ఎవరీ కొండా సురేఖ? ఎందుకింత సంచలనం!

రాజకీయ వివాదాలు, సంచలనాలు ఆమెకి కొత్తకాదు. ఆమె నమ్మినదానికి కట్టుబడి ఉంటారు. అట్లాగే కటువుగానే మాట్లాడతారు. ఇంతకీ ఈమె ఎవరు? ఆమె రాజకీయ నేపథ్యమేమిటీ?

Update: 2024-10-03 06:02 GMT

కొండా సురేఖ ఏమి చేసినా సంచలనమే. సరిగ్గా 24 గంటల కిందట ఓ రాజకీయ దుమారాన్ని రేపారు. ఓ వివాదంలోకి సినీనటుడు నాగార్జున కుటుంబాన్ని, విడాకులు తీసుకున్న నాగచైతన్య, సమంతను, పనిలో పనిగా తన రాజకీయ ప్రత్యర్థి కల్వకుంట్ల తారక రామారావు పేరును లాగి ఆ తర్వాత నాలుక్కరుచుకున్నారు. ఆమె సృష్టించిన మంటలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తం అయ్యాయి. చిరంజీవి మొదలు ప్రకాశ్ రాజ్ వరకు సినీ ప్రముఖులందరూ ఆమెపై మండిపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగా తాను సమంత వ్యవహారాన్ని తెరపైకి తీసుకురాలేదని, ఏదో యథాలాపంగా వచ్చిందేనని ఆమె మొత్తుకుంటున్నా ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. పైగా ఎగిసిపడుతున్నాయి.


రాజకీయ వివాదాలు, సంచలనాలు ఆమెకి కొత్తకాదు. ఆమె నమ్మినదానికి కట్టుబడి ఉంటారు. అట్లాగే కటువుగానే మాట్లాడతారు. ఇంతకీ ఈమె ఎవరు? ఆమె రాజకీయ నేపథ్యమేమిటీన? అనే దాన్ని గూగుల్ లో పెద్దఎత్తున శోధిస్తున్నారు.

ఆమె పుట్టింది వరంగల్ కి సమీపంలోని ఊకల్ గ్రామంలో. తండ్రి తుమ్మా చంద్రమౌళి, తల్లి రాధ. 1965 ఆగస్టు 19న పుట్టారు. ఆమె వయసు ఇప్పుడు 58. సురేఖ ఏదీ చేసినా దావాలనమే. ఆమె పద్మసాలీ. ఆమె భర్త కొండా మురళి మున్నూరు కాపు. వీరిది ప్రేమ వివాహం. వీరికో కుమార్తె సుష్మితా పటేల్. కుమార్తె పెళ్లి వ్యవహారం కూడా ఆనాడు సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. తమ కుమార్తెకు 18 ఏళ్లకే పెళ్లి చేయడమేమిటంటూ కొందరు చర్చలు పెట్టారు. అయితే వాటినేటినీ ఆమె పట్టించుకోలేదు. తన భర్త కొండా మురళీపై ఏవేవో అపవాదులు వేసినా, ఆయనో రౌడీ అని నిందించినా ఆమె చలించదు.

కొండా సురేఖ రాజకీయాల్లో పడి లేచిన కేరటం. చాలామందిలాగా ఒక్కసారిగా రాజకీయాల్లోకి పై నుంచి ఊడి పడిన వ్యక్తి కాదు. రాజకీయ ప్రత్యర్థులను స్వశక్తితో ఎదుర్కోవాలనే పట్టుదల, దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి. ఆమె పట్టుదల ఎలా ఉంటుందనే దానికి నిదర్శనమే 2010లో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో సృష్టించిన వీరంగం. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కాదని ఓదార్పు యాత్ర చేపట్టారు. ఆనాడు ఎంపీగా ఉన్న జగన్ సమైక్యాంధ్రకు జైకొట్టారు. అటువంటి వ్యక్తి తెలంగాణలో పర్యటించడానికి వీలులేదంటూ తెలంగాణవాదులు కొందరు ఆటంకం సృష్టించబోయినపుడు ఆమె కొంగు బిగించి.. రండ్రా ఎవడొస్తారో, జగన్ ని ఎలా ఆపుతారో అంటూ సవాల్ విసిరారు, రైల్వే స్టేషనంతా ఉరుకులు పరుగులు పెట్టించారు. అంతటి పట్టుదల గల మనిషి గనుకనే ఇక కొండా కుటుంబం చరిత్ర కనుమరుగైనట్టే అనుకున్నప్పుడల్లా ఫీనిక్స్ పక్షిలా పైకి లేస్తూనే వచ్చారు.
దాదాపు మూడు దశాబ్దాల కిందట మండల పరిషత్ అధ్యక్షురాలు నుంచి 1999లో వరంగల్ జిల్లా శాయంపేట నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. సురేఖ రాజకీయ ప్రయాణం స్ఫూర్తిదాయకమైందే. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి విధేయులుగా ఉన్న కొండా దంపతులు తమ రాజకీయ మనుగడ కోసం నిరంతరం ఫైట్ చేస్తూనే వచ్చారు.
2009లో పర్కల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన తర్వాత ఆమె కష్టపడి పని చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆమెను మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా నియమించారు. 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ దుర్మరణం చెందడం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు ఒక్క నిమిషం కూడా వెనుకాడలేదు.

2010లో తెలంగాణలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఓదార్పు యాత్ర’లో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచి తెలంగాణ వాదుల నుంచి అతిపెద్ద సవాలును ఎదుర్కొన్నారు. ఆమె తన మద్దతుదారులతో కలిసి మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో తెలంగాణ ఆందోళనకారులపై దాడి చేసినంత పని చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఇదో పెద్ద సంఘటనగా చెబుతుంటారు.
జగన్ కి మద్దతుగా 2011లో ఆమె అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ మరుసటి ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె పర్కల్ నియోజకవర్గం నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చేనాటికి ఆమె దాదాపు తెర వెనుకే ఉండిపోయారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని ఆనాటి టీఆర్ఎస్ పై తరచూ విరుచుకుపడే ఆమె 2014 ఎన్నికలకు కొద్దిగా ముందు జగన్ తో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచారు. టీఆర్ఎస్ లో ఇమడలేక ఆ తర్వాత బయటకి వచ్చారు. 2018లో కాంగ్రెస్ టిక్కెట్‌పై అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 2023లో జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీతో మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టి రెండోసారి మంత్రి అయ్యారు. 2023 డిసెంబర్ 7న ఆమె తెలంగాణ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఆమె పర్యావరణం, అటవీ శాఖతో పాటు దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా ఉన్నారు.

స్వతంత్రంగా ఆలోచించగలిగిన నాయకురాలిగా ఆమెకు పేరుంది. ప్రత్యర్థులను విమర్శించడానికి ఏమాత్రం వెనుకాడరు. అయితే పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం పనికి రాదు. రాజకీయ ప్రత్యర్థులు తనపై విమర్శలు చేసి ట్రోల్ చేస్తున్నారన్న ఆక్రోశంతో ఆమె కల్వకుంట్ల తారక రామారావును టార్గెట్ చేశారు. అంతవరకు ఎవరికీ అభ్యంతరాలు లేకపోయినా వేరే వాళ్ల భుజం మీద తుపాకి పెట్టి తన ప్రత్యర్థిని ముగ్గులోకి లాగాలనుకోవడమే తప్పు. ఇప్పుడదే జరిగింది. తనెంతో అభిమానించే, తననెంతగానో ఆదరించే మెగాస్టార్ చిరంజీవి మొదలు చిన్నా చితకా యాక్టర్ల వరకు ఆమె టార్గెట్ అయ్యారు. ఆమె తాను చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేస్తున్నా ఆమె సృష్టించిన మంటలు ఆగకపోగా ఇప్పుడామె గతాన్నీ, ఆమె సృష్టించిన వివాదాలను తొవ్వితీసి పైకి ఎగజిమ్మే పనిలో రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారు.
Tags:    

Similar News