారణలో ఎటువంటి విషయాలు వెల్లడవుతాయనేది అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలో గురువారం విచారణకు హాజరుకావాల్సిన బీఎల్ఎన్ రెడ్డి డుమ్మా కొట్టారు. తనకు మరింత సమయం కావాలని కోరారు. అందుకు ఈడీ అంగీకారం తెలిపింది. దీంతో మాజీ చీఫ్ ఇంజనీర్ అయిన బీఎల్‌ఎన్ రెడ్డి ఒక్కసారిగా తనకు సమయం కావాలని ఎందుకు కోరారు? అన్న అనుమానాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఒక మాజీ చీఫ్ ఇంజనీర్ విచారణకు రాలేను.. మరింత సమయం కావాలని కోరిన క్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్ ఏమాత్రం విచారణకు వస్తారు? అసలు వస్తారా? ఆయన కూడా సమయం కోరతా? అనేది కీలకంగా మారింది. ఒకవేళ ఆయన కూడా సమయం కావాలని కోరితే ఈడీ స్పందన ఎలా ఉంటుంది? ఒక్కసారిగా వారు విచారణకు ఎందుకు డుమ్మా కొడుతున్నారు? ఏవైనా మంతనాలు చేయడానికా? అన్న అనుమానాలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి. అంతేకాకుండా జనవరి 7వ తేదీన మాజీ మంత్రి కేటీఆర్‌ను కూడా ఈడీ విచారించాల్సి ఉండగా.. అది కూడా ఇలానే వాయిదా పడుతుందా అన్న చర్చ కూడా మొదలైంది. ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో బీఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ చెప్పే విషకాలు కీలకంగా మారనున్నాయి.
కేటీఆర్ కన్నా ముందు వీరి విచారణ జరిగేనా?
కేటీఆర్ ఒత్తిడి మేరకే రూ.54 కోట్ల బదిలీ జరిగిందని ఏసీబీ నిర్ధారించింది. ఈ క్రమంలో ఫార్ములా కార్ అవినీతిలో కేటీఆర్‌ను ఫిక్స్ చేయాలంటే ముందు బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ ఆధారాలతో సహా దొరకాలి. నిధులబదిలీలో నిబంధనలను ఏవిధంగా తుంగలో తొక్కామన్న విషయాన్ని వీళ్ళిద్దరే చెప్పాలి. నిబందనలను తుంగలో తొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది ? అందుకు కారణం ఎవరన్న విషయాన్ని వీళ్ళిద్దరు చెప్పాలి. 7వ తేదీ విచారణలో కేటీఆర్ ను విచారించాలంటే అంతకన్నా ముందు బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్ ను విచారించాలన్న ఈడీ నిర్ణయం సరైనదే. ఎందుకంటే రు. 55 కోట్ల అవినీతి జరిగిందని నమ్ముతున్న ప్రభుత్వం జరిగిన అవినీతి ఏ విధంగా జరిగిందనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి. జరిగిన అవినీతికి రుజువులు కావాలంటే ముందు ఉన్నతాధికారులను గట్టిగా విచారిస్తే కాని ఆధారాలు దొరకవు. అందుకోసమే వీరి విచారణ సమయాలను ప్రణాళిక ప్రకారం జనవరి 2,3 తేదీల్లో ఉన్నతాధికారులను, జనవరి 7న కేటీఆర్‌ను విచారించాలని నిశ్చయించుకుంది.
ఈడీ ప్లాన్ ఫలించేనా..
కాగా ఇప్పుడు విచారణకు హాజరకావడానికి తనకు మరింత సమయం కావాలని బీఎల్ఎన్ రెడ్డి కోరారు. అందుకు ఈడీ ఆమోదం తెలిపింది. దీంతో కేటీఆర్ కన్నా ముందు ఉన్నతాధికారులను విచారించాలన్న ఈడీ ప్లాన్ సక్సెస్ అవుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఒకవేళ అరవింద్ కుమార్ కూడా సమయం కావాలని కోరితే.. కేటీఆర్ కన్నా ముందే వీరి విచారణ జరగడం చాలా కష్టంగా మారుతుంది. లేని పక్షంలో వరుసగా మూడు రోజుల పాటు వీరి విచారణలు జరపడం, లేకుంటే ఒకేరోజు.. వేరువేరుగా వీరి ముగ్గురిని విచారించడం చేయాల్సి ఉంటుంది. మరి వీరి విచారణ విషయంలో ఈడీ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.