27 ఏళ్లగా సాగుతున్న జవహర్ నగర్ వాసుల కాలుష్య వ్యతిరేక పోరాటం

జవహర్ నగర్ ముక్కు మూసుకుంటే, అధికారులు కళ్లు మూసుకున్నారు

Update: 2025-10-25 06:15 GMT
హైదరాబాబాద్ డంపింగ్ యార్డును తరలించాలని డిమాండు చేస్తూ జవహర్ నగర్ డంపింగ్ యార్డు రీమూవల్ పీపుల్స్ ఫోరం చేస్తున్న ధర్నా(ఫైల్ ఫొటో)

(జవహర్ నగర్ డంపింగ్ యార్డు బాధిత గ్రామాల నుంచి ఫెడరల్ తెలంగాణ ప్రతినిధి సలీం షేక్)

జవహర్ నగర్ డంపింగ్ యార్డు (JawaharNagar Dumping Yard)వల్ల రోజు వందల ట్రక్కుల చెత్తతో 15లక్షల మంది ప్రజల జీవితం కాలుష్య కాసారంగా(Pollution) మారిందని దీన్ని ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ గత 27 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. జవహర్ నగర్ కాలుష్య పీడిత గ్రామాల్లో పర్యటించిన ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధికి   27 ఏళ్ల ఫలించని పోరాటం, ప్రస్థుతం ప్రజలు పడుతున్న అవస్థలు కనిపించాయి.

“హైదరాబాద్ నుంచి 9వేల టన్నుల డంప్ —జవహర్ నగర్ వాసులకు వాసన, వాయు, నీటి కాలుష్యానికి కారణం” అంటూ దీన్ని తరలించాలని డిమాండ్ చేస్తూ జవహర్ నగర్ డంపింగ్ యార్డు రీమూవల్ పీపుల్స్ ఫోరం ఏర్పాటు అయింది. ఈ ఫోరం ఆధ్వర్యంలో కాలనీల్లో పాదయాత్రలు చేశారు. ఈ ప్రాంత గాలి కాలుష్యం పోవాలంటే శాశ్వతంగా డంపింగ్ యార్డును మూసివేయాలి చీర్యాల లక్ష్మినరసింహ స్వామి దేవాలయంలో పూజలు చేసి ఇంటింటా బాధితులందరినీ సమీకరించి ఏకీకరణ పాదయాత్ర చేశారు. రాంకీ సంస్థపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ ఉద్యమం ఉధృతం చేసి మంచినీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు.డంపింగ్ యార్డును తరలించాలనే ఎన్జీటీ ఆదేశాలు పాటించాలని, ఈ ప్రాంత బాధితులకు ఉచిత వైద్యం, మంచినీరు అందించాలని కోరుతూ దమ్మాయిగూడ మున్సిపాలిటీ ముందు ఆందోళన చేశారు.




 జేఏసీ ఆధ్వర్యంలో ఏకీకరణ పాదయాత్ర

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ రీమూవల్ పీపుల్స్ ఫోరం జేఏసీ ఆధ్వర్యంలో ఏకీకరణ పాదయాత్ర చేశారు. ‘‘మనం ముందుకు వస్తేనే చెత్త లారీలు వెనక్కి పోతాయి, ఇంకెన్నాళ్లు భరిద్దాం దుర్గంధాన్ని? మనం మన పిల్లలకు కాలుష్యాన్ని కానుకగా ఇద్దామా? ఎదిరిద్దాం నిలిపేద్దాం ఈ కంపును’’ అంటూ జేఏసీ నాయకులు డంపింగ్ యార్డు పీడిత గ్రామాల్లో పాదయాత్రలు చేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డును శాశ్వతంగా మూసివేయాలంటూ డంపింగ్ యార్డు బాధితుల సంఘం ప్రతినిధులు హైదరాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష చేశారు. డంప్ యార్డ్‌ను మూడు ప్రత్యామ్నాయ ప్రదేశాలకు మారుస్తామని మూడు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిరసనకారులు గుర్తు చేశారు. పటాన్‌చెరు మండలంలోని లక్డారం గ్రామం, గుమ్మడిదల మండలంలోని ప్యారానగర్ గ్రామం ,రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెత్తను తరలించాలని నిర్ణయించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని జవహర్ నగర్ డంపింగ్ యార్డు రీమూవల్ పీపుల్స్ ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సమస్యతో తాము సంవత్సరాలుగా పోరాడుతున్నప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీనివెనుక చెత్త మాఫియా హస్తం ఉందని జవహర్ నగర్ డంపింగ్ యార్డు రీమూవల్ పీపుల్స్ ఫోరం ప్రతినిధి సందీప్ ఆరోపించారు.



 చెత్త లారీలు ప్రుధానరహదారి గుండా రానీయొద్దు : బీజేపీ నేతల తాజా వినతి

జవహర్ నగర్ లోని బాలాజీ నగర్ ప్రధాన రహదారి గుండా డంపింగ్ యార్డ్ చెత్త లారీలు రాకుండా, పోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ జీహెచ్ఎంసి(Greater Hyderabad Municipal Corporation)కమిషనర్ ఆర్వీ కర్ణన్ కు జవహార్ నగర్ బీజేపీ పశ్చిమ శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పందిస్తూ ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (శానిటేషన్ అండ్ ట్రాన్స్ పోర్ట్) సి.ఎన్.రఘు ప్రసాద్ కు సూచించారు. మున్సిపల్ అధికారులను కలిసిన వారిలో రాష్ట్ర బీజేవైఎం నాయకులు సంతోష్ గుప్తా, జిల్లా బిజెపి కార్యదర్శి కుర్ర పుణ్యరాజు, బీజేవైఎం రామ్ నాయక్, ప్రధాన కార్యదర్శి వేపుల సన్నీ, ఎస్టీ మోర్చా అధ్యక్షులు రాజు నాయక్ ఉన్నారు.జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యను వెంటనే పరిష్కరించాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రంగుల శంకర్ నేత డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రే డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాలి
ప్రస్థుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నపుడు జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలించాలని ఉద్యమించారని, కానీ ప్రస్థుతం ముఖ్యమంత్రి అయినా ఈ సమస్యను పరిష్కరించడం లేదని జవహర్ నగర్ డంపింగ్ యార్డు రీమూవల్ పీపుల్స్ ఫోరం ప్రతినిధి కేతేపల్లి పద్మాచారి ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయం లో జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై ఉద్యమం ఛేసినా, అధికారం లోకి వచ్చాక ఈ సమస్యను విస్మరించారని ఆయన చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.



 డంపింగ్ యార్డు తరలించమన్న కలెక్టర్ లేఖ కూడా చెత్త బుట్టలో...

జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల వాయు, నీటి కాలుష్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై 2009 జనవరి 6వతేదీన అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం దానకిషోర్ స్పందించారు. జవహర్ నగర్ పరిసర గ్రామాల్లో కాలుష్య సమస్యను నివారించేందుకు వీలుగా వెంటనే డంపింగ్ యార్డును ఈ ప్రాంతం నుంచి మార్చాలని కోరుతూ ఎం దానకిషోర్ అప్పటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్ ఎస్పీ సింగ్ కు డీఓ లెటర్ నంబరు 81 ఎంఎస్ డబ్ల్యూ పీసీబీ ఆర్ఓఆర్ 11 తో 2009 జనవరి 6వతేదీన లేఖ రాశారు. సాక్షాత్తూ అప్పటి జిల్లా కలెక్టర్ డంపింగ్ యార్డు మార్చాలని రాసిన లేఖను కూడా జీహెచ్ఎంసీ అధికారులు చెత్త బుట్ట దాఖలా చేశారు.హైదరాబాద్ నగరంలోని చెత్తను జవహర్ నగర్ లో డంపింగ్ చేయడం వల్ల ఈ ప్రాంతంలో గాలి, నీరు కలుషితమవుతుందని, దీనిపై ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని,ప్రజలు ఉద్యమిస్తున్న నేపథ్యంలో డంపింగ్ యార్డును వెంటనే ఇక్కడి నుంచి మార్చాలని కలెక్టరు లేఖలో జీహెచ్ఎంసీ కమిషనరును కోరారు.

జవహర్ నగర్ ప్రాంతంలో భూగర్భజలాలు, గాలి కలుషితం
జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల ఈ పరిసర ప్రాంతంలో భూగర్భజలాలు, పలు చెరువుల్లోని నీరు కలుషితం అయిందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు జరిపిన పరీక్షల్లో తేలిందని అప్పటి కలెక్టర్ ఎం దాన కిషోర్ జీహెచ్ఎంసీకి రాసిన లేఖలో తెలిపారు. జవహర్ నగర్ ప్రాంత నివాస ప్రజల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ చెత్త డంపింగ్ యార్డును వెంటనే మార్చాలని కలెక్టర్ అధికారికంగా డీఓ లేఖ రాసినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేదు. రంగారెడ్డి జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశంలోనూ జవహర్ నగర్ డంపింగ్ యార్డును వెంటనే మార్చాలని కోరుతూ పెద్ద చర్చ జరిగిందని ఎం దానకిషోర్ ఆ లేఖలో పేర్కొన్నారు. డంవింగ్ యార్డు మార్చాలని లేఖ రాసిన అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టరు ఎం దానకిషోర్ పై బదిలీ వేటు వేశారు కానీ, డంపింగ్ యార్డును మాత్రం తరలించలేదు.

ప్రజలు పోరాడుతున్నారు... చెత్త పెరుగుతోంది...
జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించే చెత్త ఏ రోజుకారోజు పెరుగుతుండటంతో గాలి, నీటి కాలుష్యం కూడా పెరుగుతుంది. గత ఏడాది మే నెలలో జవహర్ నగర్ లో డంపింగ్ చేసిన చెత్త ఎంత అని జీహెచ్ఎంసీ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సూపరింటెండెంట్ ఇంజినీరును సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడగ్గా 2024 మే నెల 21 రోజుల్లో 1,67,561.04 చెత్తను డంపిగ్ యార్డుకు తరలించినట్లు అధకారికంగా సమాచారం ఇచ్చారు. గత ఏడాది మే 1వతేదీన 6,763.26 టన్నుల చెత్తను తరలించగా, 2024,మే21వ తేదీన 8,888.48 మెట్రిక్ టన్నులకు పెరిగిందని వెల్లడైంది. అంటే ఈ ఏడాది గతంలో కంటే అధిక చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారని వెల్లడైంది. చెత్త తరలింపు పెరగడం వల్ల కాలుష్యం ఘాటు కూడా పెరిగిదందని జవహర్ నగర్ డంపింగ్ యార్డు రీమూవల్ పీపుల్స్ ఫోరం కో కన్వీనర్ గోగుల రామకృష్ణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

జవహర్ నగర్ చెత్తతో లాభాలు, ప్రజలకు నష్టాలు
హైదరాబాద్ నగరంలోని చెత్తతో విద్యుత్ తయారీ, ఎరువు తయారు చేసుకునేందుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అతని సన్నిహితుడైన ప్రస్థుత వైఎస్ఆర్ సీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అయోధ్య రాంరెడ్డికి చెందిన రాంకీ రీ సస్టెనబులిటీ లిమిటెడ్ కు కాంట్రాక్టు అప్పగించింది. దీంతో రీ సస్టెనబులిటీ లిమిటెడ్ సంస్థ (గతంలో ఎంఎస్ రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్) డంపింగ్ యార్డు స్థలంలో రెండు వపర్ ప్లాంట్లను నిర్మించి, చెత్తను కాల్చి, ఈ ప్రాంత ప్రజలకు కలుషిత గాలిని అందిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి, సేంద్రీయ ఎరువు ఉత్పత్తి ద్వారా ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ చెత్త నుంచి లాభం పొందుతుంది. అయినా జీహెచ్ఎంసీ చెత్త టన్నుకు 1453 రూపాయలను కాంట్రాక్టు సంస్థకు చెల్లిస్తుంది. 2011 -2012 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు ప్రతీ ఏటా కాంట్రాక్టు సంస్థకు జీహెచ్ఎంసీ డబ్బు చెల్లిస్తూనే ఉందని నవోదయా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పాకాలపాటి శ్రీలేష్ సందీప్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

చెత్త ప్రాసెసింగ్ పేరిట రాంకీకి రూ.2,421 కోట్ల చెల్లింపు
గాలి, నీరు కలుషితానికి కారణమైన జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలించాలని ఈ ప్రాంత ప్రజలు గత 27 ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నా సర్కారు పట్టించుకోలేదు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ రాంకీ గ్రూపునకు రూ.76.53 కోట్లను చెల్లించింది. హైదరాబాద్ నగరం నుంచి తరలించిన చెత్త పెరుగుతున్న కొద్దీ ఆ సంస్థకు చెల్లించే డబ్బు కూడా పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ ఏకంగా రూ.529.79 కోట్లను చెల్లించిందని సమాచార హక్కు చట్టం ద్వారా జీహెచ్ఎంసీ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సూపరింటెండెంట్ ఇంజినీరు అందించిన సమాచారంలోనే వెల్లడైంది. అంటే గడచిన 13 ఏళ్లలో జీహెచ్ఎంసీ రాంకీ ఎన్వీరో సంస్థకు రూ.2,421.61 కోట్ల ను చెల్లించిందని ఆర్టీఐ ద్వారా సూపరింటెండెంట్ ఇంజినీరు ఇచ్చిన అధికారిక సమాచారమే తేటతెల్లం చేసిందని కార్మికనగర్ ప్రాంత నవోదయా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పాకాలపాటి శ్రీలేష్ సందీప్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఇప్పటికైనా డంపింగ్ యార్డును తరలించాలి...
ఇరవై ఏడేళ్లుగా జవహర్ నగర్ ప్రజలు తమ ఊపిరి కోసం, నీటి బొట్టుకోసం పోరాడుతున్నారు. ప్రభుత్వాలు మారాయి, హామీలు మారాయి, కానీ చెత్త మాత్రం అదే ఉంది .రోజురోజుకూ పెరిగిపోతోంది. చెత్తలోంచి విద్యుత్, ఎరువులు వస్తున్నాయేమో కానీ ప్రజల జీవితాలు మాత్రం నిశ్వాసం తీసుకునే హక్కుకూడా కోల్పోయాయి.పర్యావరణ న్యాయం కోసం, జీవన హక్కు కోసం, ప్రజలు చేస్తున్న పోరాటం ఇంకా కొనసాగుతోంది. డంపింగ్ యార్డు తరలింపే ఈ ప్రాంతానికి కొత్త ఊపిరి, కొత్త ఆశ. ప్రభుత్వం నిజంగా ప్రజల పక్షాన ఉందని నిరూపించుకోవాలంటే, ఇప్పుడే చర్యలు తీసుకొని డంపింగ్ యార్డును తరలించాలి.


Tags:    

Similar News