కొండారెడ్డిపల్లి ఘటనపై మహిళా కమిషన్ రియాక్షన్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు తమపై దాడి జరిగిందని మహిళా కమిషన్ ని ఆశ్రయించారు.

By :  Vanaja
Update: 2024-08-23 10:27 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు తమపై దాడి జరిగిందని మహిళా కమిషన్ ని ఆశ్రయించారు. స్పందించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నాగర్‌కర్నూల్ పోలీసులను నివేదిక కోరింది. కొండారెడ్డిపల్లె సంఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ ఎస్పీకి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నెరెళ్ల శారద లేఖ రాశారు. నిందితులపై తీసుకున్న చర్యలను పేర్కొంటూ నివేదిక ఇవ్వాలని తెలిపింది.

రైతు రుణమాఫీపై గ్రౌండ్ రిపోర్ట్ కి వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారన్న వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతోంది. సీఎం సొంత ఊరిలో ఈ వివాదం చెలరేగడంతో రాజకీయ విమర్శలకు తావిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు తమపై దాడి చేశారని యూట్యూబ్ ఛానళ్ల మహిళా జర్నలిస్టులు ఆవుల సరిత, విజయారెడ్డి ఆరోపించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా జర్నలిస్టులు శుక్రవారం తెలంగాణ మహిళా కమిషన్ కి, డీజీపీ జితేందర్ కి ఫిర్యాదు చేశారు.

మహిళా జర్నలిస్టులు తెలిపిన వివరాల ప్రకారం... రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పై జరుగుతోన్న ఆందోళనలపై న్యూస్ కవర్ చేసేందుకు వారిద్దరూ, తమ టీమ్ తో కలిసి కొండారెడ్డిపల్లి వెళ్లారు. అక్కడ జరుగుతోన్న ఆందోళనలు షూట్ చేస్తూ, స్థానికుల నుంచి బైట్స్ తీసుకోబోతుండగా కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మహిళా జర్నలిస్టులను చుట్టు ముట్టి, వారి ఫోన్లు, కెమెరాలు, కెమెరాలలో చిప్స్ లాక్కున్నారు. వారి నుండి తమ పరికరాలు లాక్కునేందుకు మహిళా జర్నలిస్టులు ప్రయత్నించగా పెనుగులాట జరిగింది. ఇక్కడివరకు కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ తర్వాత కెమెరాలలో అక్కడ ఏం జరిగిందో సరిగా రికార్డ్ అవలేదు. ఆ సమయంలో తమపై రేవంత్ అనుచరులు దాడి చేశారని, బురదలోకి నెట్టేశారని మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి ఆరోపిస్తున్నారు.

తెలంగాణలో మహిళా జర్నలిస్టులపై జరిగిన ఈ దాడిని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీరియస్‌గా తీసుకోవాలని మహిళా జర్నలిస్టులు కోరారు. అలాగే తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి, తెలంగాణ మహిళా కమిషన్ కి వినతి పత్రాలు అందజేశారు. వారి వినతిపై సానుకూలంగా స్పందించిన డీజీపీ, మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News