తెలంగాణ బస్సుల్లోకి AI.. ఎందుకంటే..?
బస్సులలో ప్రమాదాల నివారణకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ చర్యలు తీసుకుంటోంది.
బస్సులలో ప్రమాదాల నివారణకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ చర్యలు తీసుకుంటోంది. అందుకోసం అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) పరికరాలు పెద్ద ఎత్తున బస్సుల్లో అమర్చాలని యోచిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 200 రాష్ట్ర రవాణా బస్సుల్లో ఏర్పాటు చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పవర్డ్ అలర్ట్ సిస్టమ్.. గత ఏడాదిలో హైవేలపై ప్రమాదాలను 40 శాతం వరకు తగ్గించడంలో సహాయపడింది.
హైవేలపై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ముందస్తు చర్యగా, 2022 సెప్టెంబర్‌లో రాష్ట్రంలోని మూడు జాతీయ రహదారులైన హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-నాగ్‌పూర్ లో ప్రయాణించే బస్సుల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ఈ సిస్టమ్ ను ఏర్పాటు చేసింది. మార్చి 2023 నుంచి ఏప్రిల్ 2024 మధ్య రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన హైవే కారిడార్ లలో... రాష్ట్ర రవాణా బస్సులతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల సంఖ్య ఏడీఏఎస్ లేని బస్సులతో పోలిస్తే ఏడీఏఎస్ పరికరాలున్న బస్సులలో 40 శాతం తక్కువగా ఉంది.
ఐఎన్ఏఐ నేతృత్వంలో ఐఐఐటీ హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, ఇంటెల్ సంస్థల ఉమ్మడి సహకారంతో ఈ ప్రాజెక్ట్ రోడ్ సేఫ్టీ అండ్ మొబిలిటీ, హెల్త్ కేర్ ఛాలెంజెస్ ని పరిష్కరించడానికి ఏఐని ఉపయోగించడంపై ద్రుష్టి సారించింది. భారతదేశంలో ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో.. ఐఎన్ఏఐ, ఐఐఐటీ హైదరాబాద్ లోని అప్లైడ్ AI రీసెర్చ్ సెంటర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CRRI) ఇంటెల్, తెలంగాణ ప్రభుత్వం కలిసి ఇంటెలిజెంట్ సొల్యూషన్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ సర్వీస్ ని అభివృద్ధి చేస్తున్నాయి.
మోబిలే (Mobileye) అనే ఇంటెల్ కంపెనీ ద్వారా ఏడీఏఎస్ సాంకేతికతపై పైలట్ రీసెర్చ్ లు నిర్వహిస్తోంది. వెహికిల్ విండ్‌షీల్డ్‌పై అమర్చబడిన కెమెరా మొత్తం రహదారిని స్కాన్ చేసి ప్రమాదాలను గుర్తించి వాటిని నిరోధించేందుకు అలర్ట్ చేస్తుందా లేదా అనేది చెక్ చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా వాహనం ఢీకొనే ప్రమాదాన్ని గుర్తిస్తే, సిస్టమ్ డ్రైవర్ కు ఆడియో, వీడియో ద్వారా వార్నింగ్ అలర్ట్ ఇస్తుంది.
ఉదాహరణకు.. డ్రైవర్ ముందున్న వాహనానికి చాలా దగ్గరగా వస్తే సిస్టమ్ అతనిని హెచ్చరిస్తుంది. దీంతో డ్రైవర్ వేగాన్ని తగ్గించి సురక్షితమైన దూరాన్ని కొనసాగించవచ్చు. అంతేకాదు పాదచారులు, సైక్లిస్టులు, ఆకస్మికంగా రోడ్డుపైకి వచ్చిన జంతువులను ఢీకొనే ప్రమాదం ఉన్నప్పుడు కూడా ఇదే విధమైన హెచ్చరిక ధ్వనిస్తుంది. సిగ్నలింగ్ లేకుండా మీ నిర్దేశిత లేన్ నుండి దూరంగా ఉన్న సందర్భంలో, తప్పు లేన్‌లోకి అనుకోకుండా డ్రిఫ్టింగ్‌ను నిరోధించడానికి సిస్టమ్ హెచ్చరికను కూడా అందిస్తుంది. కాగా, ఈ రీసెర్చ్ ఫైనల్ రిపోర్ట్ ఇంకా వెలువడాల్సి ఉంది.