Telangana Weather Report | తెలంగాణలో తేలికపాటి వర్షాలు,పెరిగిన చలి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో ముసురు పట్టింది.

Update: 2024-12-26 12:12 GMT


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి, 1.5 కిలోమీటర్ల మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావం వల్ల తెలంగాణలోని హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం హైదరాబాద్ కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
- ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, తెలంగాణలో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.ఆగ్నేయం, తూర్పు నుంచి వీస్తున్న చలి గాలుల ప్రభావం వల్ల హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు.

తేలికపాటి వర్షాలు
హైదరాబాద్ నగరంతోపాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు, హన్మకొండ, జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతాావరణకేంద్రం అధికారులు చెప్పారు. హైదరాబాద్ నగరంలో ముసురుతోపాటు పొగమంచు ప్రభావం వల్ల చలి తీవ్రత పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి ఏ ధర్మరాజు చెప్పారు.

ఆవర్తనం ప్రభావంతో...
బుధవారం దక్షిణ ఆంధ్రప్రదేశ్,ఉత్తర తమిళనాడు తీరం వద్ద నైరుతి, దానికి ఆనుకొని ఉన్న పరిసర పశ్చిమ- మధ్య బంగాళాకాతంలో కొనసాగిన అల్ప పీడనం గురువారం ఉదయం 5.30గంటల సమయంలో బలహీనపడింది. సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం వల్ల గురువారం ఉదయం నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తున్నాయని అధికారులు చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు నేడు, రేపు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ధర్మరాజు వివరించారు. రాబోయే 5 రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే 5 రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందని ధర్మరాజు వివరించారు.

పిల్లలూ జాగ్రత్త
చలిగాలుల ప్రభావం వల్ల పిల్లల్లో న్యుమోనియా కేసుల సంఖ్య పెరిగింది. హైదరాబాద్ నగరంలో పిల్లలు న్యుమోనియాతో ఆసుపత్రులకు వస్తున్నారు. పొడి దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలు, కఫం, అలసటతో పిల్లలు బాధపడుతున్నారు. న్యుమోనియా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఐదేళ్ల లోపు పిల్లలకు టీకాలు వేయించాలని వైద్యనిపుణులు సూచించారు.


Tags:    

Similar News