బీసీ మహాధర్నాలో బీజేపీ, బీఆర్ఎస్ అందుకే పాల్గొనలేదా..?

తెలంగాణలో బీసీ డిక్లరేషన్ కోసం పట్టుబట్టి నిరసనలు, ధర్నాలు చేపట్టిన వీళ్లు ఢిల్లీలో బీసీ సంఘాలు చేస్టున్న ధర్నాకు ఎందుకు హాజరవలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.;

Update: 2025-04-02 10:34 GMT

బీసీలకు 42 శాతం రిజవర్వేషన్ల కోసం బీసీ సంఘాలన్నీ ఏకమయ్యాయి. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా మహా ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు కూడా పాల్గొని బీసీ సంఘాలకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. తమిళనాడు, మహారాష్ట్ర ఎంపీలు కూడా కొందరు ఈ ధర్నాలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత రావడానికి పార్లమెంటు ఆమోదం ఒక్కటే మిగిలి ఉంది. దీంతో కేంద్రం నుంచి ఈ రిజర్వేషన్లకు ఆమోదం అందుకోవడం కోసం బీసీ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ, బీఆర్ఎస్‌లు.. ఢిల్లీలో చేస్తున్న మహాధర్నాకు మాత్రం దూరంగా ఉండిపోయాయి. ఈ అంశం ప్రస్తుతం కీలకంగా మారింది. ఇన్నాళ్లూ తెలంగాణలో బీసీ డిక్లరేషన్ కోసం పట్టుబట్టి నిరసనలు, ధర్నాలు చేపట్టిన వీళ్లు ఢిల్లీలో బీసీ సంఘాలు చేస్టున్న ధర్నాకు ఎందుకు హాజరవలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ‘బీజేపీ నేతలు రాలేందంటే ఒక అర్థం ఉంది. కానీ.. బీఆర్ఎస్ ఎందుకు వెళ్లలేదో అర్థం కావట్లేదు’ అని కొందరు విశ్లేషకులు అంటున్నారు.

తెలంగాణలో మొన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌పై బీసీ రిజర్వేషన్ల కోసం దండయాత్ర చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లడానికి ఎందుకు జంకుతుంది? కాంగ్రెస్‌పై పోరాడటానికి చూపిన ఉత్సాహం ఇప్పుడేమైంది. బీజేపీపై పోరాడటానికి, బీజేపీని బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నిచడం లేదు? ఢిల్లీ వెళ్లొద్దని గులాబీ బాస్ కేసీఆర్ ఆర్డర్ ఇచ్చారా? ఢిల్లీ వెళ్లకపోవడం వల్ల ఒరిగేదేంటి? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

‘కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీనే. అందుకే బీసీ సంఘాలు చేస్తున్న మహాధర్నాలో.. తెలంగాణ బీజేపీ నేతలు, ఎంపీలు పాల్గొనలేదు. పాల్గొంటే వారికి పార్టీ హైకమాండ్ నుంచి చిక్కులు తప్పవు. ఈ ధర్నాలో పాల్గొంటే పార్టీ పెద్దల దృష్టిలో నెగిటివ్‌గా పడతాం. ఇదంతా దేనికి.. ధర్నాకు దూరంగా ఉంటే సరిపోతుంది’ అని బీజేపీ నేతలు భావించి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం బీసీల ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలకే బీజేపీ నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకు ఈ ధర్నాలో వాళ్లు పాల్గొనకపోవడమే అతిపెద్ద నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇకపోతే అసలు చర్చంతా కూడా బీఆర్ఎస్ చుట్టూనే నడుస్తోంది. కులగణన జరగక ముందు నుంచి, అసెంబ్లీ బీసీ బిల్లు ఆమోదం అందుకునే వరకు కూడా బీసీల కోసం బీఆర్ఎస్ ఒక్కటే పోరాడుతుంది అన్నట్లు ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. పలు చోట్లు సభలు కూడా నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటంలో బీఆర్ఎస్ నేతలు కీలక భూమిక పోషించారు. చరిత్రను పునరుద్ఘాటించి మరీ.. బీసీలకు ఇంతకాలం జరిగిన అన్యాయాన్ని వివరించారు. అలాంటిది.. ఇప్పుడు అసెంబ్లీలో ఆమోదం లభించిన బీసీ రిజర్వేషన్లకు.. కేంద్రం నుంచి కూడా ఆమోదం పొందడం కోసం చేస్తున్న ధర్నాలో మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా బీఆర్ఎస్ నేతలు పాల్గొనలేదు. అంతేకాకుండా ఈ ధర్నాకు మద్దతుగా ఒక మాట కూడా మాట్లాడలేదు.

విషయం రాష్ట్రం దాటడంతో బీసీలపై బీఆర్ఎస్ ప్రేమ తగ్గిపోయిందా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా మరికొందరయితే.. బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుంది అనడానికి ఇది అతిపెద్ద నిదర్శనమని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాటం అనడంతోనే బీఆర్ఎస్ వెనకడుగు వేసిందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను విమర్శకులు కూడా కొట్టిపారేయడం లేదు. లిక్కర్ స్కామ్ కేసులో జలులో ఉన్న కవితను బయటకు బెయిల్ ఇప్పించడం కోసం కేటీఆర్.. చాలా తిప్పలు పడ్డారని, ఆ సమయంలోనే బీజేపీ పెద్దలతో కూడా పలుమార్లు భేటీ అయ్యారని, ఆ సమయంలోనే ఏదో ఒప్పందం చేసుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయని గుర్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి పెంచడం కోసం చేస్తున్న ధర్నా అనడగంతో బీఆర్ఎస్ మౌనముద్ర వేసిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అలా కాని పక్షంలో.. తెలంగాణ అసెంబ్లీ బీసీ బిల్లుకు ఆమోదం రాకముందు వరకు.. శాసనసభలో ఆమోదించండి.. ఢిల్లీలో ప్రధాని మోదీతో కలిసి అఖిలపక్షంగా మాట్లాడి ఆమోదం అందుకుందాం అన్న బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎందుకు కనుమరుగయ్యారు. మోదీ అపాయింట్‌మెంట్ అడిగి తీసుకుంటా అన్న బీజేపీ నేతలు కానీ, బీసీ కోసం మోడీని ఎదిరించడానికి రెడీ అన్న బీఆర్ఎస్ నేతలు కానీ ఇప్పుడు ఏమయ్యారు. ఎందుకు బయటకు రావడం లేదు. ఢిల్లీకి వెళ్లడంతో బీసీలు తమవారు కాకుండా పోయారా? అన్న చర్చలు తీవ్రతరం అవుతున్నాయి. మరి ఈ ధర్నాలో పాల్గొనకపోవడంపై బీజేపీ, బీఆర్ఎస్‌లు అధికారికంగా ఏమైనా ప్రకటన విడుదల చేస్తాయా అనేది చూడాలి.

Tags:    

Similar News