‘మూసీని బాగు చేసే వాడొకడొచ్చాడు’

మూసీ ప్రాజెక్ట్ శంకుస్థాపన నవంబర్ 1న జరగనుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దశాబ్దాలుగా వాయిదాలు పడుతున్న మూసీకి తమ ప్రభుత్వం విముక్తి కల్పించనుందని అన్నారు.

Update: 2024-10-29 11:53 GMT

మూసీ ప్రాజెక్ట్ శంకుస్థాపన నవంబర్ 1న జరగనుందని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. దశాబ్దాలుగా వాయిదాలు పడుతూ వస్తున్న మూసీకి తమ ప్రభుత్వం విముక్తి కల్పించనుందని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈరోజు సచివాలయంలో మాట్లాడుతూ.. ఆయన మూసీ ప్రాజెక్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లకు మూసీని బాగు చేసే వాడు ఒకడొచ్చాడని ప్రజలకు తెలిసిందని అన్నారు. తాను ఏ నిర్ణయం కూడా గాల్లో మేడలా తీసుకోనని, ఒక నిర్ణయం తీసుకోవాలంటే దాని పర్యావసానాల గురించి వెయ్యిసార్లు ఆలోచిస్తానని, అంతే ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఏది ఏమైనా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. ‘‘మూసీ విషయంలో ఎంతో తర్జనబర్జన పడ్డాం. ఇప్పుడు మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవనం చేయసి తీరాలని నిశ్చియించుకున్నాం. ఇక ఆగేది లేదు. ఏం జరిగినా అడుగు ముందుకే పడుతుంది. ఎవరు అడ్డుపడ్డా ప్రాజెక్ట్‌ ఆగదు’’ అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

బీఆర్ఎస్ తన అభ్యంతరాలు తెలపాలి

ఈ సందర్భంగా మూసీ ప్రాజెక్ట్ విషయంలో తమకు ఉన్న అభ్యంతరాలను బీఆర్ఎస్ నేతలు తెలపాలని, అందుకోసం వారిని తాను కలవడానికి కూడా సిద్ధమని తెలిపారు సీఎం రేవంత్. ‘‘ఒకవేళ నన్ను కలవడానికి ఇబ్బందులు ఏమైనా ఉంటే.. అధికారులను కలిసి అయినా వారు తమ అభ్యంతరాలు, సందేహాలు తెలపొచ్చు. బాపూఘాట్ నుంచి వెనక్కు 21 కిలోమీటర్ల పాటు అభివృద్ధి చేస్తాం. మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీరు తరలిస్తాం. మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటి తరలింపుకు నవంబర్‌లో టెండర్లు పిలుస్తాం. మూసీ అభివృద్ధి అధ్యయానికి నగర ప్రజాప్రతినిధులను రంగంలోకి పంపుతాం. నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను సియోల్‌కు పంపుతాం’’ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ప్రజలకు అర్థమైంది..

మూసీ ప్రాజెక్ట్‌ను తమ ప్రభుత్వం ఏదో యాధృచ్చికంగా లేవనెత్తలేదని, కావాలనే మూసీ ప్రాజెక్ట‌ను చేపట్టాలని నిర్ణయించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ‘‘మూసీ పునరుజ్జీవనంపై కావాలనే చర్చకు తెరలేపాను. ఈ చర్చ వల్ల ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. మూసీని బాగుచేసే వాడు ఒకడు వచ్చాడని తెలిసింది. మూసీ ప్రాజెక్ట్ ద్వారా పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. తద్వారా తెలంగాణ అభివృద్ధి కూడా పరుగులు పెడుతోంది. పర్యటక రంగంలో తెలంగాణను కొత్త ఎత్తులకు తీసుకెళ్లే సత్తా మూసీ ప్రాజెక్ట్ ఉంది’’ అని అన్నారు రేవంత్ రెడ్డి.

దర్యాప్తులో కక్ష ఉండదు..

‘‘ప్రస్తుతం గత ప్రభుత్వం పాల్పడిన అనేక అవినీతి అంశాలు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుగుతోంది. విచారణ పారదర్శకంగానే జరుగుతుంది. ఎటువంటి కక్షసాధింపులకు తావులేకుండా విచారణ ముందుకు సాగుతుంది. దర్యాప్తు సంస్థ ఇచ్చే నివేదికల ఆధారంగానే చర్యలు ఉంటాయి. రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కోడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరుతాం. ముఖ్యమంత్రి అవ్వాలన్న నా కల నెరవేరింది. అంతకన్నా పెద్ద కలలు నాకేమీ లేవు. ఒక పేదలకు సేవ చేయడం, వారి జీవితాలను మెరుగుపరచడమే నా లక్ష్యం’’ అని తెలిపారు.


Tags:    

Similar News