Tiger Roaming| బాబోయ్ పులి,భయాందోళనల్లో వందగ్రామాల ప్రజలు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారంపై వంద గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.యువతిపై పులి దాడి చేసి చంపిన ఘటనతో అటవీశాఖ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.

Update: 2024-11-30 06:04 GMT

కాగజ్‌నగర్ మండలం నజ్రుల్‌నగర్‌లో శుక్రవారం ఓ యువతి పులి(Tiger Attack) చంపడంతో సిర్పూర్ (టి) అసెంబ్లీ సెగ్మెంట్‌లోని పలు గ్రామాల వాసులు ఉలిక్కిపడ్డారు. ఈద్గాం, నజ్రుల్ నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు (Tiger Roaming) అటవీశాఖ అధికారులు గుర్తించారు.

- పులి సంచరిస్తున్న గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు డ్రోన్లతో(DRONES) గాలిస్తున్నారు. పులి సంచారాన్ని గుర్తించేందుకు కెమెరా ట్రాప్ లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు.
- పులి సంచరిస్తున్న గ్రామాల్లో రైతులు పొలం పనులకు వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు శనివారం హెచ్చరికలు జారీ చేశారు.
- మహారాష్ట్ర నుంచి వచ్చిన పులుల దాడుల్లో కొమురం భీఆసిఫాబాద్ జిల్లాల్లో గత నాలుగేళ్లలో నలుగురు మరణించారు. శుక్రవారం పులి దాడిలో లక్ష్మీ అనే యువతి మరణించింది. గత ఏడాది వాంకిడి మండలంలో ఓ వ్యక్తి పులి దాడిలో ప్రాణాలు విడిచాడు. 2021వ సంవత్సరంలో దిగిడ అటవీ గ్రామంలో ఓ యువతి మరణించింది. పెంచికల్ పేట మండలంలో ఓ యువకుడు పులి దాడిలో మరణించాడు.

వందగ్రామాల్లో పులి సంచారం
కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), దహెగాం, పెంచికల్‌పేట, కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాల్లోని అటవీ ప్రాంత మారుమూల ప్రాంతాల్లోని వందకు పైగా గ్రామాల వాసులు వలస పులుల సంచారం పెరగడంతో తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. గత కొన్ని వారాలుగా అడవులు,వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు పత్తి కోతలను నిలిపివేశారు.కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి), దహెగావ్‌, కౌటాల, బెజ్జూర్‌, పెంచికల్‌పేట మండలాల్లోని అటవీ గ్రామాల్లో రాత్రిపూట షెడ్లలో పశువులపై పులి దాడి చేస్తుందనే భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అటవీశాఖ అధికారుల సూచన మేరకు గొర్రెల కాపరులు పశువులను మేతకు అడవుల్లోకి తీసుకెళ్లడం లేదు.

నిషేధాజ్ఞలు జారీ
మహిళను పులి చంపిన ఘటనతో కాగజ్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు.కాగజ్‌నగర్‌ మండలంలోని సీతానగర్‌, అనుకోడ, గన్నారం, కదంబ, ఆరెగూడ, బాబానగర్‌ గ్రామాలతో పాటు ఈసగావ్‌ గ్రామపంచాయతీల్లో కర్ఫ్యూ అమలులో ఉన్నట్లు కాగజ్ నగర్ పోలీసులు చెప్పారు. పులి సంచారం కారణంగా గ్రామస్థులు అడవుల్లోకి, వ్యవసాయ పొలాల్లోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నారు.ఆసిఫాబాద్‌ ప్రాంతంలో ప్రజలు అడవుల్లోని కాలిబాటలను ఉపయోగించవద్దని అటవీశాఖ అధికారులు కోరారు. ప్రజలు ఎనిమిది నుంచి 10 మంది వ్యక్తుల సమూహాలతో వెళ్లాలని సూచించారు.రైతులు నేలపై కాకుండా మంచలపైనే ఉంటూ పంటలకు కాపలాగా ఉండాలని అధికారులు కోరారు.

గొర్రెల కాపరులు జర జాగ్రత్త
గొర్రెల కాపరులు తమ గ్రామాల నుంచి 500 మీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న అడవులలోకి ప్రవేశించ వద్దని అటవీశాఖ అధికారులు కోరారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పశువులను మేపుకోవాలని వారు సూచించారు. పులి మహిళను చంపిన ఘటనతో అటవీశాఖ అధికారులు సర్పంచ్, ఎఫ్‌బీఓ, పోలీసుతో కూడిన గ్రామ రక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు పులి గుర్తులు, పులుల సంచారం కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. పులి సంచారంపై గ్రామాల్లో టాం-టామ్ వేయించారు. గ్రామాల్లో ఈలలు, డ్రమ్ములను కొనుగోలు చేయాలని కూడా కమిటీలకు సూచించారు.

మహారాష్ట్ర పులి వలస
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లోకి మహారాష్ట్ర నుంచి పులి వలసవచ్చిందని ఆసిఫాబాద్ డీఎఫ్ఓ నీరజ్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మహారాష్ట్రలో పులుల సంఖ్య పెరగడంతో కొత్త ఆవాసం కోసం ఆసిఫాబాద్ అడవుల్లోకి వలస వచ్చిందని అటవీశాఖ అధికారులు చెప్పారు. వలస వచ్చిన పులికి ఆవాసం, ఆహారం దొరక్క కలత చెంది యువతిపై దాడి చేసి ఉంటుందని అటవీశాఖ అధికారులు అంచనా వేశారు. యువతిని చంపిన పులి పాదముద్రల్ని విశ్లేషించగా, అది రెండున్నరేళ్ల వయసుది అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతానికి సమీపంలోని పూర్వ ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో పులి సంచరిస్తుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.


Tags:    

Similar News