విశాఖ ఉక్కులో జీతాల్లేని తొలి సంక్రాంతి ఇదే..!

మూడు నెలలుగా అరకొర చెల్లింపులు ఈ నెలలో పూర్తిగా నిలిచిపోయిన వేతనాలు. ఇప్పటికే ఉద్యోగులకు 250 శాతం బకాయిలు. కార్మికుల ఇళ్లలో కానరాని సంక్రాంతి వేడుకలు.;

Update: 2025-01-13 07:10 GMT

ఒకప్పుడు సంక్రాంతి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పండగే పండగ! ఏ ఉద్యోగి ఇంట్లో చూసినా సంబరాలే సంబరాలు. మంచి మంచి జీతాలతో, భార్యాపిల్లలతో ఖుషీ ఖుషీగా గడిపేవారు. సంక్రాంతి పండగకు ఖరీదైన దుస్తులు, వస్తువుల కొనుగోలుకు వెనకాడే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు? నెలనెలా జీతాల్లేవు. కొన్ని నెలలుగా అరాకొర వేతనాలే దిక్కు. ఇప్పుడు ప్లాంట్ యాజమాన్యం ఈ సంక్రాంతికి పూర్తిగా జీతాలు చెల్లించలేక చేతులెత్తేసింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలో జీతాల్లేని తొలి సంక్రాంతిగా ఈ ఏడాది పండగ రికార్డులకెక్కింది. ఫలితంగా ఉక్కు ఉద్యోగులు/కార్మికులు సంక్రాంతి పూట ఉసూరుమంటున్నారు!

ప్రైవేటీకరణ ప్రకటన వెలువడినప్పటి నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. ఆర్థిక సంకటంలో కొట్టుమిట్టాడుతున్న ఈ స్టీల్ ప్లాంట్లో ప్రైవేటీకరణ యత్నాలు ముమ్మరమవుతున్నాయి. ఆరు నెలల క్రితం అరకొర చెల్లింపులతో మొదలైన జీతాలు ఇప్పుడు అస్సలు చెల్లించలేని పరిస్థితులు దాపురించాయి. ఏటా దసరా పండగకు ఇచ్చే బోనస్ నూ ఈ సంవత్సరం కార్మికులకు ఇవ్వలేదు.

అయినా సరే కార్మికులు ఈ స్టీల్ ప్లాంట్ దుస్థితిని దృష్టిలో ఉంచుకుని.. ఉద్యోగం ఉంటే చాలు.. బోనస్ లేకపోయినా ఫర్వాలేదని సరిపెట్టుకున్నారు. సెప్టెంబరు నుంచి జీతాలు చెల్లింపులకు ఉక్కు యాజమాన్యం మరింతగా కోత పెడుతూ వస్తోంది. సెప్టెంబరులో 50 శాతం, అక్టోబర్ 65 శాతం, నవంబరులో 35 శాతం చొప్పున మాత్రమే వీరికి జీతాలిచ్చింది. డిసెంబర్ నెలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. దీంతో సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు ఉక్కు ఉద్యోగులకు 250 శాతం జీతాల బకాయి పడింది. అంటే ఒక ఉద్యోగి జీతం రూ. లక్ష అయితే అతినికి రెండున్నర లక్షల బకాయి ఉందన్న మాట!

సందడి లేని సంక్రాంతి..

ఏడాది మొత్తమ్మీద హిందువుల పెద్ద పండగ సంక్రాంతే. ఈ పండక్కి ఇంటిల్లపాదికీ కొత్త వస్త్రాలు, కూతుళ్లు, అల్లుళ్లు, కొడుకులు, కోడళ్లు, మనవరాళ్లు, మనుమలకు కొత్త దుస్తులు, పిండి వంటలు, వస్తువులు, ఇతర లాంఛనాలు వంటివి ప్రతి ఇంటా తప్పనిసరి. ఇందుకోసం భారీగా ఖర్చవుతుంది. అయితే విశాఖ స్టీల్స్టాంట్ ఉద్యోగుల ఇంట మాత్రం ఈ ఏడాది సంక్రాంతి కళ తప్పుతూ కనిపిస్తోంది. మునుపటిలా ఏ సందడి కానరావడం లేదు. ఎందుకంటే యాజమాన్యం డిసెంబరు నెల జీతాలు పూర్తిగా చెల్లించడం మానేసింది. గడచిన ఐదు నెలల బకాయిలు కూడా పూర్తిగా చెల్లించలేదు.

దీంతో ఉక్కు ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాయి. ప్రస్తుత తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మునుపటిలా హంగూ, ఆర్భాటాలకు, సరదా సందళ్లకు, ఖరీదైన వస్త్రాలు, దుస్తులకు దూరం ఉంటున్నారు. మొక్కుబడిగా ఈ పెద్ద పండగను జరుపుకుంటున్నారు. చాలా మంది ఇళ్లలో నామమాత్రపు కొనుగోళ్లే జరిపారు. ఈ ఏడాది సంక్రాంతికి స్టీల్ ప్లాంట్‌కు సమీపంలో ఉన్న గాజువాకలో సంక్రాంతి అమ్మకాలు రూ.30 కోట్ల మేర తగ్గిపోయినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనిని బట్టి ఈ స్టీల్ ప్లాంట్ కార్మికుల కొనుగోలు శక్తి ఏ మేర తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ‘గాజువాక వస్త్ర విక్రయాల్లో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులదే సింహభాగం. ఈ ఏడాది వీళ్ల కొనుగోళ్లు సగానికి తగ్గిపోయాయి' అని ఆర్.సుబ్బారావు అనే వస్త్ర వ్యాపారి 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.

అప్పు చేసి పప్పు కూడు..

'విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్రలో సంక్రాంతికి జీతాలు చెల్లించకపోవడం ఇదే తొలిసారి. 33 ఏళ్ల నా సర్వీసులో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఇప్పటికే జీతాలు సరిగా ఇవ్వక నెలనెలా ఈఎంఐల చెల్లింపుల కోసం అప్పులు చేస్తున్నాం. ఈ సంక్రాంతి కోసం మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. ప్లాంట్ పరిస్థితిని బట్టి కొందరికి బయట వడ్డీలకు అప్పు కూడా పుట్టడం లేదు. పండగ పూటా అప్పు చేసి పప్పుకూడు తినాల్సిన దుస్థితి దాపురించింది. చాలా వరకు సంక్రాంతి ఖర్చులను తగ్గించుకున్నాం' అని ఉక్కు ఉద్యోగి కె.రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశాడు.

వాస్తవానికి ప్లాంట్ పరిస్థితి బాగున్న రోజుల్లో పలువురు ఉద్యోగులు ఇళ్లు, కార్లు, స్థలాలు, గృహోపకరణాలు వంటి వాటి కోసం రుణాలు చేశారు. వాటికి నెలనెలా జీతాల నుంచి ఈఎంఐలు చెల్లిస్తున్నారు. కొన్ని నెలలుగా జీతాలు చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో వారి ఖాతాల్లో డబ్బుల్లేక సంబంధిత బ్యాంకుల నుంచి చెక్ బౌన్స్ నోటీసులొస్తున్నాయి. దీంతో ఇలాంటి వారు కూడా ఈఎంఐల సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి అప్పులు చేస్తున్నారు.

నెలకు రూ.80 కోట్ల జీతాలు..

వైజాగ్ స్టీల్స్టాంట్లో ప్రస్తుతం సుమారు 12,600 మంది ఉద్యోగులున్నారు. వీరికి నెలకు సగటున రూ.80 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాకుండా మరో రూ.40 కోట్ల వరకు ఇతరత్రా చెల్లింపులు జరుపుతుంది. ప్లాంట్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నదన్న నెపంతో యాజమాన్యం జీతాలు చెల్లింపుల్లో కోత పెడుతూ వస్తోంది. 'గతంలో ఈ స్టీల్ ప్లాంట్ బీఐఎస్ఆర్కు వెళ్లినప్పుడు గాని, కోవిడ్ సమయంలో గాని సంక్రాంతికి జీతాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తలేదు. జీతాల్లేకుండా సంక్రాంతి జరుపుకోవడం ప్లాంట్ చరిత్రలో ఇదే తొలిసారి. ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలన్న లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తేంది తప్ప మరొకటి కాదు.. అని విశాఖ స్టీల్ ప్లాంట్ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రామస్వామి 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు. 

Tags:    

Similar News