టీపీసీసీ చీఫ్ నియామకం... రేవంత్ మద్దతు ఎవరికి?

పీసీసీ చీఫ్ పదవి తో పాటు, మంత్రివర్గ విస్తరణపైనా కొంతకాలంగా కాంగ్రెస్ లో ఉత్కంఠ నెలకొంది.

By :  Vanaja
Update: 2024-08-23 09:04 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. ఆయనతోపాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి కూడా నిన్న రాత్రే ఢిల్లీ వెళ్లగా... ఈరోజు తెల్లవారుజామున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హస్తిన చేరుకున్నారు. ఈ పర్యటనలో అయినా కొలిక్కి రాని పీసీసీ చీఫ్ పదవిపై క్లారిటీ వస్తుందని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కాగా ఢిల్లీలో వీరు పార్టీ అగ్రనేతలైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది.

ఈ భేటీలో కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న టీపీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ, మిగిలిన నామినేటెడ్ పోస్టులపైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీ పగ్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నేతలకి ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ రేసులో బీసీ కోటాలో మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్సీ (మాదిగ), ఎంపీ బలరాం నాయక్ ఎస్టీ (లంబాడ) పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

చర్చనీయాంశంగా సీఎం - మందకృష్ణ భేటీ

గురువారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ భేటీ అవడం చర్చనీయాంశం అయింది. పీసీసీ చీఫ్ పదవిని మాదిగలకు ఇచ్చే అంశంపై చర్చలు జరిపారని కూడా ప్రచారం జరిగింది. కానీ, మందకృష్ణ మాత్రం ఎస్సీ వర్గీకరణపై చర్చలు జరిపినట్టు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎక్స్ లో వెల్లడించారు.

మంత్రివర్గ విస్తరణపై స్పష్టత..

పీసీసీ చీఫ్ పదవి తో పాటు, మంత్రివర్గ విస్తరణపైనా కొంతకాలంగా కాంగ్రెస్ లో ఉత్కంఠ నెలకొంది. సీఎం బృందం ఢిల్లీ పర్యటనతో ఈ అంశం కూడా కొలిక్కిరావచ్చని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకాటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్, రామచంద్ర నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి.

వరంగల్ సభకి ఆహ్వానం...

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపైనా రేవంత్ చర్చించనున్నారు. వరంగల్ లో నిర్వహించే రైతు కృతజ్ఞత సభకి రాహుల్ గాంధీకి ఆహ్వానం, సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియాగాంధీని ఆహ్వానించే తేదీలు ఈ భేటీలో ఖరారు కానున్నట్టు తెలుస్తోంది. మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన చర్చలు జరపనున్నారు.

రేవంత్ మద్దతు ఎవరికి?

సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం గుడ్ లుక్స్ లో ఉన్నారు. పీసీసీ చీఫ్ నియామకం విషయంలో ఆయన అభిప్రాయాన్ని హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటుంది. ఆయన ఎవరి పేరు చెబితే వారినే నియమించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో రేవంత్ ఎవరికి మద్దతు ఇస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. 

Tags:    

Similar News