పులుల శృంగార సమయం ముగిసింది,టైగర్ రిజర్వ్ సఫారీ పునర్ ప్రారంభం

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో గడచిన మూడు నెలలపాటు పులుల మేటింగ్ సీజన్ ముగిసింది. పులుల అభయారణ్యంలో సఫారీ వాహనాలను జెండా ఊపి పునర్ ప్రారంభించారు.

Update: 2024-10-02 11:45 GMT

తెలంగాణలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యం దేశంలోనే ఎక్కువ పులుల సంఖ్య ఉన్న టైగర్ రిజర్వుగా పేరొందింది.ఈ అభయారణ్యంలో 2022లో 21 పులులుండగా, మేటింగ్ సీజన్ వల్ల వీటి సంఖ్య 34కు పెరిగాయి.

- పులుల శృంగార సమయం కోసం మూడు నెలల పాటు అడవిలోకి సందర్శకులను అనుమతించలేదు. పులుల మేటింగ్ సీజన్ ముగియడంతో బుధవారం సఫారీ వాహనాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర్ రాజనర్సింహ, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణ ప్రారంభించారు.

టైగర్ రిజర్వులో సందర్శకుల సందడి
అమ్రాబాద్ టైగర్ రిజర్వులో వన్యప్రాణుల ఔత్సాహికుల కోసం మూడు సఫారీ వాహనాలను మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. దీంతో అమ్రాబాద్ అభయారణ్యంలో సందర్శకుల సందడి ప్రారంభం కానుంది. అక్టోబర్ 3వతేదీ నుంచి పర్యాటకులు, సందర్శకులు ఆన్‌లైన్‌లో అమ్రాబాద్ జంగిల్ స్టే ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చని జిల్లా అటవీ అధికారి రోహిత్ గోపిడి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.



 టైగర్ రిజర్వులో పెరుగుతున్న సందర్శకులు

అమ్రాబాద్ టైగర్ రిజర్వులో జంగిల్ సఫారీని 2021వ సంవత్సరంలో ప్రారంభించారు. మొదటి సంవత్సరం 1500 మంది పర్యాటకులు అభయారణ్యాన్ని సందర్శించారు. 2022లో 4,500 మంది, గత ఏడాది 7వేల మంది వన్యప్రాణుల ఔత్సాహికులు సఫారీని సందర్శించారు. ఏ యేటి కాఏడు టైగర్ రిజర్వును సందర్శించే వారి సంఖ్య పెరుగుతుంది. అమ్రాబాద్ సఫారీ మార్గంలో పులుల పగ్ గుర్తులు కనిపించాయని, సందర్శకులు రెండు పులులను గుర్తించే అవకాశాలున్నాయని అటవీశాఖ అధికారి రోహిత్ చెప్పారు.

మన్ననూర్ జంగిల్ రిసార్టులో బస
అమ్రాబాద్ పులుల అభయారణ్యాన్ని చూడాలనుకునే వారి కోసం అటవీ శాఖ ప్యాకేజీలను ప్రకటించింది. మన్ననూర్ జంగిల్ రిసార్ట్ లో కాటేజీల్లో బస, అడవిలోకి సఫారీ, అడవిలోని కొండల్లో ట్రెక్కింగ్ చేసే అవకాశాలు కల్పిస్తున్నామని అటవీశాఖ అధికారులు చెప్పారు.


Tags:    

Similar News