‘మూసీ దోపిడి సోనియా అల్లుడి కోసమేగా’.. సీఎం రేవంత్‌కు బండి ప్రశ్న..
మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ అంశంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి మరోసారి మూసీ ప్రాజెక్ట్‌పై మండిపడ్డారు.
మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ అంశంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. ఆరోపణలు ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్లతో మూసీ ప్రాజెక్ట్ పూర్తిగా రాజకీయంలో మునిగిపోయింది. మూసీ ప్రాజెక్ట్‌లో అడుగడుగునా రాజీకయ ఆరోపణలు, సవాళ్లే కనిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం జరిపించాలనే తాము రంగంలోకి దిగామాని బీజేపీ అంటోంది. ఈ క్రమంలోనే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేశారు బీజేపీ నేతలు. ఈ ధర్నాలో మాట్లాడుతూ.. కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు.
సోనియా గాంధీ అల్లుడు(వాద్రా) కోసం మూసీ దోపిడీకి స్కెచ్ వేస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సోనియా అల్లుడి కోసం తెలంగాణ పేదోళ్లను బజారున పడేయడం ఎంతవరకు న్యాయమో ఒక్కసారైనా ఆలోచించారా? అంటూ విమర్శించారు. లండన్, సియోల్‌కు కాదు మూసీ బాధితుల ముందుకు వచ్చే దమ్ము సీఎం రేవంత్‌కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవన అంటూ భారీ స్కామ్‌కు కాంగ్రెస్ తెరలేపిందని, సమర్మతి, నమామీ గంగతో మూసీకి పోలిక ఏంటని ఆయన మండిపడ్డారు. సబర్మతి, నమామి ఖర్చుకు, మూసీ ఖర్చుకు ఏమైనా పొంతన ఉందా? అని నిలదీశారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన పేదలకు అండగా బీజేపీ ఉంటుందని భరోసా ఇచ్చారు.
వాళ్ల భవనాల జోలికెళ్లే దమ్ముందా?
‘‘మూసీ పేరుతో కాంగ్రెస్ చేస్తున్నదంతా అవినీతే. మూసీ ప్రక్షాళన.. సుందరీకరణ.. పునరుజ్జీవం అంటూ మాటలు మారుస్తూ వస్తోంది ప్రభుత్వం. సీఎం రేవంత్ ఏమో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి లండన్‌లో థేమ్స్ నదిలా మూసీ మారుస్తానంటారు. మంత్రులేమో దక్షిణకొరియాలోని చంగ్ ఏ చంగ్ నదిలా మారుస్తామంటారు. ఎలా మార్చాలో వాళ్లకే ఒక క్లారిటీ లేదు. మూసీని అడ్డుకుపెట్టుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం నేతలు కబ్జాలు చేసిన కట్టుకున్న భవనాల జోలికి వెళ్లే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా?’’ అని ఛాలంజ్ చేశారు బండి సంజయ్. పేదల ఇళ్ల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని, తమ ప్రాణాలు పణంగా పెట్టైనా కాపాడతామని హెచ్చరించారు. పేదోటి ఒంటిపైకి బుల్డోజర్ వెళ్లాలంటే తమను దాటే పోవాలని అన్నారు.
సబర్మతికి మూసీకి పోలికా..!
అనంతరం సబర్మతి, నమామా గంగే నదుల సుందరీకరణ ప్రాజెక్ట్‌లను మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్‌ల మధ్య పోలిక పెట్టడాన్ని బండిసంజయ్ తోసిపుచ్చారు. వీటి మధ్య అసలు పోలిక ఎలా పెడతారని ప్రశ్నించారు. ‘‘సబర్మతి ప్రాజెక్ట్‌కు రూ.7 వేల కోట్లే ఖర్చు అయింది. వందల కిలోమీటర్ల పొడవున్న నమామి గంగే ప్రాజెక్ట్‌కు కూడా రూ.40 వేల కోట్ల ఖర్చు అయింది. అలాంటప్పుడు మూసీకి రూ.లక్షన్నర కోట్లు ఎందుకు? కిలోమీటర్ సుందరీకరణకు రూ.2వేల కోట్లు ఖర్చు చేయాలా? సోనియా అల్లుడు వాద్రా కోసమే మూసీ డ్రామాలు ఆడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ మూసీ కోసం కాదు. దేశంలో చచ్చిపోయిన కాంగ్రెస్ పునరుజ్జీవం కోసం. దాని కోసం తెలంగాణ సోమ్ము కాజేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ దోపిడీని అడ్డుకుంటాం. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎం కాకుండా కాపాడుకుంటాం’’ అని అన్నారు.
సీఎం సవాల్‌ను స్వీకరిస్తున్నాం: కిషన్ రెడ్డి
ఈ మహాధర్నా సందర్భంగానే సీఎం రేవంత్ చేసిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. తాము మూసీ సుందరీకరణ, ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, పేదల ఇళ్ల కూల్చివేతలకు మాత్రం వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. పేదలను ఇళ్లను కూల్చాలన్న దుర్మార్గపు ఆలోచనను సీఎం రేవంత్ రెడ్డి విరమించుకోవాలని కోరారు. ‘‘మూసీ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో మూడు నెలలు పాటు నివాసం ఉంటే ఈ ప్రాజెక్ట్‌ను విరమించుకుంటా అన్న సీఎం ఛాలెంజ్‌ను మేము స్వీకరిస్తున్నాం. మూసీ పరివాహక ప్రాంతంలోని పేదల ఇళ్లలో ఉండటానికి మేము సిద్ధమే. సీఎంకు చిత్తశుద్ది ఉంటే ఆయన మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించాలి’’ అని కిషన్ రెడ్డి తెలిపారు. రేవంల్ ఛాలెంజ్ చేసినట్లు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండటానికి తాము సిద్ధమేనని, అదే విధంగా పేదల ఇళ్లు కూల్చేమంటే చంచల్ గూడా, చర్లపల్లి జైలుకు వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నామని హెచ్చరించారు.