కొండా సురేఖను వెనకేసుకొచ్చిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్..

సమంతపై సంచలన వ్యాఖ్యల ఎపిసోడ్‌లో మంత్రి కొండా సురేఖను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెనకేసుకొచ్చారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటూ విజ్ఞప్తి చేశారు.

Update: 2024-10-03 07:05 GMT

సమంతపై సంచలన వ్యాఖ్యల ఎపిసోడ్‌లో మంత్రి కొండా సురేఖను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెనకేసుకొచ్చారు. సమంతపై ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ మీ రాజకీయాల కోసం ఇతరు వ్యక్తిగత జీవితాలను బజారుపాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదంటూ సినీ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడమే ఇందుకు కారణం. ఈ ట్వీట్ల పర్వానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మహేష్ కుమార్ కోరారు. మంత్రి తన వ్యాఖ్యలను బేషరుతుగా ఉపసంహరించుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్)లో ఓ వీడియోను షేర్ చేసుకున్నారు. కొండా సురేఖ వివాదాన్ని ముగించాలంటూ ఈ వీడియోలో ఆయన సినీ పరిశ్రమ పెద్దలను కోరారు. అనుకోకుండా కొండా సురేఖా అటువంటి వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరిస్తున్నారని, తన వ్యాఖ్యలకు సమంతకు క్షమాపణలు కూడా చెప్పారని ఆయన తన వీడియోలో వివరించారు. కానీ ఆయన వీడియోపై కూడా నెటిజన్లు, సమంత అభిమానులు మాత్రం మండిపడుతున్నారు. అలా ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార మదం తలకెక్కే వీళ్లు ఇలా మాట్లాడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సినిమా పెద్దలకు ఇదే నా విన్నపం: మహేష్

‘‘సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదాన్ని ఇక ముగించండి. సినిమా పెద్దలందరికి నా విన్నపం.. సినీ ప్రముఖుల మనసు నొచ్చుకున్నది. మంత్రి తన వ్యాఖ్యలని వెనుకకు తీసుకున్నారు. ఈ అంశం ఇక్కడితో ముగింపు పలకండి. ఇరు వైపులా మహిళలు ఉన్నారు.. కావునా ఈ విషయాన్ని ఇంతటితో వదలండి. మహిళల మనోభావాలను కించపరచాలనేది ఆమె ఉద్దేశం కాదు. కొండా సురేఖ తన ఎక్స్(ట్విట్టర్) పోస్ట్‌లో సమంత హిరోయిన్‌గా ఎదిగిన తీరు అంటే తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు తనకు ఆదర్శం అని కూడా వివరించారు. ఒక సోదరుడు సోదరికి నూలు దండ వేస్తే ఆమెపై సోషల్ మీడియాలో చేసిన ట్రోల్ చూశాము. సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడకండి. మా కాంగ్రెస్ నాయకులు మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్న మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి’’ అని మహేష్ కుమార్ గౌడ్ తన వీడియోలో వివరించారు.

చల్లారని అభిమానుల ఆగ్రహం

సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎవరు తగ్గినా ఈ విషయంలో సమంత అభిమానుల ఆగ్రహం ఏమాత్రం చల్లారడం లేదు. మీ కుళ్లు రాజకీయాల కోసం ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడం ఎంతవరకు సబబు? ఒక వ్యక్తి జీవితంలో మానిపోతున్న గాయాన్ని.. మీ రాజకీయం కోసం, స్వలాభం కోసం తిరిగి రేపడం, దానిపై నీఛ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. అదే విధంగా కొండా సురేఖను వెనకేసుకు వస్తున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాగి పెట్టి కొట్టి.. సారీ అంటే సరిపోతుందా? అంటూ ఆయనను ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆలోచన లేకుండా ఒక వ్యక్తి జీవితాన్ని ఉద్దేశించి అత్యంత హీనంగా, దారుణంగా వ్యాఖ్యానించిన కొండా సురేఖపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కూడా సమంత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

కొండ సురేఖ వ్యాఖ్యలపై సమంత రిస్పాన్స్ ఇదే..

సినీ నటీనటులు నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆర్‌ కారణమని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటి సమంత ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. ‘‘నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను’’ అని సమత పేర్కొన్నారు. ‘‘కొండా సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను- దయచేసి చిన్నచూపు చూడకండి.ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.’’అని సమంత కోరారు. ‘‘నా విడాకులు పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వకంగా జరిగాయి, దీనిలో ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు.దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరు? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను,అలానే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సమంత తన ఇన్ స్టా వేదికగా పేర్కొన్నారు.

Tags:    

Similar News