CM Revanth Reddy | రైజింగ్ తెలంగాణ అభివృద్ధే లక్ష్యం
హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ)ని నిర్మించాలని నిశ్చయించుకున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.;
హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ)ని నిర్మించాలని నిశ్చయించుకున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ప్రపంచ దేశాల సరసన నిలబెట్టడమే తన కలగా పేర్కొన్నారు. ఇతర దేశాల్లోని నగరాలతో మనం నిర్మించే ఫీచర్ సిటీ పోటీ పడనుందని, అభివృద్ధిలో ప్రపంచ నగరాల తలదన్నేలా నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరండా చేయాలని సంకల్పించామని వెల్లడించారు.
దేశంలోనే గొప్ప నగర నిర్మాణం
‘‘జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం సంతోషం. తెలంగాణ ఏర్పడి దశాబ్దం గడుస్తోంది… తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మాకో కల ఉంది.. అదే తెలంగాణ రైజింగ్. హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ…ఫ్యూచర్ సిటీ ని నిర్మించాలని నిర్ణయించుకున్నాం. న్యూయర్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుంది. భారతదేశంలోనే గొప్ప నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నాం.. ఇందులో సేవా రంగం మాత్రమే ఉంటుంది. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించాం. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా అమ్ముడవుతున్న రాష్ట్రం తెలంగాణ’’ అని తెలిపారు.
‘‘ప్రకృతి విపత్తులను ఎదుర్కొవడానికి హైదరాబాద్ సిద్ధమౌతోంది. వరదలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మూసీ పునరుజ్జీవనంతో 55 కిలో మీటర్ల వరకు మంచినీటితో ప్రవహించేలా చేయనున్నాం. 2050 సంవత్సరానికి అవసరమయ్యే తాగు నీటి అవసరాలకు కావాల్సిన కార్యచరణను ఇప్పటి నుంచే ప్రారంభించాం. రీజినల్ రింగ్ రోడ్ ప్రణాళికల దశలో ఉంది. 360 కి.మీ పొడవు రీజినల్ రింగ్ రోడ్ ను నిర్మిస్తున్నాం.. దాని చుట్టూ రీజినల్ రింగ్ రైల్వేను ప్లాన్ చేస్తున్నాము. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్లను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మించబోతున్నాం. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుంది’’ అని చెప్పారు.
అద్భుతాలు సృష్టిద్దాం
‘‘ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, EVలు, సోలార్ వంటి పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. స్కిల్స్, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాం. ప్రపంచంలో హైదరాబాద్ ను చైనా కు ప్లస్ సిటీ గా మార్చే వ్యూహంతో ముందుకు వెళ్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణలో వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగుల వంటి పైన దృష్టి పెడతాము. తెలంగాణకు తీరప్రాంతం లేదు. అందుకే ఇక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నాం. ఏపీలోని బందర్ ఓడరేవుతో అనుసంధానం చేస్తూ ప్రత్యేక రహదారితో పాటు రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలని, మార్కెట్లు స్వేచ్ఛగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మాతో కలిసి రండి. కలిసి అద్భుతాలు సృష్టిద్దాం. భారతదేశంలోనే కాదు… ప్రపంచంలోనే అత్యున్నత వ్యాపార సౌలభ్యాన్ని నేను మీకు అందిస్తాను’’ అని పిలుపునిచ్చారు.