ఏసీబీ పట్టుకుంటుంది… వ్యవస్థ విడిచిపెడుతోంది!

ఏసీబీ ట్రాప్ కేసులు పెరిగినా, చర్యలు తగ్గుతున్నాయి

Update: 2025-11-24 23:40 GMT
ఏసీబీ వలలో చిక్కిన అధికారులు

తెలంగాణలోని (Telangana)ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక చిన్న పని కోసం వెళ్లినా లంచం (Corruption) లేక పని కాని పరిస్థితి నెలకొంది. ఏసీబీ (ACB)వందలాది మంది అవినీతి అధికారులను పట్టుకున్నా, వారికి శిక్ష పడక పోవడంతో అవినీతి మరింత పెరుగుతోంది. ప్రజల జీవితం కష్టమవుతున్నా,అక్రమార్కుల ప్రాసిక్యూషన్ ఫైళ్లపై (ACB prosecution files) ప్రభుత్వ మౌనం మాత్రం అలాగే కొనసాగుతోంది.


అయిదేళ్లలో 621 ఏసీబీ కేసులు
2020వ సంవత్సరం జనవరి నుంచి ఈ ఏడాది జులై వరకు గడచిన అయిదేళ్లలో 621 మంది అధికారుల అవినీతిపై ఏసీబీ కేసులు పెట్టింది. ఇందులో 495 మంది ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ ట్రాప్ లో చిక్కారు. మరో 54 మంది అవినీతి అధికారుల ఆస్తులు సంపాదనకు మించి ఉన్నాయని ఏసీబీ అధికారుల దాడుల్లో తేలింది. దీంతో అక్రమ సొత్తును స్వాధీనం చేసుకొని వారిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.తెలంగాణలో 2020 జనవరి 1వ తేదీ నుంచి ఈ ఏడాది జులై నెల వరకు ఏసీబీ ట్రాప్ కేసులు, సంపాదనకు మించిన ఆస్తుల కేసుల వివరాలను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ పబ్లిక్ ఇన్ ఫర్ మేషన్ ఆఫీసర్ పి రాఘవరావు లేఖ నంబరు 63 ఆర్టీఐ టీజీ 2025 ద్వారా తెలిపారు.

ప్రతిపాదనల్లోనే పెండింగ్
గ‌త ఐదు సంవ‌త్స‌రాల్లో 621 అధికారుల‌పై ఏసీబీ కేసులు న‌మోదు చేసింది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నాఅక్రమార్కులపై చ‌ర్య‌లు తీసుకోవడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ఏసీబీ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్ర‌కారం 621 కేసుల్లో 519 కేసుల‌పై ఏసీబీ సమగ్ర విచార‌ణ పూర్తి చేసి ప్ర‌భుత్వానికి ప్రాసిక్యూష‌న్ అనుమ‌తి కోరుతూ ప్రతిపాదనలు పంపించారు.తాము రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ నివేదికలు పంపించినా సర్కారు నుంచి అనుమతి రాలేదని తెలంగాణ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఎస్ వీ ఎన్ శివరాం చెప్పారు.

కోర్టు విచారణల్లో తీవ్ర జాప్యం
ఏసీబీ అవినీతి అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా, వారి వద్ద సాక్ష్యాధారాలు ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వ అనుమ‌తి లేనిదే ఏసీబీ అక్రమార్కులపై కోర్టులో చార్జ్‌షీటు దాఖ‌లు చేయ‌లేరు. ఇక కోర్టులో కేసు విచారణ కొలిక్కి వ‌చ్చే స‌రికి మూడు నుంచి ఐదు సంవ‌త్స‌రాలు ప‌ట్ట‌వ‌చ్చు. అంటే ఒక అవినీతి అధికారిపై కేసు న‌మోదైనా తుది తీర్పు కోసం 10 సంవ‌త్స‌రాల సమయం ప‌డుతుంది. ఇంకా కొన్ని సంద‌ర్భాల్లో ఏసీబీ కేసుల్లో తీర్పు రావాలంటే 15 సంవ‌త్స‌రాల వ‌ర‌కు స‌మ‌యం ప‌డుతుంది. అంత‌లో స‌ద‌రు అధికారి రిటైర్ అయ్యే ప‌రిస్థితి నెలకొంది.

ఏసీబీ దాడులపై ప్రచారమే కానీ చర్యలేవి?
తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ పెద్ద ఎత్తున అవినీతి అధికారుల‌ను ప‌ట్టుకొని కేసులు న‌మోదు చేస్తుంది. స‌గ‌టున రోజుకు ఒక‌టి చొప్పున కొన్ని సంద‌ర్భాల్లో ఒక్కో రోజు ఇద్ద‌రు లేక ముగ్గురు అధికారుల‌ను లంచం తీసుకుంటున్న‌ప్పుడు ప‌ట్టుకుంటున్నారు. ప్ర‌జ‌లు ఏసీబీ దాడులను చూసి హ‌ర్షిస్తూ పాల‌న‌లో అవినీతి త‌గ్గుతుంద‌ని ఆశిస్తున్నారు.

అవినీతికి తెరపడేదెన్నడు?
ఏసీబీ దాడులు చేసి అక్రమార్కులపై కేసులు పెడుతున్నా వారిపై చర్యలు తీసుకోవడం తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో రోజు రోజుకు ప్ర‌భుత్వ ఉద్యోగుల్లో అవినీతి పెరిగిపోతుంది. ఏ కార్యాల‌యానికి వెళ్ళినా డబ్బులు ఇవ్వనిదే ప‌ని కావ‌డం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అవినీతి పరులు కేసులు పెట్టినా సచివాలయంలో పైరవీలు చేసి వారిపై చర్యలు తీసుకోకుండా తప్పించుకుంటున్నారు. ఏసీబీ రిపోర్టులు సచివాలయంలో చెత్తబుట్ట దాఖలా అవుతున్నాయి. స‌చివాల‌యంలో ఉన్న‌తాధికారులు అ.ని.శా. రిపోర్టుల‌పై పెద్ద‌గా శ్ర‌ద్ధ పెట్ట‌క‌పోవ‌డంతో సెక్ష‌న్ ఆఫీస‌ర్లు అవినీతి అధికారుల కొమ్ము కాస్తున్నారని పద్మనాభరెడ్డి ఆరోపించారు.

సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
రాష్ట్ర పాల‌న‌లో పెద్ద ఎత్తున అవినీతి జ‌రుగుతున్నందున సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, ప్ర‌భుత్వం కూడ‌ అప‌వాదు పాల‌వుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి సోమవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. అవినీతి అధికారుల‌పై న‌మోదైన కేసులు స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించి స‌ద‌రు అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ ముఖ్య‌మంత్రిని కోరింది.

తెలంగాణలో ఏసీబీ కేసుల పట్టిక
సంవత్సరం కేసుల సంఖ్య
2020 - 84
2021 - 83
2022 - 107
2023 - 87
2024 - 152
2025 - 108
అక్రమ సంపాదన, రెడ్‌హ్యాండెడ్ ట్రాప్‌లు, ఏసీబీ విచారణలు సాగుతున్నాయి.కానీ అక్రమార్కులకు శిక్షలు లేకపోవడం వల్ల ఈ వ్యవస్థ పక్కదారి పడుతుంది. తెలంగాణలో 621 కేసులు నమోదు చేసినా, అక్రమార్కులపై చర్యలు తీసుకునేది ఎప్పడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


Tags:    

Similar News