Police Si Suicide|ప్రేమ వ్యవహారమే ఎస్ఐ ఆత్మహత్యకు కారణమా?
ములుగు జిల్లాలో వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది.ఎస్ఐ ప్రేమ వ్యవహారం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడైంది.
By : Shaik Saleem
Update: 2024-12-02 07:33 GMT
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల పరిధిలోని ముళ్లకట్ట బ్రడ్జి సమీపంలో ఉన్న ఫెరిదో రిసార్ట్ లో వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ సోమవారం ఉదయం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది.
- ఏటూరునాగారం ప్రాంత అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన మరునాడే వాజేడు ఎస్ఐ హరీశ్ ఆత్మహత్య చేసుకోవడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమైనా చివరకు ప్రేమ వ్యవహారం, వేరే పెళ్లి సంబంధం చూస్తున్నారనే కారణమని తేలింది.
- వారం రోజుల క్రితం వాజేడు పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు ఆదివాసీలను ఇన్ ఫార్మర్లు అనే పేరుతో మావోయిస్టులు హత్య చేశారు. ఈ ఘటనపై ఎస్ఐ హరీశ్ విచారణ జరిపారు. కానీ అతని ప్రేమ వ్యవహారం, పెద్దలు పెళ్లి సంబంధాలు చూడటం వల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
- ఆదివారం రాత్రి 9 గంటలకు యువతితో కలిసి రిసార్ట్స్ కు వచ్చిన ఎస్ఐ హరీశ్ ఆత్మహత్య చేసుకున్నపుడు యువతి అతని గదిలోనే ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఎస్ఐ కాల్పుకున్న తర్వాత యువతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. హరీశ్ ఆత్మహత్య చేసుకున్నాక అతని మృతదేహంపై పడి ఏడుస్తూ పోలీసులకు కనిపించింది. ఎస్ఐ యువతిని ప్రేమించగా, అతని ఇంట్లో వాళ్లు వేరే పెళ్లి సంబంధం చూస్తున్నారని , ఇదే అతని ఆత్మహత్యకు కారణమని చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన హరీశ్ ఆత్మహత్యతో అతని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. యువతిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.