బతుకమ్మ చీరల దుమారం.. కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే హితవు..

దసరా పండుగకు ఇచ్చే బతుకమ్మ చీరలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేస్తోందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘాటు రిప్లై ఇచ్చారు.

Update: 2024-09-27 08:18 GMT

దసరా పండుగకు ఇచ్చే బతుకమ్మ చీరలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేస్తోందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘాటు రిప్లై ఇచ్చారు. కేటీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయంటూ చురకలంటించారు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు అందించి నేతన్నలను ఆదుకున్నామని చెప్తున్న కేటీఆర్.. ఒక్కసారి నిజాలు సరిచూసుకోవాలని సూచించారు. బతుకమ్మ చీరలపై బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.197 కోట్ల బకాయిలు పెట్టి.. అధికారం నుంచి దిగిందని, ఆ బకాయిలను నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. అదే విధంగా వారు ఇచ్చిన బతుకమ్మ చీరల నాణ్యత గురించి తాము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆనాడే మహిళలు రోడ్డుపైకి వచ్చే చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ పాలన తట్టుకోలేక.. అసెంబ్లీ సహా ఎంపీ ఎన్నికల్లో కూడా ఓటమి కిరీటంతో ప్రజలను బీఆర్ఎస్‌ను సత్కరించారంటూ చురకలంటించారు. ఇప్పటికైనా కేటీఆర్ నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. నేతన్నలపై గతంలో లేని ప్రేమ కేటీఆర్‌కు ఇప్పుడు పుట్టుకొచ్చిందని, వారి విషయంలో ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ మండిపడ్డారు.

కేటీఆర్ వ్యాఖ్యలకు కారణం ఇదే..

‘‘ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చి నాసిరకం బతుకమ్మ చీరలకు సంబంధించి క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. కేటీఆర్ ఇప్పుడు నేతన్నలపై కపట కన్నీరు కారుస్తున్నారు. సీఎం దమ్మున్నోడు కాబట్టే బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి.. ప్రజారంజక పాలన చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల అహంకార చర్యలకు, పొగరు మాటలను ప్రజలు ఛీ కొడుతున్నా వారి చర్యల్లో మార్పు రావట్లేదు. రేవంత్ రెడ్డి అందిస్తున్న పాలనను చూసి తట్టుకోలేక ఆ కడుపుమంటతోనే ప్రతి రోజూ ఏదోక అంశంపై లేనిపోనివి కావించుకుని మరీ కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అంటే.. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చినందుకు మాకు కోపం. ఇప్పటికైనా కేటీఆర్.. కాంగ్రెస్ నేతలను నిందించడం మానుకోవాలి’’ అని సూచించారు.

ఇంతకీ కేటీఆర్ ఏమన్నారంటే..

‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మయాంలో నేతన్నల ఆత్మహత్యలు జరిగేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నేతన్నలను కాపాడుకోగలిగాం. ఇప్పుడు అధికారం మారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి సర్కార్ నేతన్నలను పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల నేతన్నలకు రూ.3,312 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చాం. అంతేకాకుండా వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేశాం. వారికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో దసరాకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశాం. కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్.. నేతన్నలను పూర్తి నిర్లక్ష్యం చేస్తోంది. బతుకమ్మ చీరల ఆర్డర్లను కూడా నిలిపివేసింది. కాంగ్రెస్ అధికారం చేపట్టాక బతుకమ్మ చీరల విషయంలో భారీ కుంభకోణం జరిగిందని, దానిపై విచారణ చేపట్టానలి బీఆర్ఎస్ పోరాటం ప్రారంభించింది. నేతన్నలు కూడా ఇందులో భాగం కానున్నారు’’ అని కేటీఆర్ తెలిపారు. కాగా అసలు నేతన్నలను మోసం చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని, వారికి భారీ మొత్తంలో బకాయిలు ఉంచేసి.. వారి కడుపుపై కొట్టిందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News