Tollywood | లైంగిక వేధింపులపై వెలుగుచూడని సబ్ కమిటీ నివేదిక

టాలీవుడ్‌లో మహిళలపై సాగుతున్న లైంగిక వేధింపులపై సబ్ కమిటీ నివేదికను విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకురాలు లుబ్నా సార్వత్ రాష్ట్ర మంత్రి సీతక్కకు విన్నవించారు.;

Update: 2025-02-05 08:48 GMT

తెలుగు సినిమా పరిశ్రమ అయిన టాలీవుడ్ లో లింగ వివక్ష, లైంగిక వేధింపుల అధ్యయనానికి వేసిన సబ్ కమిటీ నివేదికను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ లుబ్నా సార్వత్ బుధవారం డిమాండ్ చేశారు. మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా గాంధీ భవన్‌ కు వచ్చిన రాష్ట్ర మంత్రి సీతక్కకు లుబ్నా సార్వత్ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ వినతికి స్పందించిన మంత్రి సీతక్క సబ్ కమిటీ నివేదికను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో నివేదిక విడుదల చేయిస్తామని హామి ఇచ్చారు.


సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులపై సబ్ కమిటీ
తెలుగు సినిమా పరిశ్రమ అయిన టాలీవుడ్ లో లింగ వివక్ష, మహిళా నటీమణులు, జూనియర్ ఆర్టిస్టులపై లైంగిక వేధింపులపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీని 2019 ఏప్రిల్ నెలలో జీఓఆర్టీ నంబరు 948 ఉత్తర్వు జారీతో నియమించారు. టాలీవుడ్ లో 2019వ సంవత్సరంలో మీటూ ఉద్యమం తర్వాత తెలంగాణ పోలీసు అధికారులు, వివిధ విభాగాల అధికారులు, చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమ ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటీని రాస్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

చీఫ్ సెక్రటరీ వద్ద సబ్ కమిటీ నివేదిక
ఈ కమిటీ 2019 నుంచి 2022 వ సంవత్సరం వరకు 20 సార్లు సమావేశమై లైంగిక వేధింపులపై పలువురిని కలిసి వారి విన్నపాలను స్వీకరించింది. రాష్ట్రప్రభుత్వం నియమించిన హై లెవెల్ సబ్ కమిటీ టాలీవుడ్ లో ని లైంగిక వేధింపులపై అధ్యయనం చేసి, ఆయా సమస్యలను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సబ్ కమిటీ సిఫార్సులు చేయనుంది. కొవిడ్ వ్యాధి తగ్గాక 2022 వ సంవత్సరం జూన్ నెలలో సబ్ కమిటీ నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించింది.

రెండేళ్లు దాటినా వెలుగుచూడని నివేదిక
సినిమా పరిశ్రమలో మహిళలపై సాగుతున్న లైంగిక వేధింపులపై సబ్ కమిటీ నివేదిక ఇచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటివరకు ఈ నివేదికను బహిర్గతం చేయలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నివేదికను తొక్కిపట్టి ఉంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబరు నుంచి ఈ నివేదికను వెల్లడించాలని కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికైనా ఈ సబ్ కమిటీ నివేదికను బహిర్గతం చేసి లైంగిక వేధింపుల నివారణకు చర్యలు తీసుకోవాలని డాక్టర్ లుబ్నా సార్వత్ కోరారు.

సీతక్క జోక్యం చేసుకోవాలి
తెలంగాణ పరిపాలనా రంగంలో మహిళా మంత్రిగా ఉన్న సీతక్క జోక్యం చేసుకొని సినిమా పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు చర్యలు తీసుకోవాలని డాక్టర్ లుబ్నా సార్వత్ కోరారు. టాలీవుడ్ లో మహిళలపై సాగుతున్న లైంగిక వేధింపులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతస్థాయి సబ్ కమిటీ సమీక్షించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

వేధింపులను నివారించేందుకు చర్యలు తీసుకోండి
కేరళ రాష్ట్రంలోని సినీ పరిశ్రమలో సాగిన లైంగిక వేధింపులపై హేమా కమిటీ నివేదికను విడుదల చేసి పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చిందని డాక్టర్ లుబ్నా గుర్తు చేశారు. తెలంగాణ సబ్ కమిీ నివేదికను విడుదల చేయకుండా దాచి పెట్టారని ఆమె ఆరోపించారు. చలనచిత్ర పరిశ్రమ, టెలివిజన్ రంగాల్లో మహిళలపై సాగుతున్న లైంగిక వేధింపులను నివారించేందుకు వీలుగా చర్యలు తీసుకునేందుకు ఈ నివేదికను బహిర్గతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.


Tags:    

Similar News