ఆత్మహత్య బెదిరింపులపై కౌశిక్ రెడ్డికి నోటీసులు

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులిచ్చింది. ఈ నెల 20 వ తేదిన వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.

By :  Vanaja
Update: 2024-06-11 13:11 GMT

హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులిచ్చింది. ఈ నెల 20 వ తేదిన వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని భార్య పిల్లలతో కలిసి కౌశిక్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. దీనిపై హుజురాబాద్ నుండి పోటీ చేసిన ఈటెల రాజేందర్ కోర్టును ఆశ్రయించగా నేడు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి.

పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ బై ఎలక్షన్స్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 23 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఈటల గెలుపొందారు. దీంతో కౌశిక్ రెడ్డి పరాజయం పాలయ్యారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటి విజయబావుటా ఎగురవేయాలని దృఢంగా ఫిక్స్ అయినట్టున్నారు. ప్రచార కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత కౌశిక్ రెడ్డి తన భార్య, కూతురుతో కలిసి ఒక వీడియో విడుదల చేశారు.

ఆ వీడియోలో హుజురాబాద్ ప్రజలను తనకి ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్ధించారు. అక్కడితో ఆగలేదాయన. ఎన్నికల్లో తనకి ఓటెయ్యకపోతే భార్య, కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించినంత పని చేశారు. ఈ వీడియో అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఓటర్లని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ప్రత్యర్ధులు ఆయనపై ధ్వజమెత్తారు. కానీ, ప్రజలు ఆయన కుటుంబాన్ని నిండు నూరేళ్లు బతకాలని ఆశీర్వదించారు. ఓటు రూపంలో ఆయుష్షు పోశారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే గా గెలిపించి మూడు ప్రాణాలను నిలబెట్టారు.

అయితే, ఆయన గెలుపు సొంత గెలుపు కాదని, ఓటర్లని సూసైడ్ చేసుకుంటామని బెదిరించి గెలిచారనేది ప్రత్యర్థుల ఆరోపణ. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్ హైకోర్ట్ మెట్లెక్కారు. కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ వేశారు. పిటిషన్ ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కౌశిక్ రెడ్డిపై సీరియస్ అయ్యింది. ఈ నెల 20 వ తేదిన వ్యక్తిగతంగా విచారణకి హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది.

Tags:    

Similar News