Revanth Reddy | ‘ఎప్పుడూ అందుబాటులో ఉంటా.. ఎప్పుడైనా కలవచ్చు’
హైదరాబాద్‌లో పెరుగుతున్న కాలుష్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.;
హైదరాబాద్‌లో పెరుగుతున్న కాలుష్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రమండలానికి వెళ్తున్నాం కానీ భూమిపైన ఎలా ఉండాలో మాత్రం తెలుసుకోలేకపోతున్నామని అన్నారు. హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనంతరం సీఐఐ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు పంచుకున్నారు. ఎటువంటి సమస్య ఉన్నా తనను కలొచ్చని, తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పారు రేవంత్. అన్ని రంగాల వారికి హైదరాబాద్‌ను బెస్ట్ డెస్టినేషన్‌గా మారుస్తానని అన్నారు.
‘‘హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే కాలుష్యకారక వాహనాలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలిస్తున్నాం. తెలంగాణలో స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలతో క్యాంటీన్లు ఏర్పాటు చేయించాం. మహిళా సంఘాలతో సోలార్ పవర్ స్టేషన్లు ఏర్పాటు చేయిస్తున్నాం. 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసేలా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం. హైటెక్ సిటీ పక్కనే మహిళా సంఘాల ఉత్పత్తులను విక్రయించు కునేందుకు మూడున్నర ఎకరాల స్థలంలో స్టాల్స్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మొటిక్ ఛార్జీలు ను పెంచాం. మహిళాభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం’’ అని తెలిపారు.
‘‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నాం. గ్రామీణ మహిళల సాధికారత కోసం ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. తెలంగాణలో ఆటో మొబైల్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాం. మచిలీపట్నం పోర్ట్ ను అనుసంధానం చేస్తు రోడ్డు, రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రీజనల్ రింగ్ రైల్వే లైన్ మంజూరు చేయాలని ప్రధాని మోదీ ని కోరాం. చైనా తరహాలో క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య రేడియల్ రోడ్లు నిర్మిస్తాం. తెలంగాణలో ప్రతి యేడాది లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఎక్కువ మంది విద్యార్థుల్లో స్కిల్ ఉండటం లేదు. టాటా గ్రూప్‌తో కలిసి 2400 కోట్లతో రాష్ట్రంలోని ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నాం. నైపుణ్యాల పెంపు కోసం ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఐఎస్బీ తరహాలో స్కిల్ యూనివర్సిటీ కోసం ఆనంద్ మహీంద్రా చైర్మన్‌గా బోర్డు ఏర్పాటు చేశాం. స్కిల్ యూనివర్సిటీ కార్పస్ ఫండ్ కోసం సీఐఐ ప్రతినిధులు మద్దతు ఇవ్వాలి. స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే 50 ఏళ్ల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. సీఐఐ ప్రతినిధులు ఎప్పుడైనా వచ్చి నన్ను కలవచ్చు.. మా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది’’ అని తెలిపారు.