వర్షాలతో ఇళ్లలోకి కింగ్ కోబ్రాలు వస్తున్నాయి...బిగ్ అలర్ట్

హైదరాబాద్ నగరంలో కింగ్ కోబ్రాల సంచారం పెరగడంతో నగర వాసులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.;

Update: 2025-07-25 05:05 GMT
వర్షకాలంలో పెరిగిన పాముల సంచారం

హైదరాబాద్ నగరంలో నాగుపాముల గుడ్ల నుంచి పిల్లలు బయటపడటంతో వీటి సంచారం పెరిగింది.(king Cobras Increased)దీంతో పాటు వర్షాలతో వరదనీరు నిలవడంతో రంధ్రాల్లో నుంచి పాములు పోలోమంటూ ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి.దీంతో నగర వాసులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.

- హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు (Rainy Season) ఇళ్లలోకి పాములు వస్తున్నాయి. భారీ వర్షాల వల్ల వరదనీరు పాములున్న రంధ్రాల్లోకి పోవడం వల్ల అవి కాస్తా బయటకు వచ్చి ఇళ్లు, కార్యాలయాలు మరియు విద్యా సంస్థలు, హాస్టళ్లు, పరిశ్రమల్లోకి వస్తున్నాయి.
- హైదరాబాద్‌లోని వెలుగు చూసిన పాముల్లో 50 శాతం విషపూరితమైన నాగుపాములు (కింగ్ కోబ్రాలు). కింగ్ కోబ్రాలు సాధారణంగా గచ్చిబౌలి, పటాన్‌చెరు, అత్తాపూర్, రాజేంద్రనగర్, ఉప్పల్, నగరం, జవహర్‌నగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, గండిమైసమ్మ వంటి ప్రాంతాల్లో వెలుగుచూశాయి.
- హైదరాబాద్‌లోని మూసీ నదీ వందలాది నాగుపాములు,పైథాన్ పాములకు నిలయంగా ఉంది. నది ఒడ్డున ఉన్న రోడ్ల వెంట కొండచిలువలు తరచుగా కనిపిస్తుంటాయి.



 ఇళ్లలోకి పాములు వచ్చాయ్...పట్టుకోండి

ఇళ్లలోకి పాములు వచ్చాయ్...పట్టుకోండి అంటూ హైదరాబాద్ నగర వాసులు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. నాగుపాములు పెట్టిన గుడ్ల నుంచి వర్షాకాలంలో పిల్లలు బయటకు వస్తుంటాయి.దీంతో నగరంలో కింగ్ కోబ్రాల సంచారం పెరిగింది.సాధారణంగా గతంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీకి రోజుకు పాముల సంచారంపై 100 నుంచి 150 కాల్స్ వస్తుండేవి.ఈ వర్షాకాలంలో పాములలు ఇళ్లలోకి వస్తున్నాయి వచ్చి పట్టుకోండి అంటూ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వాలంటీర్లకు రోజుకు 300కు పైగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అంటే నగరంలో పాముల సంచారంపై ఫోన్ ఫిర్యాదుల సంఖ్య రెట్టింపు అయిందని ఆయన తెలిపారు.

శివారు ప్రాంతాల్లో పాములు బాబోయ్
కాప్రా, ఘట్‌కేసర్, నాగోల్, హయత్‌నగర్, పటాన్‌చెరు, కీసర, గచ్చిబౌలి, కోకాపేట్, రాజేంద్రనగర్, కిస్మత్‌పూర్, జల్‌పల్లి, అత్తాపూర్, అరామ్‌గఢ్, వంటి ప్రాంతాల నుండి పాములు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నట్లు పాముల రక్షకులకు ఫిర్యాదులు వచ్చాయి.ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ (Friends of Snakes Society)గత కొన్ని రోజులుగా కింగ్ కోబ్రాస్, ఎలుక పాములు,చెకర్డ్ కీల్‌బ్యాక్‌లు వంటి విషపూరిత జాతులతో సహా పలు పాములను రక్షించింది.ఇళ్లలో పట్టుకున్న పాములను వాలంటీర్లు అడవిలో వదిలారు.“నాగుపాములు మానవ ఆవాసాల్లో ముఖ్యంగా మెట్రో నగరాల్లో జీవించడానికి అలవాటు పడ్డాయి. ఆహారం కోసం ఎలుకల లభ్యత వల్ల నగరాల్లో సంచరిస్తున్నాయి’’ అని అవినాష్ వివరించారు.



 అప్రమత్తంగా ఉండండి :ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ

హైదరాబాద్‌ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఇళ్లలోకి పాములు వస్తున్నాయని నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని (Big alert) ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ హెచ్చరించారు.వర్షాల వల్ల వరదలు రావడంతో పాములు వాటి బొరియల నుంచి బయటకు వస్తున్నాయని ఆయన చెప్పారు.భారీ వర్షాల సమయంలో పాములు ఇళ్లు, కార్యాలయాలు,విద్యా సంస్థలలోకి చొరబడుతున్నాయని ఆయన వివరించారు.

1995లో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ ఆవిర్భావం
హైదరాబాద్ నగరంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ 1995వ సంవత్సరంలో ఏర్పాటైంది. అప్పటి నుంచి పాములు, మనుషుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు ఈ సొసైటీ వాలంటీర్లు విశేష కృషి చేస్తున్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పాములు కీలక పాత్ర పోషిస్తాయని, అవి ఆహార గొలుసులో ఒక లింక్‌గా పనిచేస్తాయని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వాలంటీర్ ఎన్ రిత్విక్ చెప్పారు.జీవ వైవిధ్యం కోసం కీటకాలు, పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు సమతుల్యంగా ఉండటం అవసరం.



 రూ.700 కోట్ల ఆహారధాన్యాలు తింటున్న ఎలుకలు

ఎలుకలు ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల పంటల నష్టాలకు కారణమవుతున్నాయి. ఎలుకలు పంటలను దెబ్బతీస్తాయి,ధాన్యాలను తింటున్నాయి. దేశంలో ఎలుకల కారణంగా ప్రతి సంవత్సరం 7 నుంచి 8 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను కోల్పోతున్నామని అంచనా వేశారు.ఎలుకలు తింటున్న ఆహార ధాన్యాల విలువ 700కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది.సాధారణ పాములు ఎలుకలను తింటాయి. పాములు ఎలుకల బొరియల నుంచి కూడా వేటాడుతుంటాయి. పాములు తినడం ద్వారా ఎలుకల సంఖ్యను అదుపులో ఉంచుతున్నాయి.

పాముల నుంచి ఎలా రక్షించుకోవాలి
- మీ ఇంటిని పాముల బారి నుంచి రక్షించుకోవాలంటే అన్ని తలుపులు, గోడల పగుళ్లను మూసివేయండి. గోడలు, కిటికీలు, తలుపులలో పగుళ్లను తనిఖీ చేయండి.భూమిపై వస్తువులను నిల్వ చేయవద్దు.కట్టెలు లేదా ఇతర పదార్థాలను నేల నుంచి చాలా ఎత్తులో ఉన్న ప్లాట్‌ఫామ్‌పై ఉంచాలి.గతంలో నిర్మాణ ఇటుకలను తొలగిస్తున్నప్పుడు లేదా గడ్డివాములను ఎత్తేటప్పుడు ప్రజలు పాము కాటుకు గురయ్యారు.
- మీ ఇంటి పెరట్లో తోటను శుభ్రంగా ఉంచండి. క్రమం తప్పకుండా పచ్చిక బయళ్లను కత్తిరించండి. కలుపు మొక్కలను తొలగించి, పాములు దాక్కునే ప్రదేశాలను క్లియర్ చేయండి.
- ఫినాయిల్ లేదా బ్లీచింగ్ పౌడర్ వంటి రసాయనాలు పాములను అరికట్టడంలో సహాయపడతాయి.తోటపని చేసేటప్పుడు లేదా చెత్తను ఎత్తేటప్పుడు చేతి తొడుగులు ధరించండి, ఎందుకంటే పాములు ఆకుల కుప్పల కింద దాక్కుంటాయి.



 పాము ఎందుకు కాటు వేస్తుందంటే...

దేశంలో ప్రతి సంవత్సరం పాముకాటు సంబంధిత ప్రమాదాల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ, పాముకాటు మరణాల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పాములు ప్రతీకారం కోసం లేదా సరదా కోసం కాటు వేయవు. అవి బెదిరింపులకు గురైనప్పుడు లేదా మనం ఏదైనా శారీరక గాయం కలిగించినప్పుడు మాత్రమే కాటు వేస్తాయి.

పాము కాటుకు ఏం చేయాలి
పాము విష వ్యాప్తిని నెమ్మదింపజేయడానికి ప్రశాంతంగా ఉండి, కదలికను తగ్గించండి.గాయాన్ని కత్తిరించవద్దు, విషాన్ని పీల్చవద్దు. మంచు వేయవద్దు.వెంటనే వైద్య సహాయం తీసుకోండి.యాంటివీనమ్ మాత్రమే పాము కాటుకు సమర్థవంతంగా చికిత్స చేయగలదు.

తెలంగాణలో2,400 పాముకాటు కేసులు
హైదరాబాద్ నగరంలో గత సంవత్సరం 2,400 స్నేక్ బైట్ కేసులు వెలుగుచూశాయి.విషపు పాము కరిచాక వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి బాధితులకు యాంటీ వీనం ఇంజక్షన్లు చేయించాలి. లేకుంటే ప్రాణాపాయం వాటిల్లుతుంది. గత ఐదు రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నగర శివార్లలో నివాస ప్రాంతాల్లో పాములు కనిపిస్తున్నాయనే ఫిర్యాదులు పెరిగాయి. శివారు ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీలు, ఫ్యాక్టరీలు,విద్యా సంస్థల్లో పాములు కనిపించడంతో స్థానిక నివాసితులు కలవరపడుతున్నారు.

ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వాలంటీర్లతో స్పెషల్ డ్రైవ్
ఈ నెల 29వతేదీన నాగులపంచమి సందర్భంగా కొందరు పాములు పట్టేవారు పాములను పట్టుకొని వాటి కోరలు పీకేసి, నోరు కుట్టేసి వాటికి పది రోజుల పాటు ఆహారం నీరు ఇవ్వకుండా బుట్టల్లో పెట్టి హింసిస్తున్నారు. నాగులపంచమికి పాములను ఆడించి డబ్బులు వసూలు చేసేందుకు పన్నుతున్న పన్నాగాలను తాము నిరోధించేందుకు అటవీ శాఖ అధికారులతో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ 150 మంది వాలంటీర్లు కలిసి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పాములను బంధించిన వారిని పట్టుకొని వాటిని అడవుల్లో వదిలివేస్తున్నామని వాలంటీర్లు చెప్పారు.

పాములకు పాలు పోయొద్దు...
పాములు పాలు తాగవని, పాలను జీర్ణం చేసుకునే శక్తి వాటికి లేవని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వాలంటీర్లు చెప్పారు.పాములకు పాలు పోసి వాటి మరణానికి కారణం కావద్దని వారు కోరారు.నాగపంచమి సందర్బంగా ఈ నెల 29వతేదీన పుట్టల్లో పాలు పోయవద్దని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వాలంటీర్లు సూచించారు. పాములకు నోరు కుట్టి పది రోజులపాటు ఆహారం,నీరు ఇవ్వకుండా బుట్టల్లో పెడితే అలాంటపుడు పాలు పోస్తే అవి ఆకలితో నీరు అనుకొని తాగుతాయని, దీనివల్ల అవి మరణిస్తాయని వాలంటీర్లు చెప్పారు. పాములను బంధించవద్దని వాలంటీర్లు కోరారు.

ఆసుపత్రుల్లో యాంటీవీనం ఇంజక్షన్లు
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయని, ఈ క్రమంలో రైతులు ఎక్కువ సమయం పొలాల్లోనే గడుపుతుంటారని.. ఈ క్రమంలో పాము, తేలు కాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు.ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకూ అన్ని హాస్పిటళ్లలో పాము, తేలు కాటు పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించేందుకు అవసరమైన మెడిసిన్, ఇంజెక్షన్లు అందుబాటులోకి ఉంచామని మంత్రి రాజనర్సింహ చెప్పారు.

ఇంట్లోకి పాము వచ్చిందా? అయితే ఈ హెల్ప్ లైనుకు ఫోన్ చేయండి
ఇంట్లోకి పాము వచ్చిందా? అయితే హెల్ప్ లైన్ ఫోన్ నంబరు 83742 33366 హెల్ప్ లైనుకు ఫోన్ చేయండి అని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సూచించింది. 24గంటలపాటు స్నేక్ రెస్క్యూ హెల్ప్‌లైన్ పాములు పట్టే సేవఅందుబాటులో ఉందని సొసైటీ వాలంటీర్లు చెప్పారు.


Tags:    

Similar News