ఆటోల కొనుగోలుకు ‘నో పర్మిట్’.. పొల్యూషనే కారణం..

కాలుష్యం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

Update: 2024-10-12 07:26 GMT

కాలుష్యం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఈ క్రమంలోనే పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఈ కాలుష్యాన్ని నివారించడం కోసం ప్రతి దేశం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే భారత్ కూడా రాష్ట్రాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పటించింది. దీంతో కాలుష్యంపై ప్రతి రాష్ట్రం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో కాలుష్యం కారకాలను నియంత్రించేలా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో అత్యధిక కాలుష్యం వాహనాల నుంచే వస్తుందని గుర్తించిన ప్రభుత్వం.. వాహనాల కొనుగోలుపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త ఆటోల కొనుగోలుకు పర్మిట్ ఇవ్వకూడదని నిశ్చయించింది. ఈ మేరకు తెలంగాణ పర్యావరణ శాఖ ఉత్తర్వులను కూడా విడుదల చేసింది. ‘రాష్ట్రంలో కాలుస్యం పెరిగిపోతోంది. భవిష్యత్ తరాల మనుగడకు ఇది ప్రమాదకరంగా మారే ప్రమాదముంది. అటువంటి పరిస్థితులు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని అధికారులు వెల్లడించారు.

ఆటోలకు నో పర్మిట్..

‘‘కాలుష్య నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా అధిక కాలుష్య కారకాలైన డీజిల్, పెట్రోల్ వాహనాలపై దృష్టిసారించాం. ఆటోలపై నియంత్రణ నిబంధనలు పెట్టడం కూడా అందులోని భాగమే. ఎలక్ట్రిక్ ఆటోలు జీరో పొల్యూషన్‌ను విడుదల చేస్తాయి. కాబట్టి ప్రభుత్వం కూడా వాటినే ప్రోత్సహించడం మంచిది. ఆటో కొనుగోలు దారులను కూడా ఆ దిశగా ప్రోత్సహించడం కోసం డీజిల్, పెట్రోల్ కొత్త ఆటోల కొనుగోలుకు నో పర్మిట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 733 ఆటోలు ఉన్నాయి. అధికారిక లెక్కట ప్రకారం గ్రేటర్ పరిధిలోనే 1.5 లక్షల ఆటోలు నమోదయి ఉన్నాయి. ఇది రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని గ్రహించాం. అందులో కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కొత్త ఆటోల కొనుగోలుదారులకు నో పర్మిట్ నిబంధన అమలు చేయాలి’’ అని పర్యావరణ శాఖ పేర్కొంది.

ఆర్‌టీసీలో మొదలైన చర్యలు

కాగా కాలుష్య నివారణకు తెలంగాణ ఆర్‌టీసీలో ఇప్పటికే చర్యలు చేపట్టింది ప్రభుత్వం. అందులో భాగంగానే ఇప్పటికే ఆర్‌టీసీలో కూడా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను రంగంలోకి దించింది. అతి త్వరలోనే మొత్తం డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో రీప్లేస్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇదే విషయాన్ని ఆర్‌టీసీ ఎంబీ సజ్జనార్, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తెలిపారు. ఇటీవల కరీంనగర్‌లో 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్రంలో కాలం చెల్లిన డీజిల్ బస్సుల స్థానాల్లో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రజారవాణాలో ఆటోల వినియోగం అధికంగా ఉందని, వాటి స్థానంలో కూడా ఎలక్ట్రిక్ వాహనలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఎలక్ట్రిక్ బస్సుల గురించి సజ్జనార్ ఏమన్నారంటే..

హైదరాబాద్ నగరంలో అత్యధికంగా కాలుష్యానికి కారణమైనవాటిలో ఆర్టీసీ బస్సులు అన్న సంగతి తెలిసిందే. అయితే అదంతా గతం. ఇకనుంచి ఈ పరిస్థితి మారబోతోంది. నగరవ్యాప్తంగా ఇక మొత్తం ఎలక్ట్రిక్ బస్సులనే నడపబోతున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ సజ్జనార్ వెల్లడించారు. దీనికోసం మొత్తం 2,500 ఎలక్ట్రిక్ బస్సులు కొంటున్నామని, ఇప్పటికే 500 బస్సులు నగరంలో తిరుగుతున్నాయని తెలిపారు. త్వరలో మిగిలినవి కూడా దశలవారీగా ప్రవేశపెడతామని చెప్పారు. దీనిద్వారా వాయుకాలుష్యం, శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గి నగరవాసులకు మేలు చేకూరుతుందని సజ్జనార్ అన్నారు.

తెలంగాణలో వివిధ జిల్లాలనుంచి హైదరాబాద్‌కు ఇంటర్ సిటీ సర్వీసులకోసం నడపటానికి కేటాయించిన 500 బస్సులలో కరీంనగర్‌కు తొలివిడతగా మంజూరైన 35 బస్సులను రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ ప్రారంభించారు. కరీంనగర్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఆర్టీసీ ఛైర్మన్ సజ్జనార్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సజ్జనార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 325 కి.మీ. ప్రయాణిస్తాయని, 2-3 గంటల్లో వందశాతం ఛార్జ్ అవుతాయని తెలిపారు. ఈ బస్సుల్లో 41 సీట్ల సామర్థ్యం ఉంటుందని, క్యాబిన్, సెలూన్‌లలో రెండు చోట్ల సీసీ కెమేరాలు పెట్టామని చెప్పారు. కరీంనగర్ నుంచి మూడే గంటల్లో హైదరాబాద్ జేబీఎస్ బస్ స్టేషన్ చేరుకుంటామని తెలిపారు. బస్సులో ప్రయాణీకులకు చాలా అధునాతన సౌకర్యాలు కల్పించామని చెప్పారు.

పొన్నం ప్రభాకర్ ఏం చెప్పారంటే..

ఆర్‌టీసీ ఉద్యోగులు, కార్మికులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలను కూడా అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సందర్బంగా ఆయన పలు కీలక అంశాలను వెల్లడించారు. ఆర్టీసీని అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం కోసం ఆర్టీసీ.. జేబీఎం సంస్థతో ఒప్పందం చేసుకుందని వివరించారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డీజిల్ బస్ కూడా లేకుండా ప్రణాళికలలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఆర్టీసీని మెరుగుపరచడం కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.

Tags:    

Similar News