వరద మృతుల కుటుంబాలకు సాయం పెంపు.. ఖమ్మం కి సీఎం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచుతున్నట్టు ప్రకటించింది.

By :  Vanaja
Update: 2024-09-02 08:03 GMT

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచుతున్నట్టు ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. అలాగే ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లకు తక్షణ సాయం కోసం రూ.5 కోట్లు నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలో వర్షాలు, వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా పెంచడంపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు పదిమంది మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. సోమవారం ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్ లో వర్షాలపై రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టరేట్లలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో వ్యవస్థను సన్నద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని ఎనిమిది పోలీసు బెటాలియన్లకు ఎండీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని సూచించారు.

ప్రజలకు జరిగిన నష్టం పై తక్షణమే అధికారులు స్పందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలి. విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.

వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక పంపాలన్నారు. తక్షణ సాయం కోరుతూ సీఎం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణ వరదలని జాతీయ విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అలాగే వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, కలెక్టర్లకు తక్షణ సాయం కోసం రూ . ఐదు కోట్లు విడుదల చేస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. సమావేశం అనంతరం ఆయన రోడ్డు మార్గాన ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు బయలుదేరారు.

Tags:    

Similar News