Telangana Tourism | విమానాశ్రయంలో తెలంగాణ ప‌ర్యాట‌క స‌మాచార కేంద్రం

హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ప‌ర్యాట‌క స‌మాచార కేంద్రాన్ని గురువారం పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.;

Update: 2024-12-19 13:02 GMT

దేశీయ‌, అంత‌ర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు తెలంగాణ ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ సరికొత్త ఆవిష్కరణలు శ్రీకారం చుడుతుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ తెలంగాణ పర్యాటక సమాచార కేంద్రాన్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు.

- ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పర్యాటక శాఖ చేపడుతున్న సంస్కరణలో భాగంగా పర్యాటకులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన వార‌స‌త్వ ప్ర‌దేశాలు, సుసంప‌న్న‌మైన సాంస్కృతిక వైవిధ్యం, అబ్బుర‌ప‌రిచే ప్ర‌కృతి దృశ్యాలను సంద‌ర్శించేందుకు వ‌చ్చే దేశీయ‌, విదేశీయ సంద‌ర్శ‌కుల‌ కోసం రాష్ట్రంలోని పర్యాటక ప్ర‌దేశాలు, హ‌రిత హోట‌ల్స్, టూర్ ప్యాకేజీలు, రిజర్వేషన్, వెళ్లే మార్గాలు వంటి సమాచారాన్ని అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు.కొత్త పర్యాటక పాలసీకి రూపకల్పన చేసిన ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఆరంభించింది.


ఈ స‌మాచార కేంద్రంలో ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 10 గంట‌ల వ‌ర‌కు సంద‌ర్శ‌కుల‌కు సేవ‌లు అందుబాటులో ఉంటాయని మంత్రి జూపల్లి చెప్పారు.ఇప్పటికే పర్యాటక సంస్థ బషీర్‌బాగ్‌, బేగంపేట టూరిజం ప్లాజా, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ యాత్రినివాస్‌, శిల్పారామంతో పాటు ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో సమాచార, రిజర్వేషన్‌ కేంద్రాలను నిర్వహిస్తోంది.ఈ కార్య‌క్ర‌మంలో ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ప‌టేల్ ర‌మేష్ రెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మెనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌కాష్ రెడ్డి, ప‌ర్యాట‌క శాఖ సంచాల‌కులు జెండగే హనుమంతు కొండిబా, జీఎంఆర్ సీఈవో ప్ర‌దీప్ ఫ‌ణిక్క‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.



Tags:    

Similar News