‘‘తెలంగాణ మళ్లీ దారి తప్పింది’’
ప్రజలను సమాజాన్ని ముందుకు నడిపించాలనుకునే ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు, ఆయా పార్టీల నాయకులకు అన్ని విషయాలపై పెద్ద పండిత జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు కానీ..
ప్రజలను సమాజాన్ని ముందుకు నడిపించాలనుకునే ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు, ఆయా పార్టీల నాయకులకు అన్ని విషయాలపై పెద్ద పండిత జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు కానీ, కామన్ సెన్స్ మాత్రం దండిగా ఉండాలి. అలాగే ప్రభుత్వ పరిపాలన చేయడం వెంటనే రాకపోవచ్చు. కానీ, పర్యావరణ స్పృహ మాత్రం తప్పకుండా ఉండాలి. ఇవి రెండూ లోపిస్తేనే ప్రస్తుతం తెలంగాణ లో వరి ధాన్యానికి బోనస్ చుట్టూ జరుగుతున్న చర్చలు ముందుకు వస్తాయి.
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు, చట్టసభలకు ఐదేళ్ల కొకసారి జరిగే ఎన్నికలలో పోటీ పడితే వాటిలో నుండీ ఒక రాజకీయ పార్టీ ఎక్కువ స్థానాలు సాధించి అధికారం చేపడుతుంది. తక్కువ స్థానాలు సాధించిన మిగిలిన పార్టీలు ప్రతిపక్షంలో ఉంటాయి.
నిజానికి, రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశలో నడిపించడం, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ప్రభుత్వమూ, ప్రతిపక్షమూ కలసి పని చేయాలి. విభిన్న అంశాలపై ముందుకు వచ్చే సమస్యలను, అందరూ కలసి అన్ని కోణాలలో, సవ్యంగా చర్చించడం ద్వారా పరిష్కారాలను కనుక్కోవాలి. అప్పుడే ప్రజలకు, రాష్ట్రానికి నిజమైన మేలు జరుగుతుంది.
కానీ మన రాజకీయ పార్టీలు ఈ స్పృహను కోల్పోయాయి. ఒక అంశం పై అధికారంలో ఉన్నప్పుడు. ఒకలా, ప్రతిపక్షం లో ఉన్నపుడు మరోలా మాట్లాడడం వీరికి చాలా సహజ విషయంగా మారిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో వరి ధాన్యానికి బోనస్ చెల్లించే విషయంలో జరుగుతున్న చర్చలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి.
ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ ఇచ్చేటప్పుడు రాజకీయ పార్టీలకు నిజాయితీ, నిబద్ధత ఉండడం లేదు. ఇస్తున్న హామీలకు చట్ట బద్దత లేదు కనుక, హామీలను దండిగా ఇవ్వడం అన్ని పార్టీలకు అనవాయితీగా మారిపోయింది. వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లింపు. విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కూడా అన్ని కోణాలలో ఆలోచించి ఇచ్చిన హామీ కాదు. ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కి ఉండే పరిమితులు, వరి విస్తీర్ణం పెరిగితే వచ్చే పర్యావరణ సంక్షోభం దృష్ట్యా ఈ హామీ ఇచ్చే ముందు ఇంకా లోతుగా చర్చించి ఉండాల్సింది.
అప్పటి వరకూ తాము అధికారంలో ఉండి కొన్ని విధానాలు అమలు చేసిన రాజకీయ పార్టీలు కూడా. ప్రతిపక్షం లోకి రాగానే అవే విధానాలపై పూర్తి భిన్న మైన వైఖరితో మాట్లాడడం చూస్తున్నాం. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడం, రాజకీయ ప్రయోజనం పొందడం తప్ప నిజమైన ప్రజల సమస్యల పరిష్కారం ప్రతిపక్షాల దృష్టిలో లేదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వైఖరి దీనినే స్పష్టం చేస్తున్నది. వారి డిమాండ్ల లో ఉద్యమాలలో నిజాయితీ లేదు. చిత్త శుద్ది లేదు.
తెలంగాణలో వరి చుట్టూ ఉన్న ఒక్కో అంశాన్ని పరిశీలిద్దాం. వరికి గానీ, ఇతర పంటలకు గానీ బోనస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ?
రైతులు ఆర్ధికంగా అత్యంత బలహీనంగా, అసంఘటితంగా ఉండే శ్రమ జీవులు. తాము ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు వాళ్ళు ధర నిర్ణయించలేరు. మార్కెట్ లో స్వయంగా అమ్ముకోలేదు. ఈ స్థితిని ఆసరా చేసుకుని వ్యాపారులు, దళారీలు, రిటైల్ కంపనీలు రైతుల ఉత్పత్తులకు అతి తక్కువ ధరలు చెల్లించి దోచుకుంటాయి. రైతుల దగ్గర నిల్వ సౌకర్యాలు కూడా ఉండవు కనుక ఇతర ప్రాంతాలకు తీసుకు వెళ్ళి అమ్ముకునే ఆర్థిక వెసులుబాటు ఉండదు కనుక అనివార్యంగా స్థానిక వ్యాపారులకే అమ్ముకుంటారు. ఇక్కడనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి దేశం లోనూ రైతుల విషయంలో ఇదే జరుగుతుంది.
అందుకే రైతుల ఆదాయలు మెరుగు పడాలంటే రైతుల ఉత్పత్తులకు సరైన ధరలు అందాలంటే ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. ఈ డిమాండ్ తో జరిగిన అనేక రైతు ఉద్యమాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా రైతులు పండించే, 23 పంటలకైనా కనీస మద్దతు ధరలను (MSP) ప్రకటిస్తున్నది. ప్రభుత్వ రంగంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలను (APMC) ఏర్పాటు చేసింది. ఆహార బధ్రతా చట్టం క్రింద ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ప్రతి సంవత్సరం బియ్యం, గోధుమల వంటి కొన్ని పంటలను సేకరిస్తున్నది.
అయితే, పంటలకు కనీస మద్దతు ధరలను ఏ ప్రాతిపదికన నిర్ణయించాలి? అనేది తీవ్రంగా చర్చలు జరిగిన అనంతరం అప్పటి UPA ప్రభుత్వం 2006 లో వ్యవసాయ శాస్త్రవేత్త ఎం. ఎస్. స్వామినాథన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వ్యవసాయ కమిషన్ ఇందుకు ఒక సూత్రాన్ని ప్రతిపాదించింది. రైతు చేసే సమగ్ర ఉత్పత్తి ఖర్చులకు (CZ) 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని (అంటే C2 +50 శాతం) సిఫారసు చేసింది.
ఈ సిఫారసును తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని 2014 లో బీజేపీ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టో లో ప్రకటించింది. కానీ గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ సిఫారసును అమలు చేయలేదు. పైగా పంటసాగు ఖర్చు (A2) కు కుటుంబ సభ్యుల శ్రమ విలువను కొంత జోడించి, దానికి కొంత లాభం కలిపి కనీస మద్దతు ధరలను ప్రకటించే తప్పుడు. సూత్రాన్ని (A2-FL - 50 శాతం) ముందుకు తెచ్చింది. గత పదేళ్లుగా ఈ సూత్రం ప్రకారమే ధరలను ప్రకటిస్తున్నది. ఫలితంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం కాకుండా, తప్పుడు సూత్రం ఆధారంగా ధరలను ప్రకటించడం వల్ల, దేశంలో రైతులు ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల కోట్లు నష్టపోతున్నారు. తెలంగాణ రైతులు గత పదేళ్ళలో రెండు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. ప్రతి రైతు ప్రతి సీజన్ లో ఎకరానికి 15,000 రూపాయలు నష్టపోతున్నాడు.
ఉదాహరణకు 2023-2024 సంవత్సరానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం క్వింటాలు వరి ధాన్యానికి 2886.50 రూపాయలు ధర ప్రకటించాలి. కానీ సాధారణ వరి ధాన్యానికి 2186 రూపాయలు A గ్రేడ్ ధాన్యానికి 2203 రూపాయలు ధర ప్రకటించారు. అంటే ప్రతి క్వింటాలు ధాన్యానికి కనీసం 663.50 రూపాయలు తక్కువ అన్నమాట, ఎకరానికి 25 క్వింటాళ్లు పండుతాయనుకుంటే రైతుకు ఎకరానికి 16,587 రూపాయల నికర నష్టం అన్నమాట.
2023-2024 సంవత్సరానికి CACP సంస్థ వేస్తున్నజాతీయ సగటు ఉత్పత్తి ఖర్చులు - కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఒక క్వింటాలుపై రైతుకు నష్టం
పంట | ప్రస్తుతం కేంద్రం ప్రాతిపదికగా తీసుకుంటున్న ఉత్పత్తి ఖర్చు ప్రస్తుతం కేంద్రం (A2 +FL) | ప్రాతిపదికగా తీసుకోవాల్సిన సమగ్ర ఉత్పత్తి ఖర్చుక | స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం (C2+50 ) ప్రకటించాల్సిన MSP (క్వింటాలుకు) | కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) కివంటాలుకు | తేడా ప్రతి క్లింటాలుకు రూపాయల్లో మోదీ విధానం వల్ల రైతుకు నష్టం |
వరి (ఖరీఫ్) | 1455 | 1911 | 2866 | 2203 | 663 |
జొన్న | 2120 | 2833 | 4249 | 3225 | 1024 |
సజ్జ | 1371 | 1811 | 2716 | 2500 | 216 |
మొక్కజొన్న | 1394 | 1797 | 2695 | 2090 | 605 |
రాగి | 2564 | 3328 | 4992 | 3846 | 1146 |
కంది | 4444 | 5993 | 8989 | 7000 | 1989 |
పెసర | 5705 | 7218 | 10827 | 8558 | 2269 |
మినుము | 4592 | 6239 | 9358 | 6950 | 2408 |
వేరు శెనగ | 4251 | 5350 | 7975 | 6377 | 1598 |
సోయాబీన్ | 3029 | 4019 | 6028 | 4600 | 1428 |
పొద్దుతిరుగుడు | 4505 | 5960 | 8940 | 6760 | 2180 |
నువ్వులు | 5755 | 7864 | 11, 846 | 8635 | 3211 |
పత్తి | 4411 | 5786 | 8679 | 7020(LS) | 1659 |
శనగ | 3400 | 4547 | 6820 | 5440 | 1380 |
గోధుమ | 1128 | 1652 | 2478 | 2275 | 203 |
కుసుము | 3807 | 5414 | 8121 | 5800 | 2324 |
ఆధారం: CACP 2023-2024 ఖరీఫ్, రబీ నివేదికలు
ప్రభుత్వం ఆయా పంటలను కనీస మద్దతు ధరకు సేకరించినపుడు కూడా జరిగే నష్టం ఇది. ప్రభుత్వం సేకరించకపోతే, వ్యాపారులు, దళారీలు రైతులకు కనీసం కనీస మద్దతు ధరలను కూడా చెల్లించరు. అప్పుడు రైతులు మరింత నష్టపోతారు.
రేవంత్ సర్కార్ అన్ని వద్దకు కాకుండా, కేవలం సన్నాలకే 500 రూపాయల బోనస్ ఇచ్చి మోసం చేస్తుందని గగ్గోలు పెడుతున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తమ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాపితంగా గత పదేళ్లుగా మద్దతు ధరల విషయంలో రైతులకు చేస్తున్న ద్రోహం గురించి ఒక్క మాట మాట్లాడడు. రైతు సంఘాలు అడిగితే జవాబు చెప్పడు.
ఆధారం: 2023-2024 CACP నివేదికలు ,2023 ఖర్టఫ్ వయవస్తయ శాఖ వీకీల రిపోర్ీ (27.09.2023 )
1. కేంద్రంలో ఉండే ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తే రైతులకు ఏ నష్టం ఉండదు. కానీ కేంద్రం అలా బాధ్యత తీసుకోవడం లేదు కనుక, రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులకు బోన్స్ ఇవ్వాలని ఆలోచించడం తప్పు కాదు..
2. అయితే కేవలం వరికే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పంటలు పండించే రైతులు నష్టపోకుండా ఆయా పంటలకు కూడా బోనస్ ప్రకటిస్తే, మిగిలిన రైతులు కూడా నష్టపోకుండా ఉంటారు. అయితే బడ్జెట్ కొంత పెరుగుతుంది..
3. అందుకు బడ్జెట్ సహకరిస్తుందా అన్నది ప్రశ్న 2024 ఖరీఫ్ సీజన్ నుండీ ఎకరానికి ప్రతి సీజన్ లో 7,500 రూపాయలు రైతు భరోసా సహాయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ రైతు భరోసా సహాయం ప్రధానంగా భూ యాజమానులకు ఇస్తున్నారు. వాటిలో వేల కోట్లు వృధా అవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఈ పెట్టుబడి సహాయాన్ని సాగు చేయని రైతులకు కూడా ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి.
4. నిజంగా సాగు చేసే రైతులకు ప్రభుత్వం సహాయం చేయాలంటే, రైతు భరోసా కాకుండా, పంట ధరపై బోనస్ రూపంలో చెల్లిస్తే ఎక్కువ ఉపయోగమని, అనేకమంది రైతులు కూడా భావిస్తున్నారు. ఎక్కువ భాగం రైతు సంఘాల అభిప్రాయం కూడా ఇదే రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న కౌలు రైతులను గుర్తించి సహాయం చేయడానికి అనేక ప్రశ్నలు
ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు కూడా ఒక మేరకు ధర బోనస్ రూపంలో సహాయం చేయడం మార్గాన్ని సులువు చేయవచ్చు. ఇందులో ఉండే లాభ నష్టాలను, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోణాలలో ఆలోచించి, నిర్ణయం తీసుకోవాల్సిన విషయం ఇది.
ఆధారం: 2023-2024 CACP నివేదికలు ,2023-2024 వయవస్తయ శాఖ రబీ వీకీల రిపోర్ీ (మే .2024)
కేరళ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు వరి రైతులకు చెల్లిస్తున్న అదనపు ధర - కారణాలు
కేరళ వరి బోనస్ కథ:
కేరళ రాష్ట్ర జనాభా మూడు కోట్ల ముప్పై లక్షల మంది: కేరళ మొత్తం సాగు భూమి 25.69 లక్షల హెక్టార్లు. కాగా, కేవలం 202 లక్షల హెక్టార్లలో (7.69 శాతం) మాత్రమే వరి సాగు చేస్తున్నారు. 2,50,000 మంది వరి రైతులున్నారు. కేరళ వరి సాగులో కూలీల ఖర్చు ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు గిట్టుబాటు కాకపోవడంతో వరి రైతులు పైనాపిల్ సాగు వైపు మళుతున్నారు. 2001-2002 లో కేరళ లో 3.22 లక్షల హెక్టార్లలో వరి సాగు కాగా, 2021-2022 నాటికి అది 1.95 లక్షల హెక్టార్లకు పడిపోయింది. ఇదే కాలంలో ధాన్యం ఉత్పత్తి కూడా 703 లక్షల టన్నుల నుండీ 5.62 లక్షల టన్నులకు పడిపోయింది. అందుకే కేరళ తన బియ్యం అవసరాల కోసం పంజాబ్ తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల పై ఆధార పడవలసి వస్తున్నది.
ఈ ప్రత్యేక పరిస్థితిని అధిగమించడానికి, కేరళ రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులకు ఇన్ పుట్ సహాయంగా హెక్టారుకు 5500 రూపాయలు సహాయం చేస్తున్నది. ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది. వరి ఉత్పత్తి బోనస్ గా హెక్టారుకు 1000 రూపాయలు అదనంగా అందిస్తున్నది. వరి భూములను కాపాడుతున్నందుకు భూ యజమానులకు హెక్టారుకు 3000 రూపాయలు అందిస్తున్నది. స్థానిక గ్రామ పంచాయితీలు, సహకార సంఘాలు ప్రతి వరి రైతుకూ హెక్టారుకు మరో 25,000 రూపాయల సహాయం అందిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి పెంచడానికి పడుతున్న పాటు ఇవి.
ఛత్తీస్ ఘడ్ వరి బోనస్ కథ:
2013-2014 లో అప్పటి బీజేపీ ప్రభుత్వం మొదటిసారి క్వింటాలు వరి ధాన్యానికి 300 రూపాయల బోనస్ ప్రకటించింది. రెండు సంవత్సరాలు అమలు చేసి మానేశారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అప్పటికి ఉన్న కనీస మద్దతు ధరతో సంబంధం లేకుండా క్వింటాలుకు 2500 రూపాయలు ధర చెల్లిస్తానని హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చింది. ఐదేళ్లు అమలు చేసింది. ఈ పరిణామంతో 2017-2018 లో 15.77,332 మంది వరి రైతులు ఉండగా, వారి సంఖ్య 2022 2023 నాటికి 25,93,000 మందికి పెరిగిపోయింది. 2017-2018 లో వరి సాగు విస్తీర్ణం 24,46,000 హెక్టార్లు. కాగా, 2022 2023 నాటికి ఈ విస్తీర్ణం 31,17,000 హెక్టార్లకు పెరిగిపోయింది. 2017-2018 లో ప్రభుత్వ ధాన్యం సేకరణ 56,88,347 టన్నులు కాగా, 2022-2023 నాటికి సేకరణ 1,07,51,858 టన్నులకు పెరిగిపోయింది.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఓడించి ఎలాగైనా అధికారంలోకి రావాలని పథకం వేసిన బీజేపీ పార్టీ, 2023 డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో కనీస మద్దతు ధరతో సంబంధం లేకుండా క్వింటాలు వరి ధాన్యానికి 3100 రూపాయలు ధర చెల్లిస్తానని ప్రకటించింది. అంటే కనీస మద్దతు ధర (2213 /-) కంటి క్వింటాలుకు 917 రూపాయలు ఎక్కువ చెత్తీస్ ఘడ్ లో ఎకరానికి 35 నుండి 40 క్వింటాళ్ల ధాన్యం పండుతుంది. అయితే రైతుకు ఎంత పండినా, ఎకరానికి 21 క్వింటాళ్లు మాత్రమే ఈ ధరతో కొంటానని ప్రభుత్వం రైతుకు చెప్పింది. మిగిలిన ధాన్యాన్ని రైతు వ్యాపారులకు అమ్ముకోవాలి. ప్రభుత్వ హామీ ఫలితంగా ఎకరానికి రైతుకు 19,257 అదనపు ఆదాయం వస్తుంది.
క్వింటాలుకు 3700 రూపాయల ధరతో ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం 2023 నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 4 లోపు ఖరీఫ్ సీజన్ లో 1,47,00,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కానీ దీని దుష్పరిణామాలు కూడా అప్పుడే కనిపిస్తున్నాయి. రైతులు చిరు ధాన్యాలు సహా, అన్ని పంటలూ మానేసి వరి మాత్రమే వేస్తున్నారు. ఫలితంగా పర్యావరణ పరమైన సమస్యలు కూడా ఆ రాష్ట్రంలో ముందుకు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు.
ఇది ఒక రకంగా ఆ రాష్ట్ర వరి రైతులకు లాభం చేసిన మాట నిజమే కానీ, చిత్తీస్ ఘడ్ లో అమలు చేసిన దానిని దేశమంతా బీజేపీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో, కనీసం తాను అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా ఎందుకు అమలు చేయడం లేదో, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ధర చెల్లించాలని అడిగిన రైతులను ఎందుకు కాల్చి చంపిందో కూడా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించాలి.
అంటే ఆ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రాష్ట్ర బడ్జెట్ పై 13,000 కోట్ల రూపాయల అదనపు భారం పడినా (ఇందుకోసం అదనపు అప్పులు చేశారు.) అమలు చేస్తారు. మిగిలిన చోట్ల మౌనంగా ఉంటారు. దేశమంతా రైతులకు అన్యాయం చేస్తారు.
చత్తీస్ ఘడ్ లో అమలు చేసిన దానిని, దేశమంతా అమలు చేస్తామని 2024 లోక్ సభ ఎన్నికల బీజేపీ మానిఫెస్టో లో కూడా పెట్టలేదు. కానీ ఈ హామీని ఈ సారి కాంగ్రెస్ పార్టీ తన మానిఫెస్టోలో పెట్టింది. పైగా స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ప్రకటించే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది.
అవకాశవాదంతో కూడిన బీఆర్ఎ ఎస్ పార్టీ వైఖరి :
స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరలు ప్రకటించకుండా దేశ రైతులను మోడీ ప్రభుత్వం మోసం చేసింది. కానీ గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఒక్క సారి కూడా ఛత్తీస్ ఘడ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాల తరహాలో ఆలోచించలేదు. గత పదేళ్లుగా వరి రైతులకు కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్క రూపాయి కూడా బోసెస్ చెల్లించలేదు. ప్రతి సంవత్సరం స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ధర ఎంత చెల్లించాలో లెక్క చేసి కేంద్రానికి ఉత్తరం రాసి చేతులు దులుపుకునేది కానీ కేంద్రం ఉత్తరాన్ని పట్టించుకోకుండా పక్కన పడేస్తే, తాను ఈ రాష్ట్ర రైతులను ఆదుకోవడానికి ధర బోనస్ రూపంలో అదనంగా చెల్లించడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు మాత్రం రేవంత్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని గగ్గోలు పెడుతున్నది. ఇదంతా పచ్చి రాజకీయ అవకాశవాదం తప్ప మరొకటి
కాదు.
వరి రైతులకు బోనస్ ఇవ్వకపోయినా రైతు బంధు ఇచ్చాం అంటారేమో?
2018 ఖరీఫ్ నుండి KCR ప్రభుత్వం ఎకరానికి సీజన్ కు 5,000 రూపాయలు రైతు బంధు పెట్టుబడి సహాయం పథకాన్ని తీసుకు వచ్చింది. రైతుకు ఉపయోగపడే ఏ పథకాన్ని అయినా మనం స్వాగతించవచ్చు. కానీ ఈ పథకం పంట సాగు దారులకు కాకుండా భూముల యాజమానుల కోసం తెచ్చింది. ఒకవైపు రాష్ట్రంలో ఉన్న 22 లక్షల కౌలు రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి సహాయం కూడా అందలేదు. మరో వైపు వందల ఎకరాలు ఉన్న భూ యజమానులకు వాళ్ళు స్వయంగా వ్యవసాయం చేయకపోయినా, వేల కోట్లు దోచి పెట్టింది. అందువల్ల రైతు బంధు సహాయ పథకం నిజమైన సాగుదారులకు ధర రూపంలో అందో బోనస్ లాంటిది కాదు.
పైగా రైతు బంధు సహాయమందిస్తున్నాం అనే పేరుతో అన్ని సబ్సిడీ పథకాలను ఆపేశారు. విత్తన సబ్సిడీ యంత్రాల సబ్సిడి పంటల బీమా పథకం ప్రీమియం సబ్సిడీ, వంట రుణాల పై వడ్డీ రాయితీ సబ్సిడి, సూక్ష్మ నీటి పరికరాల సబ్సిడీ, ఉద్యాన పంటల రాయితీ పథకాలను నిలిపి వేసింది. కాబట్టి నిజమైన రైతుకు రైతు బంధు పథకం వల్ల అదనంగా అందిన ప్రయోజనమేమీ లేదు. ఒక వేళ ఎకరానికి అందిన 5,000 రూపాయల రైతు బంధు సహాయాన్ని ధర రూపంలో మార్చి చూసినా, వరి రైతుకు అందింది క్వింటాలుకు (ఎకరానికి 25 క్వింటాళ్ల లెక్కన) 200 రూపాయలు మాత్రమే. కానీ ప్రతి సీజన్ లో పంట కొను గోలు సమయంలో తేమ శాతం ఎక్కువ ఉంది అనే పేరుతో, మద్దతు ధరలో 10 శాతం కోత పెట్టడం వల్ల, ఈ ప్రయోజనం కూడా అంద కుండా పోయింది.
కేరళ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో కాకుండా ఇతర ఏ రాష్ట్రంలోనూ వరి పంటకు ప్రత్యేక బోనస్ అందించడం లేదు. రైతు సంఘాలు కూడా స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరలను ప్రకటించాలని, వాటికి చట్టబద్ధత కల్పించాలని అడుగుతున్నాయి. తప్ప ఒక రాష్ట్రంలో ప్రత్యేక బోనస్ ఇవ్వాలని ఎక్కువగా కోరడం లేదు. కారణం ఆయా రాష్ట్రాలకు ఉండే ఆర్థిక వనరుల పరిమితులు కేంద్రమే బాధ్యత తీసుకుంటే, పంటల సేకరణకు కేంద్రం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. అది రాష్ట్రాలపై భారాన్ని తగ్గిస్తుంది.
పైగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అక్కడి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వరి మానేసిన రైతులకు ఎకరానికి 7,500 రూపాయల సహాయం అందిస్తామని ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రం కూడా వరి నుండీ ఇతర పంటల వైపు రైతులను మళ్లించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. పంజాబ్ లో ఖరీఫ్ లో వరి, రబీలో గోధుమ మాత్రమే సాగు చేయడం వల్ల ఆ రాష్ట్ర భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఇతర అనేక పర్యావరణ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. నిజానికి తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం పంజాబ్, హర్యానా తరహా సమస్యలను ఎదుర్కుంటున్నది. కాబట్టి ఇక్కడి ప్రభుత్వాలు వరి నుండీ రైతులను ఇతర పంటల వైపు మళ్లించడానికి పూనుకోవలసిన సమయం ఇది.
తెలంగాణ మళ్ళీ దారి తప్పింది...
వరికి బోనస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ హామీ అనాలోచితమైనది అశాస్త్రీయమైనది:
ఎలాగైనా సరే, ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టాలని ఒక రాజకీయ పార్టీకి ఆశ ఉండవచ్చు కానీ, ఇందుకోసం అనాలోచిత, అశ్యాస్త్రీయ హామీలను ఇవ్వకూడదు. కాంగ్రెస్ పార్టీ ఆ తప్పు చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 2022 లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ లో వరికి బోనస్ ఇస్తామనే హామీని ఇవ్వలేదు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల మానిఫెస్టో లో అది చేరింది.
2020 నుండీ తెలంగాణ లో వరి పై చర్చ విస్తృతంగానే సాగుతూ వచ్చింది. KCR కూడా అనాలోచితంగా కోటి ఎకరాల మాగాణం పేరుతో రైతులను వరి వైపు నెట్టాడు, కాళేశ్వరం క్రింద నీళ్ళ ఉన్నాయి కనుక వరి వేయండి ధాన్యాన్ని అంతర్జాతీయ మార్కెట్ లో అమ్ముతాము అని కూడా హామీ ఇచ్చాడు. ఈ హామీ రాష్ట్రంలో వరి విస్తీర్ణం గణనీయంగా పెరగడానికి కారణమైంది.
ఈ విషయంలో మేము మొదటి నుండీ హెచ్చరిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా నాలుగు కారణాల రీత్యా రాష్ట్రంలో వరి విస్తీర్ణాన్ని తగ్గించుకోవాలని సూచిస్తూ వచ్చాం.
1. మన రాష్ట్రంలో సాగు నీరు గ్రావిటీ ద్వారా కాకుండా, ఎత్తిపోతల పథకాలు, బోర్లు, బావులు తదితర ఎక్కువ విద్యుత్ వినియోగించే వనరుల ద్వారా అందుతుంది కనుక, సాగు నీరు ఇక్కడ ఉచితం కాదు. పైగా అత్యంత ఖరీదైనది. కాబట్టి ఖరీదైన నీళ్ళు వాడి వరి సాగు చేస్తే ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతాయి. (ఉచిత విద్యుత్ బిల్లులు ప్రభుత్వం కట్టినా సరే, ఆ డబ్బులు ప్రజలవే), కాబట్టి ఇప్పుడున్న కనీస మద్దతు ధరలతో వరి సేద్యం రాష్ట్రానికి గిట్టుబాటు కాదు.
2. కిలో బియ్యం ఉత్పత్తికి 5000 లీటర్ల నీరు అవసరం కాబట్టి, అంత ఖరీదైన నీళ్ళు వాడి, వరి పండించి, తక్కువ ధరలకు వ్యాపారులకు ధాన్యం అమ్మడం, విదేశాలకు బియ్యం ఎగుమతి చేయడం రాష్ట్ర నిధులను దుబారా చేయడమే.
3. వరి ధాన్యం ఉత్పత్తిలో రసాయనాల వినియోగం చాలా ఎక్కువ ముఖ్యంగా రసాయన ఎరువుల వినియోగం వల్ల, వరి పండే అన్ని ప్రాంతాలలో ఉద్గార వాయువులు భారీగా వెలువడతాయి. ముఖ్యంగా ఈ వాయువులలో కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రోజెన్ అక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ లాంటివి మనుషుల ప్రాణాలకు ముప్పు తెస్తాయి. వీటిలో కొన్ని నేరుగా క్యాన్సర్ కారకాలు కూడా పైగా పంట వ్యర్థాల పేరుతో గడ్డి తగలేయడం వల్ల కూడా కాలుష్యం పెరుగుతుంది. భూమి స్వభావం మారిపోతుంది. అవసరమైన సూక్ష్మ జీవులు చచ్చిపోతాయి. భూమి గట్టిపడి నీళ్ళు పీల్చుకునే స్వభావం కోల్పోతుంది. పురుగు విషాలు సృష్టించే విధ్వంసం ఎలాగూ ఉంటుంది.
4. కేవలం పత్తి, వరి విస్తీర్ణం పెరగడం వల్ల పంటల వైవిధ్యం తగ్గిపోయి మోనో క్రాపింగ్ అవుతుంది. ఇప్పటికీ రాష్ట్రానికి అవసరమైన పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలు కూరగాయల సాగు గణనీయంగా పడిపోయింది. వరికి మరింత ప్రోత్సాహం లభిస్తే, మిగిలిన వంటలు రాష్ట్ర భూభాగం నుండి పూర్తిగా మాయమై పోతాయి..
కానీ విషాదం ఏమంటే, ఇవేవీ పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ, అనాలోచితంగా, తొందరపాటుతో వర్తి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఈ హామీ పూర్తి స్థాయిలో అమలయితే రాష్ట్ర వ్యవసాయం మరింత దారుణ స్థితిలోకి వెళ్ళిపోతుంది..
ఈ సీజన్ నుండి రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఎకరానికి సుమారు మరో 12,000 రూపాయలు ఎకరానికి 24 క్వింటాళ్లు అనుకుంటే) సన్న ధాన్యం పై బోనస్ చెల్లించడం కోసం కేంద్రం సహకరించకపోతే, రాష్ట్ర ఖజానా పై తప్పకుండా భారమే అవుతుంది. ఉచిత విద్యుత్ పంటల బీమా, రైతు బీమా పథకాలకు అదనపు ఖర్చులు ఎలాగూ ఉంటాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సాధారణ స్థితిలో ఉంటే, ఇవన్నీ సాధ్యమే అవుతాయి. కానీ KCR సర్కార్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో దించింది. ఇప్పటికీ అనేక రంగాలలో ఆ ప్రభుత్వం వదిలేసి పోయిన వేల కోట్ల రూపాయల పాత బకాయిలు ఉన్నాయి. ఆర్థిక మంత్రి గా పని చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించిన హరీష్ రావు లాంటి వాళ్ళు ఇవేవీ మాట్లాడకుండా, బోసెస్ మొత్తం ధాన్యానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇది వారిలో నిండి ఉన్న హిపోక్రసీ మాత్రమే..
ప్రస్తుతం రేవంత్ సర్కార్, 2024 ఖరీఫ్ నుండి సన్నాలకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించింది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఒక రకంగా ఇది మంచి నిర్ణయమే ఇందుకు అనుగుణంగా భారత ఆహార సంస్థతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు కొన్ని చేపట్టాలి.
1. మన రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ఇతర ఆహార సబ్సిడీ పథకాలకు సన్న ధాన్యం ఉత్పత్తికి మొదట సాగు ప్రణాళిక చేసుకోవాలి. కనీస మద్దతు ధరపై 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
2. రాష్ట్రంలో మార్కెట్ అవసరాలకు వ్యాపారులు ఎలాగూ ఖరీఫ్ లో సన్న ధాన్యాన్ని కొంటారు.. ప్రభుత్వం కూడా కొనుగోలు దారుగా మార్కెట్ లో ఉంటుంది కనుక, వ్యాపారులు పోటీ పడి. అనివార్యంగా రైతులకు ఎక్కువ ధర చెల్లిస్తారు.
3. కేంద్రం ఖరీఫ్ లో అడిగిన టెవీ ధాన్యం కోటాను బట్టి మిగిలిన సాగు విస్తీర్ణాన్ని ప్లాన్ చేసుకోవాలి. మన రాష్ట్ర ప్రజలు ఎవరూ తినని దొడ్డు బియ్యం వెరైటీ ల ధాన్యం సాగు విస్తీర్ణాన్ని వీలైనంత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి కేంద్రం లెవీ క్రింద దొడ్డు బియ్యం (పారా బాయిల్డ్ కాకుండా) తీసుకుంటాను అని హామీ ఇస్తే మాత్రమే, ఆ మేరకు రాష్ట్రంలో సాగయిన దొడ్డు ధాన్యాన్ని కూడా సేకరించాలి. అయితే ఇతర రాష్ట్రాల ప్రజల అవసరాల కోసం చేస్తున్న ఈ ధాన్యం కొనుగోలుకు భారత ఆహార సంస్థ కనీస మద్దతు ధరపై అదనంగా క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని రాష్ట్రం డిమాండ్ చేయాలి. అది దొడ్డు దాన్యం మాత్రమే పండించే రైతులకు కూడా మేలు చేస్తుంది.
4. రెండు సీజన్ లలోనూ వివిధ సాగు నీటి ప్రాజెక్టుల పరిధిలో, గ్రావిటీ క్రింద వరి విస్తీర్ణాన్ని ప్రణాళిక చేస్తే ఉత్పత్తి ఖర్చు తక్కువ అవుతుంది. అనివార్యమైన స్థితిలో మాత్రమే బోర్లు, బావుల క్రింద వరి సాగుకు వెళ్ళాలి. పంజాబ్ కూడా ఆ వైపు ఆలోచిస్తున్నది.
5. కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యలను ఎదుర్కుంటున్న కారణంగా ప్రణాళికలను ఉపసంహరించుకోవాలి..
ఆధారం: FCI ప్రొక్యూర్ మెంట్ నివేదికలు
1. గత నాలుగేళ్లుగా పంజాబ్ తరువాత తెలంగాణ ధాన్యం సేకరణలో రెండవ స్థానంలో ఉంది. కానీ ఈ సంవత్సరం బీజేపీ పాలిత చత్తీస్ ఘడ్ రెండవ స్థానాన్ని ఆక్రమించింది.
2. అయితే ధాన్యం మిల్లింగ్ లో అవకతవకలు, అవినీతి కారణంగా, ఇందులో ఆనాటి అధికార బీఆర్ఎస్ నాయకుల పాత్ర కారణంగా రాష్ట్రం నుండీ ప్రతి సంవత్సరం FCI బియ్యం సరఫరా సరిగా జరగడం లేదు.
3. ఈ కారణంగా FCI నుండి రాష్ట్రానికి సరిగా డబ్బులు రావడం లేదు. ఫలితంగా ధాన్యం సేకరిస్తున్న పౌరసరఫరాల శాఖ వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిల్ కూరుకుపోవడమే కాక కొన్ని వేల కోట్లు నష్ట పోయింది కూడా.
4. ఇంత కాలం రాష్ట్రంలో పండిన దొడ్లు ధాన్యం ప్రధానంగా పార్ బాయిల్ చేస్తూ వచ్చారు. రైతులు కూడా ఆ ధాన్యం సాగుకు అలవాటు పడ్డారు. సన్న ధాన్యం కంటే ఎకరానికి సగటు దిగుబడులు ఎక్కువ ఉండడం, తెగుళ్లు తక్కువ ఉండడం కూడా దౌడ్డు ధాన్యం సాగు పెరగడానికి మరో కారణం. ఇకపై తెలంగాణ నుండీ పార్ బాయిల్ బియ్యం తాను సేకరించలేనని FCI ఇప్పటికే అనేక సార్లు చెప్పి ఉంది. ఇప్పుడు ఆ ధాన్యం సేకరణకు FC సిద్ధం కాకపోతే, రాష్ట్ర ప్రభుత్వం సేకరించినా నపుమే
5. కాబట్టి రైతులతో చర్చించి, నచ్చ చెప్పి, రబీలో ధాన్యం సాగు నుండీ రైతులను ఇతర పంటల వైపు మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టి పని చేయాలి. అడవి జంతువుల బెడద సహా, ఇతర పంటలు సాగు చేయడానికి ఉన్న ఆటంకాలను తొలగించాలి.
6. ఆయా పంటలకు నాణ్యమైన విత్తనాలను రైతులకు ఉచితంగా అందించాలి. ఇతర వంటలు వేస్తే, ఆయా పంటలను రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తుందని ప్రకటించాలి. మార్క్ ఫెడ్ విజయ్ ఆయిల్ కార్పొరేషన్ లాంటి సంస్థల ఆధ్వర్యంలో, రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి దారుల కంపెనీల ద్వారా రైతుల నుండి ఆయా పంటలను సేకరించాలి.
7. సహకార సంఘాల ఆధ్వర్యంలోనే ఆయా వంటల ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి స్థానికంగా ఉపాధి కల్పించాలి. నిల్వ కోసం క్లస్టర్ స్థాయిలో స్థానికంగా గిడ్డంగులను నెలకొల్పాలి.
8 రాష్ట్ర సమగ్ర వ్యవసాయ విధానం తయారు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలి. కొంత బోల్డ్ గా ఆలోచించి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతిపక్ష పార్టీల విమర్శల ఒత్తిడికి కొట్టుకుపోకుండా, రైతుల పక్షాన నిలబడి దీర్ఘ కాలిక దృష్టితో ఆలోచించాలి.
9. రైతు కమిషన్ నియమించి, రాష్ట్ర రైతు సమస్యలను సమగ్రంగా లోతుగా చర్చించాలి... ఇచ్చిన హామీల అమలుకు నిధులు సమీకరించుకుంటూనే, నిధులు దుబారా జరగకుండా వాస్తవ సాగుదారులకు మేలు జరిగేలా, తగిన మార్గదర్శకాలు తయారు చేయాలి.
10. ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికలలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుంది. ఈ కూటమి హామీ ఇచ్చిన విధంగా స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరలను ప్రకటించినా, ప్రకటించిన కనీస మద్దతు ధరలకు చట్టబద్దత కల్పించినా ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పై భారం తగ్గుతుంది. రైతులకు అదనపు ఆదాయం వస్తుంది.
11. ఒక వేళ మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే వస్తే రాష్ట్రంపై ఆర్థిక భారం చాలా కాలం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం హామీలు అమలు చేయడానికి రాష్ట్రానికి సహకరించదు కానీ, హామీలు అమలు చేయడం లేదని, ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోయడానికి బిజేపీ BRS పార్టీలు సిద్ధం అవుతాయి. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కూడా పూనుకుంటాయి. రాష్ట్రం లోనూ మళ్ళీ ఉమ్మడిగా ఫాసిస్టు పాలన నెలకొల్పడానికి చూస్తాయి. తస్మాత్ జాగ్రత్త!