తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై టీటీడీ కీలక నిర్ణయం
తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఆది, సోమవారం మాత్రమే లేఖలు స్వీకరిస్తారు.;
తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ భక్తులకు దర్శన అంశం కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇస్తున్నే సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించడం లేదని, తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే తెలంగాణ నాయకులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారు. కాగా ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని, తెలంగాణ ప్రజాప్రతినిధులు అందించే సిఫార్సు లేఖలపై దృష్టి సారించింది. కానీ ఇప్పటి వరకు ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంపై తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలంగాణ భక్తులను టీటీడీ చులకన చేయడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సు లేఖలను టీటీడీ ఆమోదించాలని తెలంగాణ నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం కల్పించడానికి అనుమతించింది. రాష్ట్ర సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఆది, సోమవారం మాత్రమే లేఖలు స్వీకరిస్తారు. అంటే సోమవారం, మంగళవారం దర్శనాలకు అనుమతి ఉంటుంది. బుధవారం, గురువారం రూ.300 ప్రత్యేక ప్రవేశ ధర్శనాలకు(ఏరోజువి ఆరోజే) లేఖలను అనుమతిస్తామని వెల్లడించింది టీటీడీ. ఈ విధానం మార్చి 24 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.
ఇంతకాలం సోమవారం వీఐపీ దర్శనానికి ఆదివారం రోజున ఆంధ్ర నేతల సిఫార్సు లేఖలను స్వీకరిస్తున్నారు. ఇకపై శనివారం(ఆదివారం దర్శనం కోసం) స్వీకరించనున్నట్లు టీటీడీ పేర్కొంది. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలు, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో పెట్టుకొ, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.