అసెంబ్లీలో తెలంగాణ తల్లి చర్చ.. సీఎం రేవంత్ ఏమన్నారంటే..

తెలంగాణ తల్లి రూపు రేఖలు, విగ్రహంపై రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఇందులో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.;

Update: 2024-12-09 08:23 GMT

తెలంగాణ తల్లి రూపు రేఖలు, విగ్రహంపై రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఇందులో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్ల పూర్తయినా అధికారంగా తెలంగాణ తల్లి రూపం ఆమోదం పొందకపోవడం దురదృష్టకరమన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలంగాణ గౌరవానికి చిహ్నంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని, కానీ కొందరికి ఇది నచ్చలేదని వివరించారు. తెలంగాణ తల్లి రూపం విషయంలో మేధావులు సూచించిన విధంగా రూపొందించామని చెప్పారు. తెలంగాణ మాతృమూర్తిని గౌరవించాలనే లక్ష్యంతోనే సచివాలయ ప్రాంగణంలో ఆ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని సంకల్పించుకున్నామని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలను రాజమాతల స్ఫూర్తితో కాకుండా.. చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్కల స్ఫూర్తితో రూపొందించామని చెప్పారు. ఈ విగ్రహం తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిరూపమన్నారు. తెలంగాణ తల్లి భావన కాదు, నాలుగు కోట్ల మంది భావోద్వేగమన్నారు. తెలంగాణ తల్లి పీఠంలోని నీలి రంగు.. కృష్ణ, గోదావరి నదులకు సంకేతమని, ఉద్యమం సమయంలో సబ్బండ వర్గాలను నడిపించింది తెలంగాణ తల్లి అని గుర్తు చేశారు.

‘‘మా ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే సొంత మాతృమూర్తిని చూసిన భావన కలుగుతుంది. ఈ విగ్రహం ద్వారా తెలంగాణ తల్లికి అధికారిక గుర్తింపు ఇస్తున్నాం. గడిచిన పదేల్లు తెలంగాణకు రాష్ట్ర గీతం లేకుండా పోయింది. ప్రజా ప్రభుత్వ ఏర్పడిన వెంటనే ఉద్యమం సమయంలో పౌరులను ముందుకు నడిపిన ‘జయ జయ హే తెలంగాణ’ గీతానికి రాష్ట్ర గీతంగా గుర్తించాం. తెలంగాణను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యం. చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి ఉండాలనే ఆ తల్లికి గుర్తింపు ఇస్తున్నాం’’ అని తెలిపారు.

‘‘ఆరు దశాబ్దాలుగా రకరకాల రూపాల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజలు తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆనాడు సోనియాగాంధీ ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ 9న ప్రకటించారు. అందుకే డిసెంబర్ 9కి ఎంతో ప్రాధాన్యత ఉంది. అధికారికంగా ఇప్పటి వరకు తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ప్రకటించలేదు...ప్రజల ఆకాంక్షలు గౌరవించలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యమ సందర్భంలో యువత గుండెలపై రాసుకున్న టీజీ అక్షరాలను వాహనాలకు పెట్టుకున్నాం. ఉద్యమ కాలంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని మన రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆమోదించకపోవడం దురదృష్టవకరం. తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వజ్ర వైఢూర్యాలతో, భుజకీర్తులు, కిరీటాలతో ఉండాలా? తల్లిలా ఉండాలా అని ప్రస్తావన వచ్చినప్పుడు. తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు సూచించారు. తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లిని చూసిన స్ఫురణ కలిగేలా బహుజనుల తెలంగాణ తల్లిని ఇవాళ ప్రతిష్ఠించుకోబోతున్నాం’’ అని పునరుద్ఘాటించారు.

‘‘నాలుగుకోట్ల తెలంగాణ సమాజమంతా ఏకమై ఇవాళ పండగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నాం. దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదు. ఒక వ్యక్తి, ఒక పార్టీ ఆలోచనే తెలంగాణ సమాజం ఆలోచన అనుకోవడం తప్పు. మధ్య యుగాల చక్రవర్తులు పాలనలా ఇవాళ నడవదు... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించుకోబోతున్నాం. ఈ ఒక్కరోజు తెలంగాణ సమాజం కోసం సమయం ఇద్దాం. ఇవాళ వివాదాలకు తావు ఇవ్వొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతీ సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుందాం. దేవత ఆశీర్వదిస్తుంది.. తల్లి ప్రేమను అందిస్తుంది. ఆ తల్లి అవతరణ ఉత్సవాలను గొప్పగా జరుపుకుందాం’’ అని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

Tags:    

Similar News