బీఆర్ఎస్ కి మద్దతుగా కిషన్ రెడ్డికి రాములమ్మ కౌంటర్

తెలంగాణ రాములమ్మ, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి బీఆర్ఎస్ కి మద్దతుగా నిలిచారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు.

By :  Vanaja
Update: 2024-05-17 07:30 GMT

తెలంగాణ రాములమ్మ, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి బీఆర్ఎస్ కి మద్దతుగా నిలిచారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక పోస్టు పెట్టారు.

"తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం... ఎప్పటికీ.. ఇది అర్ధం చేసుకోకుండా వ్యవహరించే వారికి... దక్షిణాదిన దశాబ్ధాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుండి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ వరకు ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన తప్పని అవసరం... ఎన్నడైనా.. వాస్తవం... ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశం బహుశా కిషన్ రెడ్డి ప్రకటన భావం" అంటూ చురకలంటించారు.

ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొనలేదు. అడపాదడపా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి తాజా వ్యాఖలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

దీంతో అసలు మీరు ఏ పార్టీలో ఉంది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటూ నెట్టింట ప్రశ్నల వర్షం మొదలైంది. పార్టీ మారబోతున్నారా అంటూ నెటిజన్లు ఆమెని ప్రశ్నిస్తున్నారు. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇవ్వండి అని కామెంట్స్ చేస్తున్నారు.

బీజేపీతోనే రాములమ్మ పొలిటికల్ ఎంట్రీ...

కాగా, విజయశాంతి 1998 లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2005 లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. 2009 లో ఆ పార్టీని అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో విలీనం చేసి, ఆమె కూడా అదే పార్టీలో చేరారు. 2009 లో మెదక్ పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. విజయశాంతి పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటుందని కేసీఆర్ 2013 లో సస్పెండ్ చేశారు.

అనంతరం ఆమె 2014 లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఓటమితో సైలెంట్ అయిన విజయశాంతి 2018 ఎన్నికల నాటికి యాక్టివ్ అయ్యారు. స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళీ ఓటమి పాలైంది. రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని 2020 డిసెంబర్ 7న బీజేపీలో చేరారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక 2023 నవంబర్ 15 న బీజేపీకి రాజీనామా చేసి 17 న హైదరాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆమెను నవంబర్ 18 న పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ గా, కన్వీనర్ గా నియమించారు.

Tags:    

Similar News