గ్రూప్-1 అభ్యర్థులకు ఝలక్.. స్టే కుదరదన్న సుప్రీంకోర్టు

తెలంగాణ గ్రూప్-1 అంశం సుప్రీంకోర్టుకు చేరింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Update: 2024-10-21 08:30 GMT

తెలంగాణ గ్రూప్-1 అంశం సుప్రీంకోర్టుకు చేరింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణను అత్యున్నత న్యాయస్థానం ఈరోజు స్వీకిరంచి విచారణ జరిపింది. కొద్దిసేపటికే ఈ విషయంపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం గ్రూప్-1 అభ్యర్థులకు భారీ షాక్‌లా తగిలింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయడానికి నిరాకరించిన న్యాయస్థానం పరీక్ష నిర్వహణలో తాము జోక్యం చేసుకోదలచుకోవడం లేదంటూ స్పష్టం చేసింది.

దాంతో ఈ విషయంలో హైకోర్టు నిర్ణయానికే మద్దతు ఇస్తున్నట్లు వివరించారు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలు స్పష్టం చెప్పిందని వివరించారు. అంతేకాకుండా పరీక్ష జరుగుతున్నప్పుడు, అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో ఉన్న సమయంలో ఈ విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదని కూడా ధర్మాసనం వెల్లడించింది. అంతేకాకుండా గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల కాకముందే ఈ అంశంతో తుది విచారణను ముగించాలంటూ హైకోర్టుకు ఆదేశించింది సుప్రీంకోర్టు.

పిటిషన్‌లో అభ్యర్థులు ఏం చెప్పారంటే..

తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 29ను రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు తమ పిటిషన్‌లో కోరారు. జీవో 55నే అమలు చేయాలంటూ కోరినప్పటికీ తమ అభ్యర్థనను సీఎం పట్టించుకోవడం లేదని వివరించారు. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న జీవో 29న జారీ చేశారని, దానిని రద్దు చేయాలని తాము కోరుతున్నామని గ్రూప్-1 అభ్యర్థులు తమ పిటిషన్‌లో వివరించారు. జనరల్ కేటగిరిలోని అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్‌రిజర్వ్‌డ్‌గానే పరిగణిస్తుండటం వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని వారు చెప్పుకొచ్చారు. జనరల్ కేటగిరి అభ్యర్థుల కన్నా ఎక్కువ మార్కులు వచ్చినా వారిని రిజర్వేషన్ కేటగిరిగానే పరిగణించి 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు పిలవాలని కోరారు.

గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం సలహా

ఈ నేపథ్యంలోనే ఈరోజు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు, హాజరవుతున్న అభ్యర్థులకు నా శుభాకాంక్షలు. ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయండి. ఈ పరీక్షల్లో మీరు విజయం సాధించి తెలంగాణ పునర్ నిర్మాణంలోభాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.

Tags:    

Similar News