భాగ్యనగరంలో లంబోదరుడి లడ్డూల వేలంలో రికార్డులెన్నో...

గణేష్ లడ్డూల వేలం ఈ ఏడాది కొత్త రికార్డులను సృష్టించింది.బండ్ల జాగీర్‌లోని రిచ్ మండ్ విల్లాస్ లడ్డూధర రూ.1.87 కోట్లు,,బాలాపూర్ లడ్డూ ధర 30,01లక్లలు పలికింది.

Update: 2024-09-17 05:37 GMT

వినాయకుడికి ఉండాళ్లు అంటే మహాప్రీతి. అందుకే లంబోదరుడికి రంగురంగుల బూందీ లడ్డూను మహా ప్రసాదంగా వినాయకుడి చేతిలో పెట్టి 10 రోజుల పాటు భక్తులు పూజలు చేసి, దాన్ని వేలం విక్రయిస్తున్నారు. హైదరాబాద్ నగరం గణేష్ లడ్డూల వేలంలో రికార్డులు నెలకొల్పింది.


అందరి దృష్టి బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపైనే...
గణేష్ లడ్డూ వేలం అంటేనే భక్తులకు బాలాపూర్ లడ్డూ వేలంపాట గుర్తుకు వస్తుంది.1980వ సంవత్సరం నుంచి బాలాపూర్ లో గణేషుడిని ప్రతిష్ఠిస్తున్నా, 1994లో లడ్డూ వేలాన్ని ప్రారంభించారు. గతంలో గణేష్ చేతిలో లడ్డూను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసేవారు. కాలక్రమంలో మొట్టమొదటి సారి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి బూందీ లడ్డూను తయారు చేయించి వినాయకుడి చేతిలో పెట్టింది. దాన్ని 1994వ సంవత్సరంలో మొదటిసారి వేలం వేయగా, అది 450 రూపాయల ధర పలికింది.ఒక వినాయక మండపం నుంచి మరో మండపానికి పాకిన లడ్డూల వేలం నగరంలోని అన్ని గణేశ్ మండపాలకు చేరింది. గణేష్ లడ్డూల వేలం ఏ యేటికాఏడు పెరుగుతూనే ఉంది. అలా 30 ఏళ్ల పాటు బాలాపూర్ లడ్డూ వేలం పాటలో దక్కించుకున్న ధర రూ.27 లక్షలకు చేరింది.



30 ఏళ్ల చరిత్ర ఉన్న బాలాపూర్ లడ్డూ వేలంలో ఎంతకు కొన్నారంటే ...

ఈ సారి 30 ఏళ్ల చరిత్ర ఉన్న బాలాపూర్ గణేష్ లడ్డూ ధర 30 లక్షల ఒక వేయి రూపాయల ధర పలికింది.బాలాపూర్ లడ్డూ భక్తుల పేరిట కొంగు బంగారంగా మారింది. బాలాపూర్ గణేశుడి చేతిలో వెండి పళ్లెంలో ఈ లడ్డూ పెట్టారు. ఈ లడ్డూ వేలాన్ని వెయ్యి నూటపదహారు రూపాయల నుంచి ప్రారంభించారు. ఈ లడ్డూను సింగిల్ విండో ఛైర్మన్ కొలన్ శంకర్ రెడ్డి ముఫ్లై లక్షల ఒక వేయి రూపాయలకు దక్కించుకోవడంతో లడ్డూను ఆయనకు అందజేశారు. లడ్డూ దక్కించుకున్న శంకర్ రెడ్డిని అందరూ అభినందించారు.వెంటనే వేలంలో పాడిన డబ్బును ప్రజలందరి సమక్షంలో ఉత్సవ కమిటీకి అందజేశారు.

లడ్డూ వేలం కార్యక్రమంలో పాల్లొన్న నేతలు
బాలాపూర్ లడ్డూ వేలం కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి,అనితా రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బాలాపూర్ లడ్డూ వేలం అనంతరం ఆర్యవైశ్య సంఘం అన్నదానం చేసింది.గత ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూను వేలంలో కొన్న దాసరి దయానందరెడ్డిని గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు బంగారు గొలుసునిచ్చి సన్మానించారు. తాను గణేషుడి లడ్డూను దక్కించుకొని ఎమ్మెల్యేను అయ్యానని మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి చెప్పారు. బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ గణే ష్ ఉత్సవాల సందర్బంగా రోడ్లను విస్తరించామన్నారు.

బొడ్రాయి వద్ద బాలాపూర్ లడ్డూ వేలం
బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ శోభాయాత్ర బాలాపూర్ లోని బొడ్రాయి వద్దకు చేరుకోగానే లంబోదరుడి చేతిలో ఉన్న లడ్డూను వేలం వేశారు. లడ్డూ వేలం కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుఅయ్యారు. దీంతో బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కోలాహలంగా సాగింది.

లడ్డూ వేలం డబ్బుతో గ్రామాభివృద్ధి
బాలాపూర్ లడ్డూ వేలంతో ఉత్సవ కమిటీ ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ డబ్బుతో పలు గ్రామాభివృద్ధి పనులే కాకుండ సంక్షేమ కార్యక్రమాలు చేశారు.లడ్డూ వేలం డబ్బుతో ఒక పాఠశాలను నిర్మించారు. దీంతోపాటు ఈ డబ్బుతో పలు దేవాలయాలను అభివృద్ధి చేశారు. గణేష్ విగ్రహం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా 130 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు.

కొత్త నిబంధన...ముందుగా డబ్బు డిపాజిట్
బాలాపూర్ లడ్డూ వేలంపాటలో ఈ సారి కొత్త నిబంధనలు పెట్టారు. లడ్డూ వేలం పాటలో పాల్గొనే భక్తులు ముందుగా డబ్బు డిపాజిట్ చేయాలనే నిబంధన విధించారు. గత సంవత్సరం ఈ లడ్డూ రూ.27లక్షలక్షల ధర పలికింది.దీంతో వేలంపాటలో పాల్గొనే వారు రూ.27 లక్షలు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనాలని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నిర్ణయించింది.

బాలాపూర్ లడ్డూ ప్రసాదం తీసుకున్నాక నాకు కలిసి వచ్చింది : దాసరి దయానందరెడ్డి
బాలాపూర్ లడ్డూ ప్రసాదం తీసుకున్నాక తాను ఆర్థికంగా ఎదిగానని, మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యంగా ఉన్నానని దయానందరెడ్డి చెప్పారు. వ్యాపారాభివృద్ధి జరుగుతుందని, రాజకీయంగా కూడా ఎదగవచ్చని సుదూర ప్రాంతాల నుంచి కూడా బడా వ్యాపారులు వచ్చి లడ్డూవేలంలో పాల్గొంటున్నారు.తాను గతంలో రెండు సార్లు లడ్డూ వేలంలో పాల్గొన్నా దక్కలేదని, గత ఏడాది రూ.27 లక్షలకు దక్కిందని దయానందరెడ్డి చెప్పారు. గత ఏడాది తాను దక్కించుకున్న లడ్డూ ప్రసాదాన్ని పేదలకు పంచానని ఆయన పేర్కొన్నారు. కోరిన కోర్కెలు తీర్చే బాలాపూర్ గణేషుడిని భక్తులు దర్శించుకోవాలని కోరారు.

౩౦ ఏళ్లుగా...
30 ఏళ్లుగా లడ్డూ దక్కించుకున్న వారు ఆర్థికంగా,రాజకీయంగా ఎదగవచ్చని అందుకే తాను వనస్థలిపురం నుంచి వచ్చి లడ్డూ వేలంలో పాల్గొన్నానని వేలంలో పాల్గొన్న వారు చెప్పారు. బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొనడం తమకు ఆనందంగా ఉందని పలువురు పోటీదారులు పేర్కొన్నారు. 30 ఏళ్ల చరిత్ర ఉన్న వినాయకుడి లడ్డూ ఈ సారి రూ.లక్షలకు పోతుందని 23మంది వేలంపాటలో పాల్గొన్నారు.

పొలంలో గణేష్ ప్రసాదం చల్లితే బంగారం పండింది.
పొలంలో గణేష్ మహాప్రసాదం చల్లితే వినాయకుడి మహిమ వల్ల బంగారం పండిందని గతంలో లడ్డూ దక్కించుకున్న రైతులు చెప్పారు. వ్యవసాయ బావిలో ప్రసాదం చల్లడం వల్ల ఊటనీటి శాతం పెరిగిందని రైతులు చెబుతున్నారు. లడ్డూ ప్రసాదం కలిసి వస్తుండటంతో దీన్ని దక్కించుకునేందుకు బాలాపూర్ గ్రామ వాసులే కాకుండా పలు ప్రాంతాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు తరలివచ్చి లడ్డూ వేలంలో పాల్గొంటున్నారు.

భాగ్యనగరంలో బొజ్జగణపయ్య లడ్డూ క్రేజ్
భాగ్యనగరంలోని బాలాపూర్ బొజ్జగణపయ్య లడ్డూ వేలం క్రేజ్ గా మారింది. 30 ఏళ్లుగా ఏటేటా పెరుగుతూ 27లక్షల రూపాయలకు చేరింది. ఈ లడ్డూ వేలంపై తెలంగాణ వ్యాప్తంగా భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

లడ్డూ వేలంలో రికార్డు ధర
గణేష్ లడ్డూ వేలంలో ఈ ఏడాది రికార్డు ధరలు పలుకుతున్నాయి.బండ్లగూడ జాగీర్ లో రిచ్ మండ్ విల్లాస్ కు చెందిన 25 మంది సిండికేట్ వినాయకుడి లడ్డూను రూ.1.87 కోట్లకు దక్కించుకుంది.గతంలో ఈ లడ్డూను రూ.1.26 కోట్లకు విల్లాలోని అందరూ కలిసి కొన్నారు.ఈ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బును పేద ప్రజల సంక్షేమం, పేద విద్యార్థులకు సహాయం చేసేందుకు వెచ్చిస్తామని విల్లావాసులు చెప్పారు. హైదరాబాద్ నగరంలోని మైహోం భుజాలో ఏర్పాటు చేసిన గణేశుడి లడ్డూ వేలంలో రూ.29 లక్షల ధర పలికింది. మైహొం భుజా లడ్డూను ఇల్లెందుకు చెందిన కొండపల్లి గణేష్ దక్కించుకొని రికార్డు సృష్టించారు.

లడ్డూవేలంలో రికార్డులు ఎన్నో...
భాగ్యనగరంలో గణేష్ విగ్రహాల లడ్డూ వేలంలో ఎన్నెన్నో రికార్డులు నమోదయ్యాయి. ఈ ఏడాది నగర వ్యాప్తంగా కొలువుతీరిన గణనాథుల వద్ద ఉన్న లడ్డూలను వేలం వేయగా రికార్డు ధర పలికింది. గత ఏడాది కంటే ఈ ఏడాది గణేష్ లడ్డూల వేలం పాట పెరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.



 


ఆసిఫాబాద్ లో గణేష్ లడ్డూ కొన్న ముస్లిం

ఆసిఫాబాద్ పట్టణంలోని భట్ పల్లిలో గణేష్ లడ్డూ ను వేలంలో కొన్న ముస్లిం భక్తుడు అఫ్జల్ మతసామరస్యాన్ని చాటుకున్నారు. భట్ పల్లిలో గణేష్ లడ్డూను వేలం వేయగా 13,213 రూపాయలకు దీన్ని దక్కించుకున్నారు. గణేష్ లడ్డూ దక్కించుకున్న అఫ్ఝల్ దంపతులను భక్తులు అభినందించారు.

తాపేశ్వరం లడ్డూ రికార్డు
తాపేశ్వరం సురుచి ఫుడ్స్ వారు వినాయకుడి భారీ లడ్డూలను తయారు చేసి అందిస్తూ రికార్డు నెలకొల్పింది. 2010వ సంవత్సరంలో 600కిలోల లడ్డూతో ప్రారంభించి 2015లో 6వేల కిలోల లడ్డూను తయారు చేసి లంబోదరుడి చేతిలో క్రేన్ సాయంతో పెట్టారు. భారీ లడ్డూల తయారీలో ఆల్ టైం రికార్డు తెలంగాణాదేనని చెప్పవచ్చు.



Tags:    

Similar News