తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది నిరుద్యోగులు భార్యాపిల్లలను ఇక్కడ వదిలి ఉపాధి కోసం పొట్టచేతబట్టుకొని ఎన్నో ఆశలతో మలేషియా వెళ్లారు. మలేషియాలో పనులు చేసి తమ భార్యాపిల్లలను పోషించుకుందామని వెళ్లిన తెలుగు కార్మికులు అక్కడి అడవుల్లోని పామాయిల్, రబ్బరు తోటలు, హోటళ్లు, గ్యారేజీలు, కర్మాగారాల్లో కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారు. మలేషియాలో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఏజెంట్లు నిరక్షరాస్యులను విజిట్ వీసాలపై మలేషియా దేశానికి పంపిస్తే అక్కడ అక్రమ నివాసులుగా మారి, పోలీసులు, జైలు భయంతో వారు మారుమూల అడవుల్లో రేకుల షెడ్లలో నివాసం ఉంటూ పామాయిల్, రబ్బరు తోటల్లో కార్మికులుగా జీవితం వెళ్లదీస్తున్నారు.మలేషియాలోని యజమానులు సరిగా కూడు కూడా పెట్టకుండా అడవుల్లోని ఇరుకు గదుల్లో ఉంచి తోటల పనులు చేపిస్తున్నారు.
అక్రమ నివాసుల్లో తెలుగు వారు అధికం
మలేషియా దేశంలో 2 లక్షల మంది భారతీయులుండగా, వీరిలో విజిట్ వీసాపై వెళ్లి అక్రమనివాసులుగా మారి వెట్టి చాకిరీ చేస్తున్న వారు యాభై వేలమంది దాకా ఉన్నారని ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అక్రమ నివాసుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన తెలుగుకార్మికులు ఎక్కువ మంది ఉన్నారని ఆయన తెలిపారు.తెలంగాణలోని నిర్మల్, మంచిర్యాల,ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ పట్టణం, తూర్పు గోదావరి, నెల్లూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి వేలాది మంది కార్మికులు అక్రమ నివాసులు మలేషియాలో వెట్టిచాకిరీ చేస్తున్నారు. వేలాది మంది నిరుద్యోగులు ఏజెంట్ల మోసాల బారిన పడి మలేషియాకు విజిట్ వీసాపై వెళ్లి అక్కడి రబ్బరుతోటల్లో, హోటళ్లలో వెట్టిచాకిరీ చేస్తున్నారని ఆయన ఆవేదనగా చెప్పారు.దీనికితోడు అక్రమ నివాసులుగా కొందరు యువకులు మలేషియా జైళ్లలో మగ్గుతున్నారు.
ఏమిటీ క్షమాభిక్ష2.0 కార్యక్రమం
మలేషియాలో అక్రమ నివాసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వారిని వారి వారి స్వదేశాలకు పంపించేందుకు మలేషియా ప్రభుత్వం అమ్నెస్టీ పేరిట ఓ పథకాన్ని తాజాగా తీసుకువచ్చింది.మలేషియా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ (JIM) పత్రాలు లేని వలసదారుల కోసం స్వచ్ఛందంగా తిరిగి స్వదేశాలకు వెళ్లే వారి కోసం వలసదారుల పునరావాస కార్యక్రమం 2.0ని మే 19వతేదీన ప్రారంభించింది. మలేషియాలో విజిట్ వీసాలపై వెళ్లి అక్రమ నివాసులుగా మారినవారు, వీసా పర్మిట్ గడువు ముగిసిన వారు మే 19 వతేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వతేదీ లోగా వారి స్వదేశాలకు వెళ్లేందుకు అమ్నెస్టీ పేరిట అవకాశం అక్కడి ప్రభుత్వం వీలు కల్పించింది. సాధారణంగా మలేషియాలో అక్రమనివాసులు అయితే పోలీసులు వారిని పట్టుకొని జైళ్లకు పంపిస్తుంటారు. అమ్నెస్టీ పథకాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో అక్రమ నివాసులకు జైలు శిక్ష వేయకుండా 500 రింగిట్స్ అంటే మన రూపాయల్లో పదివేలరూపాయలను చెల్లించి ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ పొంది స్వదేశానికి తిరిగిరావచ్చు. వీసా గడువు ముగిసిన వారు, పాస్ పోర్టు లేని వారు, వీసా లేని వారు కూడా జరిమానా చెల్లించి స్వదేశానికి తిరిగి రావచ్చు. దీని కోసం అక్రమ నివాసులు మలేషియాలో 14 ఇమ్మిగ్రేషన్ ఎన్ ఫోర్స్ మెంట్ డివిజన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకొని క్షమాభిక్ష పొందవచ్చు.జరిమానా చెల్లించి ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్, తిరుగు విమాన టికెటట్ పొంది స్వదేశానికి రావచ్చు.
పాములు, కొండ చిలువల మధ్య...
మలేషియా దేశంలోని తెలుగు కార్మికులు మారుమూల అడవుల్లోని రబ్బరు ప్లాంటేషన్, పామాయిల్ తోటల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. విజిట్ వీసాపై వెళ్లి అక్రమ నివాసులుగా మారటంతో దిక్కులేక పోలీసులు, జైళ్ల భయంతో వారు మారుమూల అడవుల్లోని షెడ్లలో తలదాచుకుంటూ అక్కడి తోటల్లో వెట్టిచాకిరీ చేస్తున్నారు. మలేషియా అడవుల్లో పాములు, కొండచిలువలు ఎక్కువ. వీటి మధ్యనే అడవుల్లో పనిచేయాల్సి వస్తుందని తెలంగాణకు చెందిన ప్రవీణ్ అనే కూలీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
మలేషియాలో ఏపీ యువకుడి మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎన్ మోహన్ కృష్ణ అనే యువకుడు ఏజెంట్ల మోసంతో విజిట్ వీసాతో మలేషియా వెళ్లాడు. అక్రమ నివాసిగా మారి అక్కడి పరిశ్రమలో కూలీ పనికి చేరాడు. పరిశ్రమలో చైనా నుంచి వచ్చే పాత చెప్పులు, బూట్లను శుభ్రం చేసి వాటిని విక్రయిస్తుంటారు. ఈ పనికి కుదిరాడు. పాత చెప్పులు, బూట్ల ను శుభ్రం చేస్తూ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకి మోహన్ కృష్ణ మరణింబచాడని ఏపీ ఎన్ఆర్‌టీఎస్ రీజనల్ కోఆర్టినేటర్ కంచర్ల ఆనంద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.మంచి కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి తెలుగు కార్మికులను తీసుకువచ్చి ఇక్కడ అడవుల్లో కూలీలుగా, పరిశ్రమల్లో కార్మికులుగా పనిలో పెడుతున్నారు.
అక్రమ నివాసులను ఏపీకి పంపిస్తాం...
మలేషియాలో అక్రమ నివాసులైన తెలుగు కార్మికుల పక్షాన తాము జరిమానా చెల్లించి వారికి తిరుగు విమాన టికెట్లు ఇప్పించి స్వదేశానికి పంపిస్తామని తెలుగు ఎక్స్ పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్, ఏపీ ఎన్ఆర్‌టీఎస్ రీజనల్ కోఆర్టినేటర్ కంచర్ల ఆనంద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మలేషియాలోని అక్రమ నివాసులైన తెలుగు కార్మికులు తమను సంప్రదిస్తే ఏపీ ఎన్ఆర్‌టీఎస్ సహకారంతో ఆదుకుంటామని ఆయన చెప్పారు.
తెలుగు కార్మికుల ఆవేదన
మలేషియాలో విజిట్ వీసాపై వెళ్లి అక్రమ నివాసులుగా మారి అక్కడి ఆయిల్ ఫాం, రబ్బరు తోటలు, భవన నిర్మాణ రంగంలో,హోటళ్లలో, పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్న వారు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పూట గడవక ఉపాధి కోసం మలేషియా వెళ్లిన కార్మికులు తమ ఉపాధి ఎలా అని ఆవేదన చెందుతుున్నారు. స్వదేశానికి రావాలంటే వారు పదివేలరూపాయల జరిమానా చెల్లించి విమాన తిరుగు టికెట్ కోసం డబ్బులు కావాలి. చాలీచాలని కూలీడబ్బులతో పనిచేస్తున్న అక్రమ కార్మికులు తాము జరిమానా ఎలా చెల్లించాలని ఆందోళన చెందుతున్నారు. ఈ పథకం వల్ల స్వదేశానికి వస్తే తమ ఉపాధి పోతుందని ఆవేదన చెందుతున్నారు.
మలేషియాలో ఏం జరిగిందంటే..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ నరేశ్, తలారి భాస్కర్, గురుజాల శంకర్, రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, మూన్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్‌లు ఉపాధి నిమిత్తం గతేడాది మలేషియాకు వెళ్లారు. ఈక్రమంలో వారు అక్కడ అనుకోకుండా ఓ కేసులో అరెస్టయ్యారు. విషయం తెలిసి వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు. తమ వారిని ఎలాగైనా సరే జైలు నుంచి విడిపించుకు రావాలని నిర్ణయించుకున్నారు.
మలేషియా జైలు నుంచి ఆరుగురు తెలంగాణ వాసుల విడుదల
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు కార్మికులు ఉపాధి కోసం మలేషియా వెళ్లి అక్కడి స్థానిక చట్టాల గురించి అవగాహన లేకపోవడంతో అరెస్ట్ అయి జైలు పాలయ్యారు. ఆయుధాలకు సంబంధించిన ఆరోపణలపై మలేషియాలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఒక సంవత్సరం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. కడెం మండలంలోని లింగాపూర్, దస్తురాబాద్ మండలంలోని మున్యాల్‌కు చెందిన కార్మికులు ఉపాధి కోసం మలేషియాకు వెళ్లారు.ఖానాపూర్‌కు చెందిన రాజకీయ నాయకుడు భూక్యా జాన్సన్ నాయక్ జైళ్లలో ఉన్న తెలుగు కార్మికులను విడుదల చేయించారు. జాన్సన్ నాయక్ మలేషియాకు వెళ్లి, న్యాయ సలహాదారుడిని నియమించుకొని, జరిమానాలు చెల్లించి వారిని తిరిగి తీసుకువచ్చారు.
జాన్సన్ నాయక్ ను ప్రశంసించిన కేటీఆర్
నిర్మల్ జిల్లా వాసులు జైలు పాలైన విషయం కేటీఆర్ దృష్టికి రావడంతో ఆయన బీఆర్ఎస్ నేత భూక్యా జాన్సన్ నాయక్ తో మాట్లాడి వారి విడుదలకు ప్రయత్నించాలని కోరారు.జైల్లో ఉన్న లింగాపూర్ గ్రామానికి చెందిన రాచకొండ నరేష్, తలారి భాస్కర్, గురుజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, మూన్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్‌లను విడుదల చేయించారు.తన సొంతడబ్బుతో జరిమానాలు చెల్లించి విమాన టికెట్లతో సహా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి వారిని స్వదేశానికి జాన్సన్ నాయక్ తీసుకువచ్చారు.