స్పీడ్ పెంచిన TGPSC... గురుకుల పోస్టుల భర్తీకి షెడ్యూల్ విడుదల
ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఉద్యోగ నియామకాల ప్రక్రియను స్పీడ్ అప్ చేసింది. రాష్ట్రంలోని గురుకులాల్లో పలు పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకటించింది.
ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేసింది. అధికారులు ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కీ విడుదల, మెయిన్స్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. తాజాగా రాష్ట్రంలోని గురుకులాల్లో పలు పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా శిశు సంక్షేమశాఖల పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాల్లో 562 మంది అధికారుల, పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మంది మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిసెంబర్ 2022 లో నోటిఫికేషన్ వచ్చింది. ఎట్టకేలకు ఈ పరీక్షలను నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని కమిషన్ డిసైడ్ అయింది.
జూన్ 24 నుంచి జూన్ 29 వరకు పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనుంది. కంప్యూటర్ బేస్డ్ రెస్పాన్స్ టెస్ట్ (CBRT) విధానంలో పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రారంభం అవడానికి మూడు రోజుల ముందు నుంచి అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
శాఖలవారీగా పోస్టులు..
ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో 298 పోస్టులున్నాయి. బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్-2 మొత్తం 140 పోస్టుల్లో ప్రీమెట్రిక్ బాలుర వసతి గృహాల్లో 87, పోస్టుమెట్రిక్ బాలుర వసతి గృహాల్లో 14, ప్రీమెట్రిక్ బాలికల వసతి గృహాల్లో 26, పోస్టుమెట్రిక్ బాలికల వసతి గృహాల్లో 13 ఖాళీలు ఉన్నాయి.
ఎన్ని ఖాళీలున్నాయి?
గిరిజన సంక్షేమ వసతిగృహ అధికారులు గ్రేడ్-1 - 5; గ్రేడ్-2 - 106
ఎస్సీ సంక్షేమ వసతి గృహ అధికారులు గ్రేడ్-2 (మహిళ) - 70; గ్రేడ్-2 (పురుషులు) - 228
బీసీ సంక్షేమ వసతి గృహ అధికారులు గ్రేడ్-2- 140
దివ్యాంగుల సంక్షేమశాఖలో వార్డెన్ గ్రేడ్ -1- 5; వార్డెన్ గ్రేడ్-2 - 3
దివ్యాంగుల సంక్షేమశాఖలో మాట్రన్ గ్రేడ్-1 - 3; మాట్రన్ గ్రేడ్-2 - 2
చిన్నారుల సంరక్షణ గృహాల్లో లేడీ సూపరింటెండెంట్లు - 19