ఓరుగల్లు వాసుల చిరకాల స్వప్నం త్వరలో సాకారం
ఓరుగల్లు ప్రాంతప్రజల చిరకాల స్వప్నం త్వరలో సాకారం కానుంది.ఉడాన్ స్కీం కింద వరంగల్ మామునూరు ఎయిర్‌ఫీల్డ్ ను ఫంక్షనల్ ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.
By : Shaik Saleem
Update: 2024-08-06 05:31 GMT
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో వరంగల్ నగర పరిధిలోని మామునూరు ఎయిర్ ఫీల్డును ఫంక్షనల్ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు పౌర విమానయాన శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు.
- వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌ఫీల్డ్‌లో 1980వ సంవత్సరం నుంచే విమానాలు రాకపోకలు సాగించేవి. అయితే గతంలో అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్ల వరంగల్ ఎయిర్ ఫీల్డ్ కు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
- కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా మన తెలుగు రాష్ట్ర ఎంపీ కింజరాపు రామమోహన్ నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించడం, రాష్ట్రంలో ఎ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో వరంగల్ విమానాశ్రయం నిర్మాణ ప్రతిపాదనలు కార్యరూపం దాలుస్తున్నాయి.
ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులతో సంప్రదింపులు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవతో తెలంగాణలోని వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్‌ఫీల్డ్‌లో విమానాశ్రయాన్ని ఏర్పాటు పనులు త్వరలో చేపట్టనున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మమునూర్ ఎయిర్‌ఫీల్డ్‌ను ఫంక్షనల్ ఎయిర్‌పోర్ట్‌గా అభివృద్ధి చేయడానికి ముమ్మర చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర అధికారులు విమానాశ్రయం ఏర్పాటు గురించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో ఇటీవల చర్చలు జరిపారు.
కబ్జాలతో కుచించుకు పోయిన మామునూర్ ఎయిర్‌ఫీల్డ్
మామూనూరు ఎయిర్‌ఫీల్డ్ భూమిలో అధిక భాగాన్ని కొందరు భూ ఆక్రమణదారులు కబ్జా చేశారు. వాస్తవానికి మామునూర్ ఎయిర్‌ఫీల్డ్ ప్రాంతం 1,140 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. కొందరు రాజకీయ నేతలు, కబ్జాదారుల ఆక్రమణల వల్ల నేడు 693 ఎకరాల భూమి మాత్రమే మిగిలింది. గత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మమునూర్ విమానాశ్రయాన్ని పునరుద్ధరించడం గురించి చర్చలు జరిపినా కార్యరూపం దాల్చలేదు.
విమానాశ్రయం రన్ వే కోసం...
వరంగల్ జిల్లాలోని మామునూర్ విమానాశ్రయాన్ని నిర్మించాలంటే రన్‌వేని 1.8 కిలోమీటర్ల నుంచి 3.9 కిలోమీటర్లకు పొడిగించాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు నిర్ణయించారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి రూ.1,200 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు. ఈ విమానాశ్రయం కోసం అదనంగా మరో 300 ఎకరాల భూమిని కేటాయించాలని సిఫారసు చేస్తూ ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది.
మరో 300 ఎకరాల భూమికి కేబినెట్ ఆమోదం
వరంగల్ విమానాశ్రయం నిర్మాణం కోసం అదనంగా మరో 300 ఎకరాల భూమిని కేటాయించాలనే ప్రతిపాదనకు రాష్ట్రప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది.మూమునూర్ విమానాశ్రయం కోసం 300 ఎకరాల భూమిని కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.కొత్త విమానాశ్రయం ఏర్పాటు గురించి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఇటీవల సమీక్షా సమావేశం జరిగింది.
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల పరిశీలన
వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ ఫీల్డ్ ప్రాంతాన్ని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇటీవల పరిశీలించారు. వరంగల్‌లో రెండు పర్యాయాలు సందర్శించిన కేంద్ర అధికారులు భూమి తనిఖీలు నిర్వహించారు. గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి, మామునూర్‌తో సహా చుట్టుపక్కల గ్రామాల్లో భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎమ్‌ఎస్‌నెం 36ని జారీ చేసింది.తెలంగాణ రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి మాజీ కార్యదర్శి నోముల శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వరంగల్ తో పాటు ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని నిర్మించాలనే ప్రతిపాదనలు సుదీర్ఘకాలం నుంచి పెండింగులో ఉన్నాయన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చొరవతో వరంగల్ విమానాశ్రయం నిర్మాణం కానుందని శ్రీనివాస్ వివరించారు.
జీఎంఆర్ కు ఎయిర్ పోర్ట్ అథారిటీ అభ్యర్థన
వరంగల్ విమానాశ్రయం ఏర్పాటు కు ప్రస్థుతం శంషాబాద్ జీఎంఆర్ విమానాశ్రయం విధించిన నిబంధనలు ఆటంకంగా మారాయి. శంషాబాద్ కు 150 కిలోమీటర్ల దూరం లోపల మరో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు అనుమతించకూడదనే అగ్రిమెంటులో ఉంది. అయితే కేంద్ర పౌర విమానయాన శాఖ ఈ నిబంధనను మార్చే అవకాశముంది. దీంతో వరంగల్ లో విమానాశ్రయం ఏర్పాటుకు అనుమతి కోసం 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న షంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా అభ్యర్థనను ఎయిర్ పోర్ట్ అథారిటీ పంపించింది. వరంగల్ నగరంలో కొత్త విమానాశ్రయం నిర్మిస్తే ఓరుగల్లు శరవేగంగా అభివృద్ధి చెందుతుందని వరంగల్ నగరానికి చెందిన కార్మిక శాఖ నాయకుడు, సోషల్ యాక్టివిస్టు కర్రా యాదవరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఉడాన్ పథకం కింద వరంగల్ విమానాశ్రయం నిర్మాణం
కేంద్ర పౌర విమానయాన శాఖ మమునూర్ ఎయిర్‌ఫీల్డ్‌ను విమానాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకంలో చేర్చింది.ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో విమానాశ్రయానికి అవసరమైన భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపి,విమానాశ్రయం నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో పాటు, ఆంధ్రప్రదేశ్ ఎంపీ కింజరాపు రామ్ మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కావడంతో వరంగల్ విమానాశ్రయం నిర్మాణానికి మార్గం సుగమం అయింది. వరంగల్ మామునూర్‌లో కొత్త విమానాశ్రయం నిర్మించాలనే వరంగల్ వాసుల చిరకాల వాంఛ సాకారమయ్యే దశలో ఉంది.