13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్... ఈ రంగుల అలర్ట్స్ ఏం చెబుతాయి?

ప్రతి సీజన్ లోనూ భారత వాతావరణ శాఖ కలర్ అలర్ట్స్ జారీ చేస్తుంది. ఇది మనకి తెలిసిన విషయమే. కానీ ఏ రంగు అలర్ట్ ఏం సూచిస్తుందో అందరికీ తెలియదు.

By :  Vanaja
Update: 2024-05-01 06:15 GMT

తెలంగాణలో రోజురోజుకి వేసవి ఎండలు మండిపోతున్నాయి. మరో వారం రోజుల పాటు వడగాల్పులు తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకి తోడు పొడి వాతావరణం, దక్షిణ, నైరుతి దిశల నుంచి గాలుల ప్రభావం వల్ల వడగాడ్పుల తీవ్రత పెరుగుతోందని వివరించింది. మే 6వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో 13 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. అయితే ఈ నెల 6 వరకు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మంగళవారం నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు...  

మంగళవారం రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో 41 నుండి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండం - 44.4, నిజామాబాద్ - 44.1, ఖమ్మం - 43.5, మహబూబ్ నగర్ - 43.3, మెదక్ - 43.2, నల్గొండ - 43.0, భద్రాచలం - 43.0, ఆదిలాబాద్ - 42.8, హన్మకొండ - 42.0, హైదరాబాద్ - 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా జైన లో అత్యధికంగా 46.2 డిగ్రీలు, అల్దీపూర్ లో46.1 డిగ్రీలు, కొల్వాయ్ లో 46 డిగ్రీలు ఎండ తీవ్రత ఉండగా.. నల్గొండ జిల్లా మాడుగులపల్లి లో 46.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. 

అసలు ఈ కలర్ అలర్ట్స్ ఏమిటి?

ప్రతి సీజన్ లోనూ భారత వాతావరణ శాఖ కలర్ అలర్ట్స్ జారీ చేస్తుంది. ఇది మనకి తెలిసిన విషయమే. కానీ ఏ రంగు అలర్ట్ ఏం సూచిస్తుందో అందరికీ తెలియదు. ఇప్పుడు ఈ కలర్ అలర్ట్స్ ఏంటో, వేసవిలో ఏ అలర్ట్ దేనికి సంకేతమో తెలుసుకుందాం.

వాతావరణ శాఖ పరిస్థితి తీవ్రతను తెలియజేయడానికి ఈ కలర్ అలర్ట్స్ జారీ చేస్తుంది. వాతావరణంలో మార్పుల ప్రభావం గురించి అధికారులను హెచ్చరించడానికి, విపత్తు ప్రమాద పరిణామాలను తగ్గించడానికి అవసరమైన చర్యలను తీసుకునేలా వారిని అలర్ట్ చేయడానికి ఈ కలర్ అలర్ట్స్ ఉపయోగపడతాయి.

నాలుగు రకాల కలర్ అలర్ట్స్..

వాతావరణ హెచ్చరికలను సూచించడానికి నాలుగు రకాల రంగులను ఇండియన్ మెటరాలజీ డిపార్ట్మెంట్ ఉపయోస్తోంది. అవే గ్రీన్ (ఆకుపచ్చ), ఎల్లో (పసుపు), ఆరెంజ్ (నారింజ), రెడ్ (ఎరుపు) కలర్స్. ఒక్కో కలర్ అలర్ట్ ఒక్కో హెచ్చరికను సూచిస్తుంది. వాతావరణంలోని మార్పులని బట్టి ఈ కలర్ అలర్ట్స్ కూడా ప్రతి రోజూ, ప్రతి ప్రాంతంలోనూ వేరువేరుగా ఉండే అవకాశాలు ఉంటాయి.

గ్రీన్ అలర్ట్ : గ్రీన్ అలర్ట్ ఇస్తే వాతావరణం అంతా బాగానే ఉందని, ఎలాంటి అసాధారణ మార్పులు లేవని అర్ధం. వాతావరణ శాఖ నుండి ప్రత్యేకమైన సలహాలు, సూచనలు ఉండవు.

ఎల్లో అలర్ట్ : అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ సూచిస్తుంది. ఏ క్షణమైనా వాతావరణం అధ్వాన్నంగా మారవచ్చని, రోజువారీ కార్యకలాపాలకు బ్రేక్ పడొచ్చని ఇది సూచిస్తుంది.

ఆరెంజ్ అలర్ట్ : ఆరెంజ్ అలర్ట్ వాతావరణం ఇబ్బందికరంగా మారిందని తెలిపే అలర్ట్. ప్రజలు బయటకి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించే హెచ్చరిక. ఈ అలర్ట్ జారీ అయినప్పుడు బయటకి అత్యంత అవసరం ఉంటే తప్ప వెళ్ళకూడదు. తప్పనిసరి వెళ్లాల్సినప్పుడు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళాలి. సీజన్ ని బట్టి రైళ్లు, విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయాలని హెచ్చరించే అలర్ట్ ఇది. 

రెడ్ అలర్ట్: రెడ్ అలర్ట్ జారీ అయిందంటే అన్నీ షట్ డౌన్. వాతావరణంలో మార్పులు తీవ్ర ప్రమాదస్థితిని కల్పించాయని అర్ధం. అధికారులు రంగంలోకి దిగాల్సిందే. ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని సూచించే హెచ్చరిక ఇది.

Tags:    

Similar News