రైతు భరోసా నగదు జమ.. ఒక్కరోజులో ఎంతమందికంటే..

జనవరి 27 నుంచి ఇప్పటి వరకు మొత్తం 21,45,330 మంది రైతుల ఖాతాల్లో రూ.1,126.54 కోట్లు రైతు భరోసా నగదు జమ.;

Update: 2025-02-06 11:09 GMT

తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా ఎట్టకేలకు అమల్లోకి వచ్చింది. జనవరి 27 నుంచి ఈ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభమైనప్పటికీ అధిక సంఖ్యలో రైతులు ఈ ఫలాలను అందుకోలేదు. కాగా బుధవారం మాత్రం భారీ సంఖ్యలో రైతులకు ఈ రైతు భరోసా నగదును అందించింది సర్కార్. ఈ విషయాన్ని వ్యవశాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. బుధవారం ఒక్కరోజే 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు ఆయన తెలిపారు. మొదటి విడత నగదు జనవరి 27న విడుదల చేశామని, ఇప్పుడు రెండో విడత నగదును విడుదల చేశామని ఆయన ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెండో విడత నగదును విడుదల చేయడం జరిగిందని, తొలి విడతలో కేవలం నాలుగు లక్షల మంది రైతులు రైతుభరోసా ఫలాలు అందుకోగా రెండో విడతలో అందుకు నాలుగు రెట్లు అధికంగా 17.03 లక్షల మంది రైతులు ఈ పథకాన్ని అందుకున్నారని వివరించారు.

నల్గొండే టాప్..

రైతు భరోసా ఫలాలు అందుకున్న రైతుల్లో అత్యధికమంది నల్గొండ జిల్లా వాసులే. నల్గొండ జిల్లాలో 1.55 లక్షల మంది రైతులు రైతు భరోసా నగదు అందుకున్నారు. సిద్దిపేటలో 1.20 లక్షల మంది, మెదక్‌లో 1.15 లక్షల మంది, సంగారెడ్డిలో 1.15 లక్షల మందికి, కామారెడ్డిలో 1.09 లక్షల మందికి, ఖమ్మంలో 1.04 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. పలు విడతల్లో రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా నగదును జమచేస్తామని చెప్పారు తుమ్మల.

21 లక్షల మందికి అందిన నగదు

జనవరి 26న రైతు భరోసా సహా నాలుగు సంక్షేమ పథకాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఆరోజు రాత్రి 12 గంటలు దాటిన వెంటనే అందరి ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జనవరి 27 నుంచి ఇప్పటి వరకు మొత్తం 21,45,330 మంది రైతుల ఖాతాల్లో రూ.1,126.54 కోట్లు జమ చేసినట్లు తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా నిధులను నిర్ణీత కాలవ్యవధిలో అందరికీ చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, మిగిలిన నిధులను కూడా అతి త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే తమ ప్రభుత్వం రైతు రుణమాఫీ కోసం రూ.20,616.89 కోట్లుర, రైతు భరోసాకు రూ.7,625 కోట్లు, రైతు బీమాకు రూ.3వేల కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు మంత్రి.

ఇంకెంత కాలం.. మండిపడుతున్న రైతులు

రైతు భరోసా అందిన రైతులు ఫుల్ ఖుష్ అవుతుంటే.. అందని రైతులు మాత్రం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రూ.15 వేలు ఇస్తామని నమ్మించి అధికారం రాగానే దాన్ని రూ.12 వేలకు కుధించారని, మొన్నటికి మొన్న జనవరి 26 రాత్రి 12 దాటగానే డబ్బులు జమ అవుతాయని చెప్పి.. ఇప్పుడేమో విడతల వారీగా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులందరికీ రైతు భరోసా కూడా ఇవ్వలేకుంటే ఎలా అని నిలదీస్తున్నారు. పోనీ రైతు భరోసా అందించడానికి డెడ్‌లైన్ అయినా పెట్టాలని, ప్రభుత్వం తమను ఎప్పుడు కనికరిస్తుందో తెలియక నానా అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా ప్రతి రైతులకు పథకాలను అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News