రుణమాఫీపై నిజం ఒప్పేసుకున్న మంత్రి ఉత్తమ్

రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరగలేదని పెద్ద ఎత్తున ఆందోళనలు నెలకొన్నాయి.

By :  Vanaja
Update: 2024-08-19 14:10 GMT

రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరగలేదని పెద్ద ఎత్తున ఆందోళనలు నెలకొన్నాయి. ఓవైపు దేశంలో ఎవరూ చేయలేని విధంగా మేము రుణమాఫీ చేశామని కాంగ్రెస్ బాకా మోగిస్తోంది. సగం మందికి మాత్రమే రుణమాఫీ చేసి, రైతుల్ని ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ వాయించేస్తోంది. రెండు రోజుల్లో ప్రభుత్వంపై పోరాటానికి దిగుతామని అల్టిమేటం కూడా జారీ చేసింది. ఈ క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రుణమాఫీ పూర్తిగా జరగలేదని ఒప్పేసుకున్నారు.

సోమవారం ఆయన ఎర్రంమంజిల్ లోని జలసౌధలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన రుణమాఫీ దేశంలో ముందెన్నడూ జరగలేదని చెప్పుకొచ్చారు. 2014 తర్వాత బీజేపీ ఎప్పుడూ రుణమాఫీ గురించి పట్టించుకోలేదన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆ పార్టీ రైతుల కోసం ఎలాంటి మంచి పనులు చేయలేదని దుయ్యబట్టారు. రైతులను రుణ విముక్తుల్ని చేయాలని తాము సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామని... అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ జరగలేదని తెలిపారు.

"అవును నిజమే మేము రుణమాఫీ పూర్తిగా చేయలేదు.. ఇంకా 17.14 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల పూర్తి రుణమాఫీ జరగలేదు.1.20 లక్షల మందికి ఆధార్ నంబర్ 12 ఉండాలి.. కానీ కొందరికి 11 మరికొందరికి 13 నంబర్లు ఉన్నాయి అందుకే పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయాము. 1.61 లక్షల మందికి ఆధార్ కార్డు, లోన్ అకౌంట్లో పేరు వేరువేరుగా ఉన్నాయి. 1.50 లక్షల అకౌంట్లలలో బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని తప్పులు ఉన్నాయి. 4.83 వేల మందికి రేషన్ కార్డులు లేవు. 8 లక్షల మందికి 2 లక్షల రుణం పైగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మండల వ్యవసాయ అధికారులు సమస్యలను పరిష్కరిస్తారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికి ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది" అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 

Tags:    

Similar News