మూసీ ప్రక్షాళనకు అంత ఖర్చు అవసరమా.. ఇలా అయితే ప్రభుత్వాన్ని నడపలేరు: కేటీఆర్

మూసీ నది ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధం కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

Update: 2024-09-25 07:41 GMT

మూసీ నది ప్రక్షాళన కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధం కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అసలు మూసీ నది ప్రక్షాళనకు అంత ఖర్చు అవసరమా? అవసరమైతే ఎలా? అనేది చెప్పాలంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మూసీ నది ప్రక్షాళన దిశగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు మూసీ నది ప్రక్షాళన చేసి తీరాలని నిశ్చయించుకుంది. ఇందుకోసం విదేశా సంస్థలను సైతం రంగంలోకి దించడానికి సీఎం రేవంత్ రెడ్డి వెనకాడటం లేదు. ఈ క్రమంలో ఈ మూసీ సుందరీకరణ ప్లాన్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ పనులను పాకిస్థాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నంలో రేవంత్ తలమున్కలై ఉన్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం కూడా జరుగుతోందని, కొత్తగా మూసీని సుందరీకరించాల్సిన అవసరం ఏమీ లేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముసీనదిని శుభ్రం చేయడానికి ఎన్నో ప్రాజెక్ట్‌లు చేపట్టి మూసీ నదిని శుభ్రం చేసిందని, అప్పుడు కట్టిన ఎస్‌టీపీలను వినియోగించుకుంటే ఇప్పుడూ సరిపోతుందని అన్నారు.

మూసీపై పొంతనలేని మాటలు

మూసీ నది కోసం తమ ప్రభుత్వంలోనే రూ.4వేల కోట్ల వ్యయంతో 31 ఎస్‌టీపీలు నిర్మించినట్లు కేటీఆర్ వెల్లడించారు. ‘‘మూసీ సుందరీకరణ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడుతున్న మాటల మధ్య పొంతనే లేదు. మూసీ నది కోసం ఎంత వెచ్చిస్తున్నాం అన్న విషయంలో రాష్ట్ర మంత్రివర్గానికి, సీఎంకే క్లారిటీ లేకపోతే ఎలా. ఒకరు రూ.లక్షా 50వేల కోట్లు అంటే.. మరొకరు 70వేల కోట్లు అంటున్నారు. అసలు మూసీ శుద్ది వెనక ప్రభుత్వం ఆలోచన వేరేలా ఉంది. ఉద్దేశం కూడా వేరే. గతంలో బీఆర్ఎస్ డబుల్ బెడ్రూం ఇళ్లు కడుతుంటే.. ఎక్కడా లేని విమర్శలు, ఆరోపణలు చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో భారీ అవినీతి జరిగిందని ఊదరగొట్టారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని నిర్మించకుండా ఉండి ఉంటే.. ఈరోజున మూసీ నది నిర్వాసితులకు ఎక్కడ నుంచి షెల్టర్ ఇచ్చేవారు’’ అని ప్రశ్నించారు.

హైడ్రాలో ఒక్కోక్కరికి ఒక్కో న్యాయం

‘‘హైడ్రా పేరిట హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు బాగుంది. కానీ హైడ్రా కూల్చివేతల్లో కాంగ్రెస్ నేతలు, బడా బాబులకు ఒక న్యాయం. పేదలకు ఒక న్యాయం అంటే ఎలా. ఈ విషయంపై ఎమ్మెల్యేలతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం. పేదలపై హైడ్రా చూపుతున్న ప్రతాపం.. పెద్దోళ్లపైన ఎందుకు చూపట్లేదు. ఇందుకు వేదశ్రీ అనే బాలిక ఉదాహరణ. ప్రభుత్వం ఇప్పుడేదో చేసేస్తున్నాం అని చెప్పుకుంటున్న అనేక పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడో చేసేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో వాళ్లు చెప్పిన ఆరు గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తే సరిపోతుంది’’ అని చెప్పారు.

ఇలా అయితే ప్రభుత్వం నడవదు

అదీ.. ఇదీ.. ఏదో ఒకటి అంటూ పబ్లిసిటీ స్టంట్లు చేసుకుంటూ పోతే ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం నడపలేరని కేటీఆర్ సూచించారు. ‘‘భారత్‌లో ఎక్కడా లేని విధంగా 31ఎస్టీపీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఎస్‌టీపీలు అనేవి కేసీఆర్ ముందుచూపుకు నిదర్శనం. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రజలకు తెలియజేస్తాం. అదే విధంగా ఇలానే పబ్లిసిటీ స్టంట్లతోనే సర్వైవ్ అవ్వాలనుకుంటే రేవంత్‌కు కష్టకాలం తప్పదు. ఇలాంటి స్టంట్లతో ప్రభుత్వం ఎక్కువ కాలం నడవదు. అది రేవంత్ అర్థం చేసుకోవాలి. మూసీ ప్రక్షాళన కోసం నిజంగా రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేయడం అవసరమా? అది రేవంత్ ఆలోచించుకోవాలి.. ప్రజలకు వివరించాలి’’ అని కేటీఆర్ కోరారు.

మూసీ ప్రక్షాళనకు అంత ఖర్చు అవసరమా..

‘‘హైదరాబాద్‌ను మురికి నీటి రహిత నగరంగా మార్చాలన్న లక్ష్యంతోనే ఎస్‌టీపీలు ప్రారంభించారు. దేశంలో 31 ఎస్‌టీపీలు ఉన్న ఏకైక నగరం హైదరాబాద్. ఉన్న ఎస్‌టీపీలను సక్రమంగా వినియోగించుకుంటే.. మూసీ నది సుందరీకరణకు ప్రత్యేక ఖర్చు.. పనులను చేయాల్సిన అవసరం ఉండదు. వాటిని వినియోగించుకోకుండా.. మళ్ళీ మూసీ ప్రక్షాళన, సుందరీకరణ పేరుతో కుంభకోణం చేయడానికా. ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీరు తిరిగి మూసీ నదిలోకి చేరుతోంది. 94 శాతం శుద్ధి చేసిన నీరే మూసీలోకి వెళ్తుంది. అలాంటప్పుడు మళ్ళీ మూసీ ప్రక్షాళణ, మూసీ నది నీటి శుద్ధి చేయాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రాజెక్ట్‌కు రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా?’’ అని ప్రశ్నించారు కేటీఆర్.

Tags:    

Similar News