కాంగ్రెస్‌లో వివాదాలు వాస్తవమే.. అంగీకరించిన టీపీసీసీ చీఫ్

కొత్త పాత నేతల మధ్య ఇబ్బందులు ఉన్న విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ కూడా అంగీకరించారు.;

Update: 2025-01-24 12:22 GMT

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు అధికమవుతున్నాయా? కొత్త పాత నేతలు వర్గాలుగా మారుతున్నారా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. కొత్త పాత నేతల మధ్య ఇబ్బందులు ఉన్న విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ కూడా అంగీకరించారు. పఠాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేయడంపై ఆయన స్పందించారు. పఠాన్‌చెరు కాంగ్రెస్‌లో కొత్త పాత నాయకుల మధ్య ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సరికొత్త చర్చకు దారి తీస్తోంది. వివాదాలు ఉన్నాయని అంగీకరించిన కాంగ్రెస్.. వాటి పరిష్కారం కోసం ఏం చేస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే ఇటీవల కాంగ్రెస్ నేతల మధ్య, యూత్ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన గొడవలను తమ పార్టీ తేలికగా తీసుకోదని, ఇప్పటికే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోందని వెల్లడించారు.

‘‘పఠాన్ చెరువులో కొత్త పాత నాయకుల మధ్య ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. గ్రామ సభలకు విషయంలో అపోహలు వద్దు. నిజమైన పేద వారికే లబ్ది కావాలనేది ప్రభుత్వం ఉదేశం. యూత్ కాంగ్రెస్ గొడవలో ఉన్న వారందరికీ షోకాజు నోటీసులు ఇచ్చాం. ఖచ్చితంగా తగిన చర్యలు ఉంటాయి. ఏ ఒక్కరికీ ఉపేక్షించేది లేదు. నిబంధనలను అతిక్రమించిన వారెవరినీ కాంగ్రెస్ వదలదు. తగిన చర్యలు తీసుకుని తీరతాం. ఇటీవల జరిగిన గొడవలపై పార్టీ దృష్టి సారించింది’’ అని తెలపారు.

‘‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక పైన కసరత్తు మొదలైంది. లిస్ట్ రెడీ చేసి హైకమాండ్‌కి పంపిస్తాము త్వరలో అభ్యర్థి ప్రకటన ఉంటుంది. గతంలో అధికారులు ఆంక్షలతో పని చేశారు. ఇప్పుడు స్వేచ్ఛగా పని చేస్తున్నారు. ఇది నిజమైన ప్రజా పరిపాలన. వచ్చే బుధవారం నుండి మంత్రుల ముఖాముఖీ ఉంటుంది. బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది అంతే. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’’ అని తెలిపారు.

పఠాన్ చెరువులో ఏం జరిగిందంటే..

కాంగ్రెస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. పటాన్‌చెరులో ఆయన పర్యటనకు వస్తున్న క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున విజయం సాధించి కొంతకాలానికే కాంగ్రెస్ కండువా కప్పుకున్న సదరు నేత.. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్‌కు వత్తాసు పలుకుతున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో రెండు రోజులుగా జరుగుతున్న కార్యక్రమాల్లో మహిపాల్ రెడ్డి తీరు ఏమాత్రం బాగోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరు మార్చుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలోకాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటికీ మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ ఫొటోనే ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఆఫీసులో రేవంత్ ఫొటో పెట్టడం ఇష్టం లేకుంటే పార్టీ నుంచి తప్పుకోవాలని, బీఆర్ఎస్‌ పంచనే మళ్ళీ చేరాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పటాన్‌చెరువులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ శ్రేణులు మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసనలు, నినాదాలు చేస్తుండగా మహిపాల్ అనుచరులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మహిపాల్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడతారని వారు అన్నారు. దీంతో మహిపాల్ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని, అది కాస్తా వివాదంగా మారి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.

కుళ్లబొడుచుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు

యూత్ కాంగ్రెస్‌లో పదవులు పెట్టిన చిచ్చుకారంగాణే ఈ వర్గాలు ఏర్పడ్డాయి. ఈ రెండు పక్షాలు.. బుధవారం గాంధీభవన్‌లో సమావేశం అయ్యాయి. కాగా వారి మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా మరింత పెరిగి వివాదంగా అవతరించింది. ఈ క్రమంలో రెండు పక్షాలు తీవ్ర ఆగ్రహానికి గురికావడంతో వారు ఒకరిపై ఒకరు బలప్రయోగం చేసుకున్నారు. వారంతా బాహాబాహీ అయ్యారు. పార్టీలో పదవుల కోసమే ఈ తన్నులాట జరిగింది. ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరిన వారికి పదవులు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలోనే చాలా కాలంగా ఉన్న కొత్తగూడెం కాంగ్రెస్ నేతలకు చిర్రెత్తుకు వచ్చింది. తమకు ఇవ్వాల్సిన పదవులను నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చిన వారికి ఎలా ఇస్తారని పార్టీ పెద్దలను నిలదీశారు. ఈ క్రమంలోనే వారి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు పక్షాల యూత్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అంతే ప్రత్యర్థి పక్షం నేతలపై కలబడ్డారు. దీంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది.

Tags:    

Similar News