మల్కాజిగిరికి ఏమైంది?

దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరిలో 32 లక్షలకు పైగా ఓటర్లు వుంటారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓటింగ్ శాతం 50 శాతం దాటని పరిస్థితి.

By :  Vanaja
Update: 2024-05-13 14:29 GMT

దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరిలో 32 లక్షలకు పైగా ఓటర్లు వుంటారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓటింగ్ శాతం 50 శాతం దాటని పరిస్థితి. ఈ ప్రాంతంలోనే పారిశ్రామిక ప్రాతం కూడా ఉండటమే కాకుండా అనేక ఫార్మా కంపెనీలు కూడా వున్నాయి. మినీ ఇండియాగా పిలువబడే ఈ నియోజకవర్గంలో బీహార్, కేరళ, కర్నాటక, తమిళనాడు ప్రాతాలకు చెందిన వారే కాకుండా, ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. సైనికులు నివసించే కంటోన్మెంట్ ప్రాతం కూడా ఈ పార్లమెంట్ పరిధిలోకే వస్తుంది.

2019 పార్లమెంట్ ఎన్నికలను చూసినా, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను చూసినా ఓటింగ్ 50 శాతం దాటడంలేదు. ఇది వివిధ రాజకీయ పార్టీలకు ఆందోళన కలిగించే విషయంగా చెప్పవచ్చు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీల సంఖ్య కూడా 6 లక్షలకు పైగానే ఉంటుంది. ఇక ఆంధ్రా ప్రాంతానికి చెందిన సెటిలర్స్ ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఓటర్ల కంటే ఎక్కువగానే ఉంటారు. వీరిలో సగానికి పైగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికలకు వెళ్ళడంతో కొంత ఓటింగ్ పర్సంటేజి తగ్గినా, కనీసం 60 శాతానికి పైగా ఓటింగ్ జరగాలి. కానీ జరగడం లేదు.

కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్ పల్లి, మల్కాజిగిరి, ఎల్ బి నగర్, ఉప్పల్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఓటర్లు ఎక్కువ శాతం బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారే వుంటారు. 32 లక్షల ఓటర్లలో ఏ ఎన్నిక చూసినా 20 లక్షల ఓట్లు పోలైన దాఖలాలు కన్పించలేదు. ఇంత పెద్ద నియోజకవర్గం మల్కాజిగిరిలో అధికారులు, రాజకీయనాయకులు ఓటర్లను చైతన్య పరచడంలో విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 నియోజకవర్గాల పోలింగ్ ను చూస్తే, 2019 ఎన్నికలకంటే ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. కానీ ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రం ఓటింగ్ శాతం పెరగకపోవడం, అందులో 32 లక్షల ఓటర్లున్న మల్కాజిగిరి కూడా వుండటంతో, మల్కాజిగిరికి ఏమైందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News